Friday, May 3, 2019

"నిత్యం ఏకాంత క్షణమే అడిగా" ! నా వెర్షన్

నిన్న సాయంత్రం నా గురువుగారు వేటూరి గారు రచించిన !పాట విన్నాను . నేను వేటూరి గారికి ఏకలవ్య అభిమానిని! అదేమిటి ఏకలవ్య శిష్యుడు అనాలి కదా అని మీకు ఓ సందేహం వస్తుంది. వారికి శిష్యుడు అయ్యేంత జ్ఞానం కూడా లేదు కాబట్టి కేవలం అభిమానిగా మిగిలిపోయాను. ఇక మరి "ఏకలవ్య" అని ఎందుకు రాసావు అంటే వారికి నేను అభిమానిని అని వారికి తెలీదు కదా అందుకని!

ఇహ విషయం ఏమిటంటే నిన్న ఆ పాట ఇంటికొస్తున్నప్పుడు విని ఇంటికొచ్చి కాసేపయ్యాక నాకు విపరీతమైన మూడ్ వచ్చేసి నేను కూడా అలాంటి కాన్సెప్ట్ తో రాసెయ్యడానికి ప్రయత్నించాను.

మీకు ఒక సీక్రెట్ చెప్తాను. నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పటినించి సినిమా పాటలు రాయడం చాలా సులభం అన్న ఓ దురభిప్రాయంతో చాలాసార్లు నేను కూడా పాటలు రాయడానికి ప్రయత్నించాను. కానీ సక్సెఫుల్ గా ఫెయిల్ అయ్యిపోయాను. ఎందుకంటే పాటలు రాయడం పదాల, సమాసాల గారడీ అనుకుంటే అది ఓ పేరడీ అవుతుందేమో కానీ ఓ పాట అవ్వదు. కొన్నిసార్లు విఫలమయ్యాక అర్ధం అయ్యింది ఎందుకు ఫెయిల్ అవుతున్నానో. ఎందుకంటే పాట రాసేముందు ఒక కాన్సెప్ట్ / అవుట్ లైన్ ఉండాలి. అప్పుడు రాయడం ఒకింత సులభం అవుతుంది. లేదంటే ఒక్క మాట కూడా ముందుకు కదలదు!

అసలు సినిమా పాటలు ఎలా రాస్తారు అని నాకు తెలిసిన ఒకే ఒక సినీ గేయ రచయిత Chaitanya Prasad  గారిని అడుగుదామనుకుంటూనే అలా రోజులు గడిచిపోతున్నాయి. భయపడకండి. నేను సినిమా పాటలు రాయదలుచుకోలేదు. అది నా వల్ల కాని పని. నాకు చేతనైనది ఇలా పోసుకోలు కబుర్లు, ఊసుపోక ఊసులు రాయడం. చెప్పడం. ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే చాలు.

ఈ "నిత్యం ఏకాంత క్షణమే అడిగా" పాటలో బ్రహ్మాండమైన కాన్సెప్ట్ ఉంది! అది ఏమిటి అంటే ఎవరికైనా ఉండే అభూత కోరికలు. అంటే ఎప్పటికి, ఎప్పుడో కానీ జరగనివి. నేను ఆ కాన్సెప్ట్ పట్టుకుని రాయడం మొదలెట్టా. అంతే బోల్డు వాక్యాలు 5 నిమిషాల్లో వచ్చాయి! కొన్ని "అతి" ఉన్నాయనుకోండి

పిడకలవేట: ఈ పాట ఆసాంతం వేటూరిగారి ఒరిజినల్ కాదు! తమిళంలో వైరముత్తు గారు రాసిన పాటకి స్వేఛ్చానువాదం. ఒకింత సొంత సాహిత్యం! యూట్యూబ్ భాషలో చెప్పాలంటే అవాక్కయ్యారా? అవ్వండి. ఆ సంబ్రమాశ్చర్యాల నించి తేరుకున్నాక తీరిగ్గా, తీరుబడిగా మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసం చదవండి. http://swaraalapallaki.blogspot.com/2017/05/20.html.

