Friday, June 10, 2016

తపోభంగం!!

తపోభంగం!!

మొన్న పొద్దున్నే 5 గంటలకి లేచాను. పొద్దున్నే లేస్తే ఏం చెయ్యాలో తోచక ఏదోఒక వెధవ పని చెయ్యాలనిపిస్తుంది చాలామందికి. నేను కూడా ఆ మందిలో గోవిందా!

ఏం చెయ్యాలో మాంఛి ఫిల్టర్ కాఫీ తాగితే తడుతుంది అని వెంటనే ఫిల్టర్ వేసేశాను. నేను పొద్దున్నే లేచానని పాల వాడు లేవడు కదా పాలు రాలేదు. మనింట్లోనే ఆవుంటే ఈ కష్టాలుండవుకదా? ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు పితికేసుకోవచ్చు! దీన్నే ATM అంటారు అంటే Any Time Milk ;)

తాజా పాలు, తాజా డికాక్షన్ అయితే కాఫీ ఉత్తమం!  నిన్నటి పాలు, నిన్నటి డికాక్షన్  అయితే మధ్యమం. కాని నేను తాగింది అధమం. నిన్నటి పాలు, నేటి తాజా డికాక్షన్ తో ఒక రకమైన కాఫీ!! రుచి అడగద్దు. రెండు రకాలుగా ఉంది. కాని పొద్దున్నే కాఫీ తాగకపోతే బండి స్టార్ట్ అవ్వదు కదా. ఈ సమస్యకి ఒకటే పరిష్కారం. పాలొచ్చే దాకా లేవకపోవడమే!

మొత్తానికి అదో టైపు కాఫీ తాగాక ఏం చెయ్యాలనే  ఐడియా కోసం ఆలోచించడం మొదలెట్టా. అప్పుడో ఐడియా తట్టింది . ఏం  చెయ్యాలని కాదు. ఏం చెయ్యాలన్న ఆలోచన ఏం చేస్తే సులభంగా వస్తుంది అన్న ఐడియా!  బైట చిన్న తుంపర పడుతోంది. బాల్కనీ  చివర ఓ కుర్చీ వేసుకొని ఆ తుంపరలో మెడిటేషన్ చేస్తే ఎలా ఉంటుంది? అని.  ఎందుకంటే మెడిటేషన్ చేస్తే వచ్చేవన్నీ ఆలోచనలే కదా :(  పైగా  పూర్వం మునులు ఆరుబైట చెట్లకింద అడవుల్లో తపస్సు చేసుకొనేవాళ్ళు కదా. వాళ్ళు ఎండకి, వానకి చలించి తపోభంగం అయినట్టు ఏ తాళపత్రగ్రంధం లోనూ రాసిన దాఖలాలు లేవు. లేకపోతె ఇటువంటివి మూడో కంటి వాడికి తెలీకుండా తొక్కేసేరేమో?!

సరే వానలో అదే తుంపరలో టెస్ట్ రన్ చేస్తే పోయిందేముంది. వాన పెద్దదైతే పరిగెత్తి ఇంట్లోకి పారిపోవడమే. ఈ ఆలోచన రావడం ఆలీసం ఓ కుర్చీ తీసుకెళ్ళి మా రూఫ్  గార్డెన్ లో ఉన్న నాలుగు మొక్కల మధ్యన వేసుకొని కూర్చున్నా.

ఒక పక్కనించి తులసి మొక్క కొమ్మలు తగులుతున్నాయి. ఇంకోపక్క మా ఆవిడ పెంచుకుంటున్న నాకు పేరు తెలీని ఇంకో మొక్క కొమ్మలు గుచ్చుకుంటున్నాయి. మూడో వేపు నించి సన్నటి చినుకులు. కాని తపస్సు చేసేటప్పుడు ఇలాంటి చిన్ని, చిన్ని ఆటంకాలు పట్టించుకొకూడదుగా? వాటిని లక్ష్య పెట్టకుండా కళ్ళుమూసుకొని మెడిటేషన్ మొదలెట్టా.

