Monday, February 23, 2015

A dashed down Jumbo wish :(

ఒక సంవత్సరంగా ఉన్న ఒక చిన్ని ఆశ ఇవాళ పేపర్ చదవగానే "హుష్ కాకి" అయ్యిపోయింది:(

అదేమిటంటే ఆమధ్య పేపర్లో చదివాను. మైసూరు మహారాజ వంశంలో చివరి రాజుగారు పిల్లలు లేకుండా మరణించారు అని. అంతే. నాకొక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. అదేమిటంటే నా చిన్నప్పుడు చాల జానపద సినిమాల్లో చూసాను. చందమామ కథల్లో చదివాను. పూర్వం ఎవరైనా రాజుగారు కూడా పిల్లలు లేకుండా మరణిస్తే రాజుగా ఎవరిని నియమించాలి అన్నదానికి ఒక పధ్ధతి అవలంబించేవాళ్ళు. అదేమిటంటే రాజుగారి మదపుటేనుగుకి ఒక తాజా పూలహారం ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ ఏనుగు దానిష్టం వచ్చిన వేపు ఇష్టం ఉన్నన్నాళ్ళు తిరిగి దానికి ఇష్టం వచ్చిన వాడి మెడలో ఆ హారం వేసేది. వెంటనే ఆ వ్యక్తిని మహారాజుగా ప్రకటించేసి తతిమ్మా కార్యక్రమం చేపట్టే వాళ్లు. (ఆ ఏనుగు అప్పుడు అలా రోజులు రోజులు, కొండొకచో కొన్ని వారాలు అలా రాజ్యమంతా తిరిగేస్తూంటే ఆ పూలహారం వాడిపోతే, తరుచుగా మళ్ళీ తాజా హారాలు దానికిచ్చే వాళ్ళా అన్న డిటైల్ చరిత్ర పుటల్లో మరుగున పడిపోయింది!)

ఇప్పుడు ఈ మైసూరు మహారాజు గారి ఆస్థాన advisors కూడ ఇలా మరుగుపడ్డ సాంప్రదాయాన్ని పాటిస్తారేమో అని ఒక చిన్ని ఆలోచన వచ్చింది. ఏం? ఎందుకు అలా చెయ్యకూడదు? అసలే మైసూరుకి దగ్గరలోనే ముదుమలై అడవి ఉంది. దాన్నిండా బోల్డు ఏనుగులున్నాయి. అందులో మాంఛి నదరుగా ఉన్న ఏనుగు "అడవి రాముడు" సినిమాలో "కాళి"గా అద్భుతంగా నటించింది కూడా:) కాబట్టి అలా ఏనుగుల్ని తరుచుగా చూస్తుంటారు కాబట్టి, ఇప్పుడు వాటిని వాడుకొనే అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఆలోచన వచ్చే అవకాశాలు చాల ఎక్కువ!

వెంటనే ఒక చిన్ని ఆశ కూడా! అదేమిటని మీరు అడగక్కరలేదు. చెప్పకుండా ఉండలేను! అలా వాళ్ళు దేశం మీదకి వదిలిన ఏనుగు సరాసరి హైదరాబాద్ వచ్చి నా మెడలో ఆ హారం వేసే అవకాశం ఉంది కదా అని:) అసలే  (అదృష్ట)లక్ష్మికి ఏనుగులు బాగా క్లోజ్ కూడా. ప్రతి లక్ష్మీదేవి ఫోటోలో వెనకాల రెండు ఏనుగులుంటాయి కదా! ఒక తెలుగు సినిమాలో ఓ డైలాగ్ కూడా ఉంది "లక్ష్మి దేవి బిజీగా ఉంటే ముందస్తుగా ఏనుగుని పంపిస్తుందని!

ఇలా ఆలోచన వచ్చిందే తడవు వెంటనే ప్రతి రోజు వీధి కుక్కకంటే ఎక్కువగా రోడ్లమీద తిరగడం మొదలెట్టాను. ఎందుకంటే ఏనుగు కంట్లో పడాలి కదా! నా ఇంట్లో నేను కూర్చుంటే ఎట్లా? పోనీ ఏనుగు నన్ను వెదుక్కుంటూ వస్తుందనుకుంటే నేను మేడమీద ఉంటానాయే! ఏనుగుకి మేడ ఎక్కడం కొంచం Jumbo ప్రొబ్లెం కదా. అయినా అంటే బాధ పడతారు కాని సమయం వస్తే అదృష్టం తలుపు తడుతుందని వీధి తలుపు వేసేసి, గడియ పెట్టేసి, ఏసి రూంలో ముసుగేసుకోని పడుక్కుంటామా? మన వంతు కూడా కుంఛమ్ సహకరించాలి కదా. అంటే కనీసం ఇంటి బైట ఒక నేమ్ బోర్డు పెట్టడం, పగలంతా వీధి తలుపు తీసి ఉంచడం లాంటివి అన్నమాట! కాని అదృష్టం ఏనుగు రూపంలో వస్తున్నప్పుడు ఇంకొంచం సహకరించాలి కదా. అందుకని రోడ్లన్నీ తిరిగేశాను.