ఇహ నే రాసిన నాలుగు వాక్యాలు!

జీవితమంతా యవ్వనమడిగా
యవ్వనమంత జీవితమడిగా
చెలిమి చేసే చెలినే అడిగా
చెలియలాంటి ప్రియురాలిని అడిగా
మన్మధ బాణం ఇమ్మని అడిగా
ఎన్నడు పగలని హృదయం అడిగా
ఎప్పుడు అలియని శరీరమడిగా
దుమ్ము లేపే దమ్మే అడిగా
ఇంద్రధనుస్సుకి బాణాలడిగా
ముత్యాల్లాంటి పిల్లలనడిగా
ఆ పిల్లలలాంటి ఆణిముత్యాలడిగా
ఎండాకాలం వానలనడిగా
వానాకాలం ఎండా వానల నడిగా
నిఘంటువులో లేని పదాలనడిగా
ఆ పదాలకి పరమార్ధం అడిగా
ఎవ్వరు నడవని బాటే అడిగా
పెదవి దాటని మాటే అడిగా
అక్షయ పాత్రని అరువే అడిగా
పాశుపతాస్త్రం చూపించమనడిగా
పారిజాతం విత్తనమడిగా
కామధేనువు దూడని అడిగా

PS: పెద్దలు ఆ చివరి రెండు వాక్యాలు గురించి ఆగ్రహించి శపించకండి! ముందే చెప్పా! కొంచం "అతి" ఉందని

రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఇంకా పొడిగించి నేను సైతం ఓ 80 వాక్యాలు చెయ్యదలిచాను.

Friday, April 5, 2019

Ugadi! ఉగాది!!

ఓపిక, తీరిక లేనివాళ్ళందరికీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు! ఇదేటిదీ ఇలగంటున్నానేటి అని సంబ్రమాశ్చర్యపడకండి. నేను కోడికంటే ముందు లేస్తాను కాబట్టి నాకు బోల్డు సమయం ఉంది బోల్డు పెద్ద పోస్ట్ రాయడానికి సంకల్పించాను. మరది సదవాలంటే మీక్కూడా బోల్డు టైం ఉండాలిగా? అది లేనివాళ్ళకి ముందస్తుగా చెప్పేసాను.

ఇహ తీరిక ఉన్నవాళ్లు, తీరిక చేసుకున్నవాళ్ళు అమెరికావాడిలాగా ఓ పెద్ద జగ్గు సైజు మగ్గులో వేడి కాఫీ పోసుకొని, పడక్కుర్చీలో కాళ్ళు బార్ల చాపుకొని ఆ కాఫీ ఆస్వాదిస్తూ సదూకోండ్రి.

ఇవాళ ఉగాది అన్న విషయం తెలుగు పెజానీకానికి తెలిసిన విషయమే. కానీ ఇప్పటి తరాలకి తెలీని విషయాలు ...

ఇవాళ తెల్లారగట్లే లేచి .... ఎందుకులెండి... యువతరం బాధపడతారు... పొద్దున్నే లేచి (పొద్దున్నే అంటే ఏ గొడవా ఉండదు... పదింటికి లేచినా పొద్దున్నే!)... కూసీపయ్యాక జుట్టుకు భారీ ఎత్తున నూనె మర్దనా చేసి అంటే తబలా వాయించినట్టు అన్నమాట, ఆపై వళ్ళంతా శుభ్రంగా నలుగుపెట్టుకుని ..ఇగో కుర్రాళ్లు నలుగు పెట్టడం అంటే ఏంటి ఇది మాకు అవుట్ అఫ్ సిలబస్ అని నన్ను సింపుల్గా దాన్ని వివరించమని అడక్కండి. ఆశ, దోస, అప్పడం, ఆవడ! ఛస్తే చెప్పను. నాకసలే బోల్డు పనులున్నాయి. కావాలంటే మీ ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళుంటే వాళ్ళని అడగండి. లేకపోతె గూగుల్ చెయ్యండి.