అలా ఎంతసేపు మెడిటేషన్ చేసానో తెలీదు కాని ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. మెడిటేషన్ లో ఇలాంటివి మామూలే అనుకోండి. అదేమిటంటే మెడిటేషన్ చేస్తున్నా చుట్టుపక్కల శబ్దాలు వినిపిస్తుంటాయిగా. పాలవాళ్ళ స్కూటర్ శబ్దాలు, పేపర్ వాళ్ళ సైకిల్ శబ్దాలు, పనిమనుషులు గేట్లు తీసిన కిర్రు శబ్దాలు, ఉన్నట్టుండి వీధి కుక్కల అరుపులు, చిన్నపిల్లల ఏడుపులు, కొండొకచో దూరం నించి ఎమ్మెస్ గారి సుప్రభాతం, పార్క్ కి వాకింగ్ కి కారులో వెళ్ళే వాళ్ళ కారు శబ్దాలు, వాటి రివర్స్ హార్న్ కర్ణ కఠోర శబ్దాలు వగైరా!

ఈ శబ్దాలకి నా తపోభంగం కాదు. టీవీ చూస్తూంటే కింద స్క్రోలింగ్ లైన్స్ లాగా అవి అలా వినిపిస్తూంటాయి. నా తపస్సు అలా సాగిపోతుంటుంది .

కాని ఇంతలో వచ్చిన ఆ ఆలోచన ఏమిటంటే మాకు పేపర్ వేసేవాడు ఒక ఇంగ్లీష్ పేపర్, ఒక తెలుగు పేపర్ లుమ్మ చుట్టి ఒక మిస్సైల్ లాగా చేసి రోడ్ మీదనించి మా బాల్కనీ లో పడేట్టు గురి చూసి మాంచి స్పీడ్ తో విసురుతాడు. ఎంత స్పీడ్ అంటే మా వీధి తలుపు వేసి ఉంటే దానికి ఆ మిస్సైల్ తగిలి ఒక చిన్న సైజు బాంబు పేలిన శబ్దం వస్తుంది. వాడి గురి సరిగ్గా ఉంటే, మా తలుపు తీసుంటే అది నేరుగా ఇంట్లో హాళ్ళో పడి సర్రుని క్రికెట్ లో యార్కర్ లాగా నెల మీద ఒక పది అడుగులు దూసుకు పోతుంది. ఆ పేపర్ బాయ్ ఖచ్చితంగా క్రికెట్ ఆడతాడు. ఫాస్ట్ బౌలర్ ఏమో కూడా?! కాని టీవీ లో లైవ్ టెలికాస్ట్ చూసి వాడు కూడా కొన్ని బౌలింగ్ మెలుకువలు నేర్చుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ అయినా అప్పుడప్పుడూ స్లో బాల్ వేస్తాడు ;) అప్పుడు ఆ పేపర్ బాల్ ఇంట్లోకి రాకుండా మా మొక్కల మీద పడి వాటి కొమ్మలు, అప్పుడప్పుడూ వాటి నడుము విరిచేస్తుంది.

ఇప్పుడిదంతా మీకు రామాయణంలో పిడకలవేటలాగ అనిపించచ్చు. కాని అసలు మాటర్ ఇక్కడే ఉంది. నేను ఇప్పుడు కుర్చీ వేసుకొని కూర్చున్నది ఆ మొక్కల మధ్యలో! అంటే వాడి బౌలింగ్ పిచ్!! ఇప్పుడు నాకు వినిపిస్తున్న పేపర్ బాయ్ సైకిల్ శబ్దాల్లో మా వాడి సైకిల్ కూడా ఉండి వాడు కనక పేపర్ మిస్సైల్ విసిరాడంటే అది డైరెక్ట్ గా నా తలకి తగిలి కపాలమోక్షమే! తపస్సు చేసుకుంటూ మోక్షం, అందునా కపాలమోక్షం పొందిన మొదటి, బహుశా ఏకైక వ్యక్తిగా, (ఇంత రికార్డు స్థాపిస్తే వ్యక్తి ఏమిటి ఏకంగా మహర్షి అనాలేమో!) చరిత్రలో మిగిలిపోయే ప్రమాదం లీలామాత్రంగా గోచరించింది. మీలాంటి వాళ్ళ సంగతేమో కాని నాకు మట్టుకు ఇప్పుడప్పుడే మోక్షం పొందాలన్న కోరిక లేదు. ఎందుకంటే తీరని కోరికలు చాలా ఉన్నాయి. అవన్నీ తీరాక మోక్షం వేపు ద్రుష్టి సారిస్తాను. ఇప్పుడేమీ తొందర లేదు. మరిప్పుడు ఏం చెయ్యాలి. మెడిటేషన్ అపెయ్యడమా? కాదు.