కొన్నాళ్ళకి ఇంకో అనుమానం వచ్చింది. అదేమిటంటే ఆ సదరు ఏనుగుకి వయసు మీద పడ్డా, లేక బద్ధకం ఎక్కువైనా, లేక బొత్తిగా వ్యాయామం లేక కొంచం బరువు ఎక్కువైనా, లేక మరీ దూరం వెళ్తే మళ్ళీ ఇంత దూరం వెనక్కి నడవాలనే బ్రిలియంట్ ఆలోచన వచ్చినా ఆ ఏనుగు మైసూరు నించి హైదరాబాద్ దాక వచ్చే అవకాశాలు కొంచం సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. అంతే ఇలా ఈ అనుమానం రావడం ఆలస్యం వెంటనే ఒక మంచిరోజు చూసుకుని బెంగుళూరు వెళ్లాను. వెళ్లి ఆ రోడ్లన్నీ లోకల్ కుక్కల కన్నా ఎక్కువగా తిరిగాను. కాని విధి వైపరీత్యం. నాకు ఏనుగు కనిపించలేదు. ఏదో నా పిచ్చి కాని నాకు ఏనుగు కనిపించడం ఏమిటి? ఏనుగుకి నేను కనిపించాలి కాని! అయినా నా ప్రయత్న లోపం లేకుండా కృషి చేసాను. కాని బెంగుళూరులో ట్రాఫిక్ మరీ ఎక్కువ. ఏనుగైనా సరే ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అలా గంటలు గంటలు ఉండిపోవాల్సిందే. నాకింకో చిన్ని సందేహం కూడా వచ్చిందండోయ్! సినిమాల్లో చూపించినట్టు ఏదైనా సిగ్నల్ దగ్గర ఒక వేపు ఏనుగు కోసం నేను, ఇంకో వేపు నాకోసం ఏనుగు చూసుకుంటూ, ఒకర్ని ఒకరు చూసుకోకుండా చెరో వేపు వెళ్లిపోయామేమోనని! అందుకీ ఇంగ్లీష్ వాళ్ళు "లైఫ్ ఈజ్ స్ట్రేంజర్ than ఫిక్షన్" అని వాళ్ళ భాషలో వాపోయారు! అయినా ఊరు కాని ఊళ్ళో కాబోయే మహారాజుని అలా వీధుల వెంట ఎక్కువగా తిరగడం మంచిది కాదని వెనక్కి తిరిగి వచ్చేసాను .

వచ్చేసి మా ఇంట్లో హాల్లో ఎంచక్కా కాలి మీద కాలేసుకుని కూర్చోడం మొదలెట్టాను. రేప్పొద్దున్న మహారాజు అయ్యాక అలాగే దర్జాగా కూర్చోవాలి కదా! ఇప్పటినించీ ప్రాక్టీసు అన్న మాట. అలా కాలి మీద కాలేసుకుని కూర్చుంటే కడుపు కాలే ప్రమాదం ఉన్నా కూడా లక్ష్య పెట్టకుండా! The Secret పుస్తకం చాలాసార్లు చదివి వంట పట్టించుకున్నాను! మనకేదైనా కావాలంటే అది మన దగ్గర ఉన్నట్టే ప్రవర్తిస్తే అది వెంటనే వస్తుంది/ జరుగుతుంది అని!

అలా కాలి మీద కాలేసుకుని కూర్చుంటే టైం పాస్ ఎలా? అందుకని పేపర్ ఈ చివరి నుంచి ఆ చివరిదాకా చదవడం మొదలెట్టాను. అదిగో అందులో భాగంగానే ఇవాళ పేపర్ చదివేస్తుంటే చూసిన షాకింగ్ వార్త  ఏమిటంటే మైసూరు మహారాణి ఎవరినో దత్తత చేసుకుందని!

మరి నా ఆశ "హుష్ కాకి" కాక "హుష్ ఏనుగు" అవుతుందా?

ఏమిటో జీవితం! చిన్ని చిన్ని కోరికలు కూడా తీరటం లేదు.

No comments:

Post a Comment