నలుగు పెట్టుకుని ఓ చిన్ని తువ్వాలు చుట్టుకుని అంటే జ్యోతిర్లచ్మి సీరంత తువ్వాలు అన్నమాట! అలా ఓ గంటసేపు ఎండలో సంచరించండి. ఒళ్ళంతా చిమచిమలాడాక కుంకుడుకాయలతో అభ్యంగనస్నానం చెయ్యండి. ఈ కుంకుడుకాయలేంటి అంకుల్ అని విసిగించకండి. ఈ అంకుల్ అంటీ పిలుపులంటే నాకు మా సెడ్డ సిరాకు. కుంకుడుకాయలంటే కూరొండుకునే బెండకాయ, వంకాయ టైపు కాదు! అవెట్టి అంటే వాటిని ఓ గుండ్రాయితో పగలకొట్టి మీరు షాంపూ తో తలస్నానం చేసినట్టు చెయ్యడం! ఈ కుంకుడుకాయలు ఎక్కడ దొరుకుతాయని మరింకో యక్షప్రశ్న వెయ్యద్దు. అమెజాన్ వాడు ఈపాటికి అమ్మడం మొదలెట్టే ఉంటాడు! ఆర్డర్ సెయ్యండి. రెండుగంటల్లో ఇస్తాడు. అన్నట్టు కుంకుడుకాయలు బద్దలుకొట్టినప్పుడు లోపల నల్లటి గుండ్రంగా ఉన్న గింజలు ఉంటాయి. ఓ గింజనట్టుకుని గచ్చుమీద పదిసార్లు బాగా రుద్ది వెంటనే మీ చేతిమీద పెట్టుకుని చూడండి. మస్తుగుంటది!!

అలా అభ్యంగనస్నానం ... ఓహో ఇది కూడా తెల్దుగా ... సింపుల్గా తలంటు! ఈ కార్యక్రమం జయప్రదంగా ముగించాక ఇంకో పావుగంట ఓ మంచి కాలక్షేపం పనోటుంది. అదేటంటే ఆ కుంకుడుకాయ తొక్కలు, గింజ ముక్కలు మీ జుట్టులో ఇరుక్కుపోయిన వాటిని ఒకటొకటి పీకడం. బోల్డు టైం పాస్... ఓ పక్క ఈ ఫేస్బుక్ సూస్తూ.

ఒక కోతి ఇంకో కోతికి తల్లో పేలు చూసినట్టు, మీరు ఇంకోళ్ళ జుత్తులో ఉన్నవి పీకి మీ జుత్తులోవి వాళ్ళని పీకమనండి. ఎవరు ఎక్కువ పీకితే వాళ్లకి రెండో వాళ్ళు ఓ నూట పదహార్లు సదివించుకోవాలని ఓ పందెం పోటీ కూడా సర్దాగా పెట్టుకోవచ్చూ.

ఆ పైన మీ ఇంట్లో ఉన్న దేవుడికి ఓ చిన్ని నమస్కారం పడేసి మీకు కంఠతా రాకపోతే గూగుల్ చేసి "శుక్లాంబరధరం ... " అని ఓ రెండు లైన్ల శ్లోకం సదివేసి... దానర్ధం తర్వాత తీరిగ్గా తెలుసుకుందారి ... అది తప్పులు పోకుండా సదివి... ఆ తర్వాత ఉగాదిపచ్చడి తిని, ఒకింత తాగితే ... అందులో ఉన్న షడ్రుచులు ... ఇదేటి మాస్టారూ ఆడపడుచులు అని విన్నాం కానీ ఈ షడ్రుచులు ఏటంటారా? కూసింత అప్పుడప్పుడూ తెలుగు నేర్చుకుంటే బాగుంటుంది. షడ్రుచులు అంటే ఆరు రుచులు ... బహుశా ఆరు ఋతువులకి గుర్తుగానేమో . అవి తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు! ఇవన్నీ ఆ ఉగాదిపచ్చడిలో ఉంటాయి. భారీఎత్తుని తినండి! తాగండి! ఇక్కడ ఓ నమ్మకం ఉందండోయ్! ఉగాదిపచ్చడి నోట్లో వేసుకోగానే మనకి ముందస్తుగా ఏ రుచి తగులుతుందో ఇహా ఈ సంవత్సరం అంతా ఆ అనుభవాలు ఎక్కువగా ఉంటాయి అని! ఉదాహరణకి తీపి తగిలితే ఇంకేముంది హోల్ ఇయర్ హోల్ సేల్ గా తీపి గుర్తులే! ఇక్కడ వాస్తు మార్పులు చేసి మన అదృష్టాన్ని మనకిష్టం వఛ్చినట్టు మార్చేసినట్టు మనకి ఏ అనుభవం కావాలనుకుంటే తత్సంబంధమైనది ఒకింత ఎక్కువ వేసి పచ్చడి చేస్తే సరి! ఉదా: బెల్లం ఎక్కువేస్తే ఇహ మరి తియ్యగానే కదా ఉండేది! మరింకేం రెచ్చిపోండి.