అప్పుడు నాకో సందేహం వచ్చింది. మునుపు తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళే వాళ్ళు కదా. అడవిలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటూంటే ఏ పులో, ఎలుగుబంటో వచ్చి, వాళ్ళని "సిట్టింగ్ డక్" లాగ భావించి, వాటి తపస్సుకి మెచ్చుకొని దేవుడే వాటికి ఇలా "ఫ్రీ మీల్స్" ఏర్పాటు చేసాడని ఆనందపడి, తదనంతరం ఆ తపస్సు చేసుకొనే వాడి మీద పడి, ఆ రోజుల్లో ఫ్రిజ్ లేకపోయినా రోజంతా దాచి మూడు పూటలా శుష్టుగా భోజనం చేస్తాయి కదా. మరి ఈ భయం ఆ తపస్సు చేసుకొనే మునులకి రాదా? బోల్డు సంవత్సరాలు తపస్సు చేస్తే పోనీ కొన్ని శక్తులు వచ్చి వాళ్ళ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అప్పుడే తపస్సు మొదలెట్టి "L" బోర్డు పెట్టుకున్న పిల్ల మునుల గతేమిటి? వాళ్ళు తపస్సు, నేను హారర్ సినిమా చూసినట్టు అంటే భయంకరమైన సీన్లు వచ్చినప్పుడు రెండు కళ్ళూ దాదాపుగా మూసి, ఆ సీన్ ఎప్పుడయిపోతుందా అని తెలుసుకోవడం కోసం అతి తక్కువ కళ్ళు విప్పి భయంభయంగా చూసినట్టు చేసేవాళ్ళా? అంటే ఈ కొత్తగా తపస్సు మొదలెట్టిన మునులు అలా ఎక్కడ ఏ జంతువు వస్తుందో అని ఒక కన్ను మూసి, ఒకటి తెరిచి, లేదా అర్ధ నిమీలిత నేత్రాలతో చేసేవాళ్ళా? ఇప్పుడు నేను కూడా అలాగే చెయ్యాలా? అలా చేస్తే దాన్ని కొంగ / దొంగ జపం అంటారేమో?

(అయినా ప్రశాంతత కోసం మెడిటేషన్ చేస్తూంటే ఈ అశాంతి ఆలోచన ఏమిటి? )

లేకపోతే  ఇలా తపస్సు చేసుకోవడం కోసం వెళ్ళేవాళ్లకి మనకి ఇప్పుడు "పూజా సామగ్రి" అమ్మే దుకాణాలు ఉన్నట్టు  ఆ రోజుల్లో ప్రత్యేక  "తపస్సామగ్రి " అమ్మే దుకాణాలు ఉండేవా ? అందులో జింక చర్మం, కమండలం, కౌపీనం, ముడి పిన్నులు, రుద్రాక్షమాల,  దండం, వగైరా వగైరా అమ్మేవాళ్ళేమో? అక్కడే కుంచం పేరున్న మునీశ్వరుడి రికమండేషన్ తాళపత్రం మీద చూపిస్తే (మనమిప్పుడు మందుల షాపులో డాక్టర్ ప్రిస్క్రిప్షన్  చూపించినట్టు !) వాళ్లకి బహుశా "జంతు వికర్షణ యంత్రం" కూడా అమ్మేవారేమో? లేకపోతె ఇప్పుడు బొద్దింకలు గట్రా రాకుండా "లక్ష్మణరేఖ" టైపు విభూతి ఏమన్నా?! ఇలాంటివి లేకపోతే ఆ కొత్త మునుల తపస్సు నిరాటంకంగా ఎలా  జరిగేది? 

ఈ బేతాళ ప్రశ్నకి జవాబు ఏ తాళపత్రంలోనైనా ఉందా? మీకేమన్నాతెలుసా?!! 

సప్లిమెంటరీ బేతాళ ప్రశ్న జింక చర్మం మీద ఎందుకు తపస్సు చేస్తారు అందునా అహింసా వాదులు?!!

సప్లిమెంటరీ బేతాళ ప్రశ్న 2: ఇలా జింక చర్మం మీద కూర్చొని తపస్సు (ఈ రోజుల్లో మెడిటేషన్!) చెయ్యడం మన భారద్దేశంలో కనీసం ఒక 5 వేల సంవత్సరాల సాంప్రదాయం అని నాలాంటి వాడెవరైనా ఇప్పుడు ఒక చిన్న జింక చర్మం ఇంట్లో పెట్టుకున్నాననుకోండి నా మీద కూడా సల్మాన్ ఖాన్ మీదెట్టినట్టు కేసు పెడతారా ? ఇదెక్కడి అన్యాయం ?! నేను మన సనాతన , పురాతన సంస్కృతి ని ఎలా కాపాడాలి?! ఎలా? ఎలా? ఎలా?!!

నేనిలా మూడుసార్లు "ఎలా " అని అడిగానని  మీరు మీ జవాబు మూడు సార్లు రాయనవసరం లేదు ;)

Saturday, May 28, 2016

"వృక్షో రక్షతి రక్షిత"

"వృక్షో రక్షతి రక్షిత"

ఈ మధ్య హైదరాబాద్ లో గాలివానలు ఎక్కువగా వచ్చి బోల్డు చెట్లు పడిపోయాయి. "వృక్షో రక్షతి రక్షిత" అన్నారు కదా ఇలా ఉన్న నాలుగు చెట్లు పడిపోతే మానవ జాతికి నిష్కృతి లేదని ఏం చెయ్యాలని ఇటీవల ఒక చిన్న సదస్సు ఏర్పాటు చేసారు. అది కూడా ఆరుబైట. పడకుండా మిగిలిన పదో పరకో చెట్ల మధ్య!

విపరీతంగా చర్చ వాడిగా, వేడిగా సాగింది. ముందస్తుగా అసలు చెట్లు ఎందుకు పడతాయి అని చర్చించారు! ఎందుకు పడతాయో తెలిస్తే పడకుండా చర్యలు తీసుకోవచ్చు కదా అన్న ఐడియా తో.

"బలహీనంగా ఉన్న చెట్లు పడతాయి"
"బలంగా ఉన్న చెట్లయినా గాలివానకి పడతాయి"
"పెద్ద వానకి పడతాయి"
"లేదు జడివానకి పడతాయి"
"కాదు గాలివానకి పడతాయి"
"లేదు, కాదు. సుడిగాలి వానకి పడతాయి"

ఇలా లోకోభిన్నాభిప్ర్రాయం వెలిబుచ్చారు. చివరాఖరికి వెనకనుంచి అప్పటిదాకా మౌనంగా ఉన్న నాలాంటి ఒక బాలమేధావి అన్నాడు. ఇక్కడ "నాలాంటి" అన్న పదప్రయోగం కేవలం "మేధావి" అన్న దానికే కాని "బాల" కి కాదు అని నన్ను ప్రత్యక్షంగా చూడని చదువరులకి మనవి. ఇంతకీ ఆ బాలమేధావి ఏమన్నాడంటే

"చెట్లు పడటానికి అతి ముఖ్య కారణం చెట్లుండడమే"!

అంతే! ఒక్క సారి యండమూరి నవలలోలాగా భయంకరమైన నిశబ్దం!! ఆయన నవలలో అయితే ఈ "నిశబ్దం" అన్న మాటని భయంకరమైన ఒక దానికంటే మరొకటి పెద్దదైన ఫాంట్ లో మూడు నాలుగు సార్లు ముద్రిస్తారు! నాకు ఇక్కడ ఫాంట్ ఎలా పెంచాలో తెలియక పోవడంతో అలా చెయ్యలేకపోయినందుకు చింతిస్తున్నాను :(

అప్పుడే పక్కనున్న చెట్టు మీదనించి ఒక పిల్ల చీమ నడక నేర్చుకుంటూ పట్టు తప్పి కింద పడింది. ఆ చీమ నేలమీద పడ్డ శబ్దం పక్కలో పిడుగు పడినంత శబ్దం లాగ అందరికీ వినిపించింది. అంత నిశబ్దం!!

ఆ బాలమేధావి మాటల్లో ఉన్న "ప్రోఫౌండ్ సత్యం" అందరికీ రెండు నిమిషాలు మౌనం పాటించిన తర్వాత అర్ధం అయ్యింది. వెంటనే అందరూ ఆమోద ముద్ర బుర్రూపుతూ ఏకగ్రీవంగా తెలియచేసారు.

అసలు జబ్బుకి కారణం ఏమిటో తెలిసిన వెంటనే డాక్టర్ ప్రిస్క్రిప్షన్, చికిత్సా వగైరా చకచకా మొదలెట్టినట్టు వెంటనే "తక్షణ కర్తవ్యమ్" మీద ద్రుష్టి సారించారు. ఈసారి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండానే పరిష్కారం తట్టింది, అందరికీ.

అదేమిటంటే?.........
............
............
............