అన్నట్టు సెప్పడం మర్సేపోయా మీకు పండక్కి, పబ్బానికి (లోపాయికారీ మేటర్ ఏమిటంటే ఈ పబ్బానికి అన్న మాటకి అర్ధం నాకూడా తెలీదు!) కొత్త బట్టలు వేసుకునే సాంప్రదాయం ఉంటే అవి వేసుకుని ఆ పైన దేవుడికి దండం, ఉగాది పచ్చడి తిండం!

అటు పిమ్మట పంచాంగ శ్రవణం! అంటే ఇంట్లో పంచాంగం ఉందనో, లేక ఆన్లైన్ లో చూసో మీ రాశిఫలాలు చదివేయడం కాదు! శాస్త్రం ఒప్పుకోదు! ఇంకొకళ్ళు చదివితే వినడం! ఆ రాశిఫలాలు, ఆదాయ వ్యయాలు విని నిరాశపడకండి.

ఆ తర్వాత పచ్చడి (మెతుకుల)తో కడుపు నిండదు కాబట్టి... పండగ పూట కూడా పాత మొగుడేనా అన్నట్టు ఇవ్వాళ ఇంట్లో టిపినీకి బ్రేక్ ఇచ్చి స్విగ్గీ వాడితో మంచి ఒటేలునుంచి జబర్దస్త్ టిఫిన్ తెప్పించుకొని లాగించేయ్యండి.

తర్వాతేముంది ...షరా మామూలే... వాట్సాప్ లో వచ్సిన ప్రతి మెసేజ్ ని ప్రతి గ్రూప్లో ఫార్వర్డ్ చెయ్యడం, ఇక్కడ ఓ పోస్టు పడెయ్యడం. తర్వాత అబ్బా బాగా అలిసిపోయాం అని బోయనం టైం దాకా ఓ కునుకెయ్యడం. ఏ మాటకామాటే! నలుగెట్టుకొని, తలంటోసుకున్నాక నిద్రొస్తుంది చూడండి...

నిద్ర లేచాక, క్షమించాలి లేపాక... భారీగా ఆవలించి ఏమిటి పండగ స్పెషల్ అని మీ ఆవిడనో, ముమ్మీనో విసిగించి ఆవిడ పెట్టినవి తిని netflix లో బింజ్ వాచింగ్!

మరిహ సాయంత్రం ఓ నలుగురింటికెళ్లి వాళ్ళందరి ఉగాది పచ్చడి తిని తాగి పదింటికి కొంప చేరి ధామ్మని మంచం మీదకి గెంతి బొబ్బొడం!

ఇలా చేసిన వాళ్లందరికీ, వచ్చే ఏడాది చేద్దాంలే అనుకుని ఇవాళ ప్రతి రోజులాగే సాదా సీదాగా గడిపేసే వాళ్లందరికీ ... ఇవన్నీ ఎందుకు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 

Wednesday, March 27, 2019

"Dream" dream!

Had a "dream" dream today early morning😎

In the dream I and my wife went to Srisailam and had a darshan of the Lord. While coming out of the temple we lost our way and found ourselves in the underground labyrinth and strangely few of the walls and sometimes the floor was metal.

We saw a person who looked like the temple official and asked him the way out and he told us to follow him but after a minute he simply vanished!