చెట్లుండడం వలన కదా ఓ తెగ పడిపోతున్నాయి. చెట్లు లేకుండా చేస్తే పోలా?! వాట్ యాన్ ఐడియా సర్జీ ;) అని వాళ్ళలో వాళ్ళే తెగ ఆనందపడిపోయి, ఇంత తొందరగా ఈ వృక్ష సమస్యని కూకటి వేళ్ళతో సహా పరిష్కరించినందుకు ఒకళ్లనొకళ్ళు వీపులు తట్టి, చేతులు ఊపేస్తూ (ఎదుటి వాడివి!) తెగ ఆనంద పడిపోయారు.

పరిష్కారం తట్టాలే కాని "రాజు గారు తలుచుకుంటే డబ్బులకి కొదవా" అన్నట్టు వెంటనే చెట్లు కొట్టే పని మొదలెట్టారు.

ఇదిగో తిలకించండి సినిమా వాళ్ళ భాషలో "ఫస్ట్ కట్" ఫోటో ;)

NB: Photo for illustration purpose only!!

NB2: Any resemblance to any recent news is unfortunate :(

Wednesday, May 11, 2016

How to upgrade titlu v1.0 to titlu 2.0.1 (banda boothulu)

హౌ టు అప్ గ్రేడ్ తిట్లు v1.0 టు తిట్లు v2.0 (బూతులు) అండ్ తిట్లు v2.1.0 (బండ బూతులు)

నిన్న ఒక వ్యక్తి మీద నాకు భారీ కోపం వచ్చింది. నిజానికి నాకస్సలు కోపం రాదు. ఈ మాట అస్మదీయులు కూడా ఒప్పుకోరు అనుకోండి. వాళ్ళది తప్పు లేదు లెండి. మరీ సౌమ్యంగా ఉన్నా, కనిపించినా ఒకింత ప్రమాదం అని నేనే అప్పుడప్పుడూ కోపం నటిస్తూ ప్రదర్శిస్తూంటాను. ఏది చేసినా లోక కళ్యాణం కోసమే! మీకు తెలీనిది ఏముంది.?

ఇంతకీ ఎప్పుడూ కోపం రాని నాకు కోపం వచ్చిందంటే కూడా ప్రమాదమే. ఎందుకంటే ఆ భారీ కోపం మనలోపల దాచేసుకుంటే మనల్నే కాల్చేస్తుంది! ఆ వ్యక్తి మీద చూపించాలంటే, నాకొచ్చిన కోపం తీవ్రత ధ్వనించేంత తిట్టగలిగే బూతులు నాకు రావు. నాకు వచ్చిన తిట్లు ఇంకా బూతుల స్థాయికి అప్ గ్రేడ్ చెయ్యలేదు :(

అందుకని కోపం ఎంత తీవ్రంగా వచ్చిందో అంత తీవ్రంగానే ఆలోచించాను. వెంటనే ఒక ఉపాయం తట్టింది. కొంచం లేట్ అయినా కొన్ని కొత్త బూతులు అర్జెంటు గా నేర్చేసుకుని వెంటనే వాడేేయ్యచ్చు కదా వేడి వేడిగా అని. ఉపాయం అయితే తట్టింది కాని దానికి మార్గం దొరకలేదు. 30 రోజుల్లో బూతులు అని పుస్తకాలు అమ్మటంలేదు కదా? మరేమిటి దారి? పోనీ ఎవరైనా ఫ్రెండ్ ని అడిగితే "బాస్! ప్లీజ్ ప్లీజ్! నాక్కొంచం బూతులు, ఇంకొంచం బండ బూతులు అర్జెంటు గా నేర్పవా? చిన్న పని పడింది. ప్లీజ్ ప్లీజ్!" అని అడిగితే "ఏం? ఎలా కనిపిస్తున్నాను నీకంటికి నేను? గాంధీ గారికి దూరపు బంధువు కాకపోయినా అంతటి సౌమ్యుడిని. అసలు నాకు బూతులు ఎలా తెలిసి ఉంటాయనుకున్నావు?" అని అక్కడితో అగ్గకుండా నన్ను బండ బూతులు తిట్టే ప్రమాదం లేకపోలేదు. మనకి బూతులు, బండ బూతులు రావు కాబట్టి వాడు తిట్టినవి "అవి" అని తెలిసి ఏకసంతగ్రాహిలా వాటిని ముక్కుని పెట్టుకొని తర్వాత వాడుకునే అవకాశం లేదు. చూసారా బూతులు రాకపోతే ఎన్ని ఇబ్బందులో?

మరింకేదైనా దారుందా అని విపరీతంగా పనులన్నీ మానుకొని ఆలోచించాను. సడన్ గా ఒక మెరుపు మెరిసింది. బైట ఆకాశంలో! ఈమధ్య పేరుకే వేసంకాలం కాని వానాకాలం కంటే ఎక్కువగా వానలు పడుతున్నాయి మా హైదరాబాద్ లో. వాన పడనప్పుడు "చైనా" విద్యా సంస్థల భారీ ప్రకటనల్లాగా ఉరుములు, మెరుపులుతో వీర పబ్లిసిటీ హడావిడి. ఇంతకీ అలా ఆకాశంలో మెరుపు మెరియగానే నా మైండ్ లో కూడా ఒక మెరుపులాంటి ఐడియా మెరిసింది. న్యూటన్ తలమీద ఆపిల్ పడగానే ఆయనకి పెద్ద నిజం తెలిసినట్టు!

ఆ మెరుపులాంటి ఐడియా ఏమిటంటే వెంటనే ....
......
......
......
......
......
......
......
......
......
......

హమ్మా! ఆశ, దోశ, అప్పడం, వడ!

అయినా రచనలు ప్రజలని ఆలోచింపచేసేవిగా ఉండాలని చాలామంది ఘోషిస్తూ ఉంటారుగా! అందుకే ఇప్పుడు ఆలోచించడం మీ వంతు ;)

అర్జెంటు గా బండ బూతులు నేర్చుకోవాలంటే నాకొచ్చిన ఆ మెరుపు లాంటి ఐడియా ఏమిటి?

నా ఐడియా తో సరిపోయిన కరెక్ట్ సమాధానం రాసిన వారికి హాస్చర్య కరమైన బహుమతి!

గమనిక: ఆ హాస్చర్య బహుమతి నేను పెట్టబోయే ఆవకాయ ఒక హార్లిక్స్ సేసాడు అనుకుంటే వాళ్లకి నిజంగా హాస్చర్యమే! ఎందుకంటే బహుమతి అది కాదు ;)

మరో గమనిక: ఎవ్వరూ నాకొచ్చిన ఐడియా రాయకపోతే నేను దాన్ని బహిర్గతం చెయ్యదలుచుకోలేదు! ఎందుకంటే ఇక్కడ చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్లకి కూడా ఎప్పుడైనా ఎవరిమీదనైనా పిచ్చి కోపం రావచ్చు. అప్పుడు నా ఐడియా గుర్తొచ్చి వాళ్ళు కూడా బూతులు నేర్చుకొని నా మూలంగా పాడయ్యిపోవడం, ఆ పాపం నాకంటుకోవడం నాకిష్టం లేదు :( 

Thursday, May 5, 2016

Thunderstorm!

ఇవాళ పొద్దున్న అనాలో నిన్న రాత్రి అనాలో తెలీదు కాని, మా హైదరాబాద్ లో ౩ గంటలకి మొదలయ్యిన అతి భారీ వర్షం, అది కూడా వీర మెరుపులు, విపరీతమైన పిడుగుల శబ్దాలతో, రాత్రి పడడం రెండు రకాలుగా మంచిదే అయ్యింది!

ఒకటి: అదే భారీ వర్షం పగలు పడితే ఎక్కడున్నప్రజలు అక్కడే ఇప్పటిదాకా అతి వీర భయంకర ట్రాఫిక్ జామ్ లో ఉండిపోయేవాళ్ళు :(

రెండు: ఆ భయంకరమైన మెరుపులకి, కర్ణ కఠోర పిడుగుల శబ్దాలకి భయపడిపోయే జీవులు (నాలాంటి వాళ్ళన్నమాట!) శుభ్రంగా ముసుగు తన్నేసి "ధైర్యంగా" బొజ్జోవచ్చు ;) మనం భయపడిపోతున్నాం అన్న విషయం బైటకి పోక్కదు! (ముసుగులో దాచేస్తాం కదా ;) ముసుగు వేసుకుంటే ముసుగు లోపలికి పిడుగులు రాలేవు!

ఎందుకంటే చిన్నప్పుడు దెయ్యాల టాపిక్ డిస్కస్ చేసినప్పుడు (అదేమీ ప్రారంబ్ధమో ఇలాంటి భయంకర విషయాలు ఎప్పుడూ రాత్రి పూటే డిస్కస్ చేస్తాం, గుర్తొస్తాయి) అప్పుడు విపరీతమైన భయం వేసి ముసుగు గట్టిగా కప్పుకొని నిద్రోయేవాళ్ళం.(ఆ రోజుల్లో కొంతమందిని "ముసుగు వీరులు" అని పిలిచేవాళ్ళు!) ముసుగులోకి వచ్చే పవర్ దెయ్యలకి లేదన్న గాట్టి నమ్మకంతో ;)

కాబట్టి మోరల్ అఫ్ ది స్టొరీ ఏమిటంటే ముసుగులోకి దెయ్యాలకి, పిడుగులకి "నో ఎంట్రీ" !! వుయ్ ఆర్ వెరీ సేఫ్ ఇన్ ముసుగు, యు నో!!