We went on going down through the maze and finally found ourselves at the base of the Shiv Ling which is HUGE and a oil lamp was flickering there! We are pleasantly surprised to say the least and when we looked up we actually saw the Lord Shiva in human form in a squatting position with his eyes closed (just like they show in movies!!)

And we began ascending through another maze of passageways wherein few employees could be seen. Though we tried to talk to them they just didn't pay attention. It was as though we were invisible! And finally we somehow came out and found ourselves again in front of the Linga!

It WAS a very strange dream. Never had one like this before.

Do you have any insightful interpretation/ meaning for this dream apart from simply saying that I need to visit Srisailam🤓

Saturday, January 5, 2019

కూరలు అద్భుతమైన రుచి రావాలంటే?.... ఓ సీక్రెట్!!

ఈ పోస్ట్ కేవలం వంటవారికి మాత్రమే! అంటే వంటచేయు ఆడ, మగవారికి!

అలా పైవిధంగా హెచ్చరించినా మిగతా అశేష ప్రజానీకం కూడా చదువుతారని నాకు తెలుసు! చదవండి! కానీ మీకేం ఉపయోగపడదు! ఆనక నన్నేమీ తిట్టద్దు!

పొద్దున్నే అంటే హైదరాబాద్భాషలో చెప్పాలంటే మబ్బుల్లో లేవడం ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలీక మా ఆవిడకి సాయం చేసినట్టుంటుంది, కాలక్షేపం అవుతుంది అని ఏదో ఒక కూరచేసి పారేయ్యడం! అంటే ఏదో వ్యావహారిక పదప్రయోగం చేశా కానీ చేసిన కూర తినలేక పారేయ్యడం కాదని వివరణ!

అలాగే ఇవాళ కూడా మబ్బుల్లో లేచి ఎప్పటికి న్యూస్పేపర్ రాకపోతే కనీసం కూరైనా అవుతూంటుంది అని ముందస్తుగా పొపేసి బెండకాయలు వేసేటప్పటికి పేపర్ వచ్చింది.

మరిహ నిన్న చంద్రబాబుని PM, ఇంకో CM లేటెస్ట్ గా నిన్న ఏం ఆడిపోసుకున్నారో సవివరంగా చదవడంలో మునిగిపోయాను. ఇటీవల అదేగా రోజూ హెడ్లైన్స్!

కొత్త విమర్శలు కొన్ని చదివాక ఏదో మాడుతున్న వాసన రావడం మొదలయ్యింది. పొద్దున్నే లేచాక కేవలం ఓ కప్పు కాఫీ తాగుతా తప్పిస్తే టిపినీలు గట్రా తొమ్మిదింటికే! అప్పటిదాకారోజూ నా కడుపు మాడుతూంటుంది కానీ ఇలా మాడిన వాసన రావడం ఇదే మొదలు. ఇదేదో డికెష్టి చెయ్యాల్సిందే అని డికెష్టి ఎక్కడినించి మొదలెట్టాలా అని క్లూస్ కోసం చూసేంతలో వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టు మాడు వాసన మరింత పెరిగింది. ఇహనేం అదేనా మొదటి క్లూ!

మునుపు శబ్దాన్ని వెదుకుతూ వెళ్లే శబ్దభేది బాణంలా నేనే ఓ బాణంలా వాసనని పోలీసుకుక్కలా వాసన చూసుకుంటూ వెళ్ళా. పోలీసుకుక్క నేరస్తుడి దగ్గరకి తీసుకెళ్లినట్టు నన్నా మాడు వాసన దాని జన్మస్థానానికి తీసుకెళ్లింది.

అదేదో వేరే చెప్పాలా? మూకుడులో నేను వేగుతోందనుకున్న కూర

ఉల్లిపాయలు సన్న సెగమీద వేగేదాకా ఆగలేక నేను రోడ్డు పక్కన ఈటింగ్ జాయింట్ వాడు వండేట్టు స్టవ్ హెచ్చించి ఉల్లిపాయలు వేచుతాను!