చివరిమాట: ఎదో అనుకుంటాం కాని రైతులదే కాదు మన జీవితాలు కూడా వర్షాధార బతుకులే. మబ్బేస్తే టాటా స్కై పోతుంది. చిన్న వాన పడితే కరెంటు పోతుంది. పెద్ద వాన పడితే కొంతమంది ప్రాణాలే పోతాయి.

PS: రాత్రి పడ్డ వాన ఎన్ని "ఇంచులు" పడిందో ఇంచుమించు గా చెప్పగలను! ఈ ఫోటోలో కనిపిస్తున్న నీళ్ళల్లో నా "వాన గేజ్" మునిగిపోయింది :( ఆ నీళ్ళు ఉన్న చోట ఇంచుమించు 6 అంగుళాల లోతు ఉంటుంది. అంటే రాత్రి వాన అధమపక్షం 5 అంగుళాలు పడింది అని లోపాయికారీ భోగట్టా!

Tuesday, May 3, 2016

Music Sense! సంగీత, రాగజ్ఞానం

ఉత్సాహం, ఊపు వచ్చినప్పుడు గొంతెత్తి నాకు వచ్చిన, నచ్చిన పాటలు కసితీరా పాడడం నాకున్న మంచి అలవాట్లలో ఒకటి ;)

పొద్దున్నే హటాత్తుగా ఇవాళ నాకు బోల్డు పనులున్నాయని గుర్తొచ్చింది! ఎన్ని పనులంటే ఇవన్నీ ఇవాళ చెయ్యగలనా అని నాకే పెద్ద సందేహం వచ్చేన్ని! ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా అందరూ చేసేదే నేను చేస్తాను. అదేమిటంటే ఎలాగూ ఇన్ని పనులు చెయ్యలేము కాబట్టి ఓ తెగ ఆవేశపడి, ఆయాసపడి ప్రయోజనం లేదు కాబట్టి ఎంచక్కా ఏ పని మొదలెట్టకుండా, కాళ్ళు చాపుకొని, సెటిల్ అయ్యిపోయి, ఓ పాట అందుకున్నా!

ఇలా భారీ ధ్యేయం ఉన్నప్పుడు మన వల్ల కాదని కాళ్ళు చాపుకోడానికో చారిత్రాత్మక ప్రేరణ ఉంది! అదేమిటంటే 20వ శతాబ్దంలో నేను కూడా భారత క్రికెట్ అభిమానిని. వెర్రిగా కాదు కాని నాకు కుదిరినప్పుడు మన దేశం ఆడుతున్నప్పుడు లైవ్ లో చూసి ఆవేశపడిపోయేవాడిని. తల ప్రాణం తోకకి వచ్చేది అందరినీ విమర్శించలేక :( సగటు ప్రేక్షకుడి పాత్ర అంతేగా! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఆ రోజుల్లో ప్రత్యర్ధి జట్టు భారీ స్కోర్ (దీనికి తెలుగు మాట చెప్పిన వారికి చక్కటి బహుమతి!) చేస్తే, మనోళ్ళు వెంటనే మనకెవ్వరికీ కనిపించకుండా డ్రెస్సింగ్ రూమ్ లో చేతులెత్తేసి, నీరసంగా వెళ్లి, ఎదో తప్పదు కాబట్టి, తూతూ మంత్రం స్టైల్ లో అలా బాటింగ్ కి వెళ్లి, ఇలా వచ్చేసేవాళ్ళు :( అది నా మనస్సులో లోతుగా చొచ్చుకుపోయి అక్కడే ఉండిపోయింది. ఏమిటంటే మన వల్ల కాని పని ఏదైనా చెయ్యాల్సి వస్తే అనవసరంగా ఆవేశపడడం తగదు అని!