స్టవ్ హైలోనే ఉందన్న విషయం మర్చిపోయి తర్వాత బెండకాయలు మూకుడులో వేసి, హాల్లోకి వెళ్లి తాపీగా పేపర్ తిరగేస్తూ సెటిల్ అయ్యిపోయా. మరి కూర మాడిందంటే మాడదా?

వెంటనే ఆ మాడుతున్న కూరని సముద్రంలో సునామీ టైపు లో కిందనించి పైకి, పైనించి కిందకి, కుడినించి ఎడమకి, ఎడమనించి కుడికి, ఇలా వాషింగ్ మెషిన్ లో బట్టలు తిరిగినట్టు కలియతిప్పా! అప్పుడు తెలిసింది. మాడింది కూర మొత్తం కాదు. కేవలం కింద భాగం అని. కానీ గమ్మత్తు ఏమిటంటే అలా ఓ పావు వంతు మాడిన కూర సివరాకరికి అద్భుతమైన రుచి వచ్చింది.

దీన్నిబట్టి నాకు తెలిసిన, మీ అందరికీ అంటే కేవలం వంటవారికి, తెలియచెప్పే, విశేష సీక్రెట్ ఏమిటంటే కూరలు మాంఛ్చి రుచిగా రావాలంటే కావాలని ఒకింత దగ్గరుండి మాడ్చండి 😎

Monday, December 24, 2018

"వీలు"నామా అంటే వీలు చూసుకొని రాసేది కాదురా బాబూ!

ఇవాళ పొద్దున్నే ఒక హీరోచితమైన, ఒహరకంగా ప్రాణాలకి తెగించి ఓ సాహసం చెయ్యడానికి సిద్ధపడ్డాను.

ఈనాడువారి భాషలో ఇక వివరాల్లోకి వెళ్తే ....

హైదరాబాద్లో గత వారం రోజులుగా వాతావరణం ఎలా ఉందో పాఠకులకి విదితమే.

మరంచేత వారం రోజులుగా నేను తలంటు పోసుకోలేదు. ప్రతిరోజు విపరీతంగా బైట తిరిగే అలవాటు. మరి వారంపాటు తలంటు పోసుకోకపోతే నా సామిరంగా జుట్టంతా ఒహటే దురద. పైపెచ్చు వారంలో మూడు రోజులు ట్రైనింగ్ ఇస్తానుగా వాళ్లముందు మొదట్లో ఒక చేత్తో తలగోక్కోడం మొదలెట్టా!

నాకు ముందస్తుగా ప్రిపేర్ అయినా అవ్వకపోయినా నోట్స్ వేపు కన్నెత్తి అయినా చూడకుండా "ఆశువుగా" మాట్లాడడం అలవాటు. ఆ క్రమంలో బహుశా తర్వాతి పాయింట్ గుర్తు రాక గోక్కుంటున్నానేమోనని ఆ ఉద్యోగులంతా ఊహాగానాలు చేసుకున్నారు.

కానీ రోజులు గడుస్తున్నకొద్దీ తలంటు పోసుకొని కారణంగా దురద ద్విగుణీకృతం అయ్యి ఒక చెయ్యి చాలక సిగ్గు, బిడియం, మొహమాటం వగైరా అన్నీ హోల్సేల్ గా వదిలేసి రెండు చేతుల్తో గోక్కోవాల్సిన అవసరం వచ్చే పరిస్థితికి దారి తీస్తుందేమోనని మా చెడ్డ అనుమానం వచ్చి ఇవాళ ఎలాగైనా తలంటు పోసుకోవాలని ముందూ వెనక ఆలోచించకుండా దృఢ నిర్ణయం తీసేసుకున్నా!

అంతవరకు బాగుంది. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఈ తలంటు కార్యక్రమం బాగా రిస్క్ తో కూడిన వ్యవహారం కదా ? పైగా నాకు వయసు మళ్లిందాయే. కాస్త అటూ ఇటూ అయితే పెద్ద ప్రాణానికే ముప్పు. అంటే కికింగ్ ద బకెట్. ఏ మాటకా మాటే. ఈ కికింగ్ ద బకెట్ కి బాత్రూం చక్కగా సరిపోయే ప్రదేశం కదా!

ఏది ఏమైనా ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినని టైపు కాబట్టి తువ్వాలు నడుముకు చుట్టి యుద్దానికి వెళ్లే సైనికుడిలా తెగ ఫీల్ అయిపోతూ బాత్రూంలోకెళ్లి తలుపుకి గడియ పెట్టబోతూంటే ఎంతైనా నాది ఒకింత మేధావి బుర్రకదా ఠక్కున ఓ ఐడియా వచ్చింది.

వెంటనే తలుపు తీసి మా ఆవిడని పిలిచా. అవిడగారు అబ్బబ్బా ఏమిటండీ. ఓ పక్క టైం అవుతోంది. మీకు లంచ్ బాక్స్ ప్యాక్ చేసి మీకు దోశలు వెయ్యాలి. అని నాకు సుపరిచితమే అయిన దండకం చదువుతోంది. ఈ ఆడాలెప్పుడూ ఇంతే. సమయం సందర్బం చూడకుండా అలా అలవాటుగా రొటీన్ డైలాగ్స్ వదులుతారు.

ఇప్పుడు నేను పిలిచింది ఒహరకంగా చివరి చూపులు చూసుకోమని కదా? అర్ధం చేసుకోరూ?

సరే నేను వచ్చేదాకా విసిగిస్తాగా ? నా బాధ పడలేక దర్శనం ఇచ్చింది మా ఆవిడ. వెంటనే అప్పగింతలు కార్యక్రమం మొదలెట్టా! "మా ఆవిడ బంగారం" అని మనసా వాచా నమ్మా కాబట్టి, "మీకేంటండీ! ఇద్దరు బంగారం లాంటి పిల్లలున్నారు" అని పెజానీకం కోడై కూస్తే అమాయకుడిని కాబట్టి నమ్మేసి, ఏతా వాతా ఇంత బంగారం ఉన్నాక ఇంకా బంగారం కొనడం ఎందుకని నీకు వీసమెత్తు బంగారం కూడా కొనలేదు" అని అన్నానో లేదో "పోనీలెండి! మీ ప్రేమ నాకు తెలీదా? 1985 లో నాకు గుజరాత్ నించి మాంచి చీర పట్టుకొచ్చారు. అదే నాకు బంగారం" అంది. ఇందులో ఏదో శ్లేష ధ్వనించింది కానీ అదేమిటో విచారించి ఘాటుగా సమాధానం ఇవ్వలేకపోతున్నామని విచారించే సమయం సందర్భం కాదు. మరెందుకని వదిలేసి "వీలు చూసుకుని వీలునామా రాద్దామనుకున్నా కానీ గుండ్రాయిలా ఉన్నా కానీ ఇలా అర్ధాంతరంగా… " అని రాబోతున్న దుఃఖాన్ని యుద్దానికి బయలుదేరుతున్న వీర సైనికుడిలాగా లోపలే తొక్కేసి "నా ఆస్తులు నీకు చెప్పాలిగా! 1995 లో ఆ స్టెర్లింగ్ వాడు సవగ్గా అమ్ముతున్నాడనో నా తదనంతరం ఏపుగా పెరిగి నీకు పిల్లలకి ఆదుకుంటుందని ఓ పది టేకు చెట్లు కొన్నా! కానీ వాడు నిండా మోసగాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో, నా చెట్లు  ఏం చేసాడో. కాస్త ఓపిక చేసుకొని వాణ్ని పట్టుకున్నావంటే నీకిక డబ్బుకిబ్బంది ఉండదు. అలాగే ఈ పదేళ్ల కారు అమ్మకండి.  అమ్మితే ఏం రాదు. మళ్ళీ కొనాలంటే లక్షల్లో పని. నా మొబైల్ నువ్వు వాడుకో. పిల్లలకి ఈ పాత చైనా మోడల్ నచ్చదు. 

"ఓ ఇరవై నిమిషాల తర్వాత బాత్రూం లోపలినించి ఏవీ శబ్దాలు రాకపోతే గట్టిగా పిలవండి. నేను పలక్కపోతే వెంటనే 108 కి ఫోన్ కొట్టి దగ్గర వాళ్లకి వాట్సాప్ మెసేజ్ పెట్టటండి. నేను బాత్రూం లోపల గడియ పెట్టను. ఏవన్నా అటూ ఇటూ అయితే తలుపు బద్దలు కొడితే ఆదో అనవసర ఎక్స్ట్రా ఖర్చు. నా గురించి బెంగ పెట్టుకోకు. పైన దేవుడికి బాగా క్లోజ్ గా ఉంటాగా? నాకేం ఫర్వాలేదు. దేవుడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు చూసి కాస్త నీకేమైనా పింఛను  లాంటిది ఏర్పాటు చెయ్యమని ఓ అర్జీ పెట్టుకుంటా. ఆ పైనా దేవుడి దయ. నీ అదృష్టం"

ముందస్తు సంజాయిషీ : ఇదేటిది ముందస్తు అని చివరి మాటగా రాస్తున్నారు అంటే అదంతే . ఇదో ప్రయోగం. 

ఇంతకీ సంజాయిషీ ఏమిటంటే ఇదేమిటండీ పొద్దున్నే అశుభం మాటలు అని మీరెవరన్నా బాగా ఫీల్ అయి కామెంట్ పెట్టడం, దాంతో నేను బాగా ఫీల్ అయి మీకు సమాధానం చెప్పడం. ఇంతమంది ఎందుకు ఫీల్ అవ్వాలని ముందస్తు సంజాయిషీ. అసలు ఈ సంజాయిషీ అన్న మాట కరెక్ట్ కాదు . కానీ సరైన మాట గుర్తొచ్చేలోపల పుణ్యకాలం కాస్త అయిపోతుందేమోనని అదే వాడా. 

సంజాయిషీ: నా ఆల్మోస్ట్ పెతీ పోస్ట్ ద్వందార్ధముతో ఉంటుంది. అంటే తెలుగు సినిమాలకి అలవాటు పడ్డ పెజలు అర్ధం చేసుకునే ద్వందార్ధము కాదండోయ్! ఇక్కడ రెండర్ధాలు ఏమిటంటే ఒహటి చదవగానే నాలాంటి అమాయకులకు అర్ధమయ్యే అర్ధం! రెండోది ఒహింత మేధావులు కూసింత తెలివితేటలు  ఉపయోగిస్తే వాళ్లకి స్ఫూరించే నిగూడార్థం! ఇప్పుడు ఈ పోస్ట్ లో కూడా గసుంటిదే ఓ భారీ నిగూడార్థం embedded! చెప్పెయ్యమంటారా? అలాగే కానివ్వండి. మనందరికీ అంటే మనుషులందరికీ బుద్దుడు  చెప్పినట్టు ఓ తప్పుడు అభిప్రాయం ఉంది. అదేమిటంటే మనం చాలాకాలం బ్రతికేస్తాం అని! అది తప్పని అంటే అభిప్రాయం, అని తెలిసినా జీవితః బుద్బుద ప్రాయః అన్న నిజం ఒప్పుకోడానికి మనసొప్పదు. మరంచేత ఇంకా బోల్డు జీవితం ఉందికదా తర్వాత చెపుదాం లే అని మన పెళ్లాలకి (ఇక్కడ నిఝముగా ద్వందార్ధము లేదు!) మన ఆస్తి అప్పుల చిట్టా చెప్పం. LIC ఏజెంట్ భాషలో ఇహ పొతే ఆ తర్వాత మనకేం ఆస్తులున్నాయి. ఇచ్చిన అప్పులేమిటి. వసూలు  చెయ్యాల్సిన అప్పులేమిటి ఇత్యాది వివరాలు మనతోనే ఖతం ! పన్ ఆక్సిడెంటల్!

మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. మీ ఆవిడకి మీ బాలన్స్ షీట్ తెలుసా? దస్తావేజులు, నోటిమాటలు వగైరా అన్నీ ఏకరువు పెట్టారా?

ఇప్పటికి అర్ధం అయ్యిందా. నా పోస్టుల్లో ఉన్న ద్వందార్ధము కేవలం లోకకల్యాణం కోసమని