సరే ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ పాట మొదలెట్టా. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఏ పాట కూడా పూర్తిగా పాడకుండా ఒక పాటలోంచి ఇంకో పాటలోకి అస్సలు అపశ్రుతులు లేకుండా అలా స్మూత్ గా వెళ్ళిపోతాను. అలా నేను ఒక రాగంలోంచి ఇంకో రాగంలో ఉన్న పాటలోకి వెళ్ళిపోవడం తరుచుగా అవుతుంటుంది. రాగమాలిక అన్నమాట ;) చిన్నప్పుడు సంగీతం నేర్చుకోక రాగాల పేర్లు పెద్దగా తెలీవు కాని, నరనరాల్లో ఉన్న రాగజ్ఞానం ఎక్కడికి పోతుంది?

ఇంత సంగీత, రాగజ్ఞానం ఉన్నా, అప్పుడప్పుడు నేను ఏదైనా ఒక సినిమా పాటకి ట్యూన్ కడదామని చాలాసార్లు ప్రయత్నించినా ఎక్కడో, ఎప్పుడో విన్న ట్యూన్ వస్తుంది కాని చస్తే కొత్త ట్యూన్ తట్టి చావటం లేదు :(

ఈ జన్మకింతే! ఒకడు కట్టిన ట్యూన్స్ పాడుకోవాల్సిందే.

ఇంతకీ మళ్ళీ పొద్దున్నే పాడిన పాట దగ్గరికొస్తే, గంభీరంగా "దేవీ! శ్రీదేవీ!!" అన్న పాట మంచి మందస్థాయిలో ఎత్తుకున్నా! అలా అలా పాడుతూంటే నాకు తెలీకుండానే "కొలువై ఉన్నాడే! ఆ దేవదేవుడు!" పాటలోకి హై పిచ్ లో వెళ్ళిపోయాను! ఈ రెండూ ఒకే రాగం అని నా నమ్మకం! మీరెవరైనా సంగీతం నేర్చుకుంటే కాస్త ఆ రాగం పేరు చెప్పి ఓ 100 గ్రాములు పుణ్యం పార్సెల్ కట్టుకోండి ;) 

Tuesday, April 26, 2016

వసంతకాలే సంప్రాప్తే/ కాకఃకాకః పికఃపికః! The Koel & The Crow!!

వసంతకాలే సంప్రాప్తే/ కాకఃకాకః పికఃపికః. ;)

వసంతకాలం మొదలయ్యింది కాబట్టి ఈ "పాడు" కోయిలలు అడ్డంగా దొరికిపోతాయి! అసలు నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే ఈ కోయిల్లకి విపరీతమైన తెలివితేటలు కదా? దానికి తోడు ఒకింత బద్ధకం కూడా ఉందేమోనని అనుమానం! లేకపోతే శుభ్రంగా ఒక సొంతిల్లు కట్టుకొని అందులో గుడ్లు పెట్టి, వాటిని పొదిగి పిల్లని చేసి, అవి ఎదిగి జీవితంలో పైకొస్తే హాయిగా చూసి ఆనందించ్చుగా? ఊహూ.. ఈ "ఊహూ! ఇదేదో కొయిల గానం "కూహూ" కి ప్రాస కాదండోయ్!

ఇంతకీ దాని బద్ధకం, తెలివితేటలూ కలగలిపి అదేం చేస్తుందంటే కాకి, దానిలాంటి ఇంకా కొన్ని అమాయక పక్షుల గూళ్ళు బ్రహ్మాండంగా ఉన్నవి సెలెక్ట్ చేస్తుందిట ముందస్తుగా. ఆ పైన మగ కోయిల ఆ గూటి ఓనర్ పక్షిని అలా తన మృదు మధుర గానంతో మెస్మరైజ్ చేసి అలా అలా కూసింత దూరం తీసుకెల్తుందిట. అంతే ఆ అదను చూసి పెళ్ళాం కోయిల గభుక్కుని ఆ అమాయకపక్షి గూట్లోకి ఒక్క గెంతు గెంతి, ఒక రెండు మూడు గుడ్లు పెట్టి పారిపోతుందిట! ఇక్కడ ఇంకో బ్రహ్మాండమైన తెలివితేటలు చూపిస్తాయి, ఈ కోయిల జంట. అప్పటికే ఒకటో, రెండో గుడ్లు పెట్టిన కాకి గూడునే ఎంపిక చేస్తాయి. లేదంటే ఎంత అమాయకపక్షి అయినా అలా బైట షికారుకి వెళ్లి వచ్చేటప్పటికి తన గూట్లో ఒక రెండో, మూడో గుడ్లు కనిపిస్తే హాశ్చర్యం, అనుమానం రావా? అందుకని అలా గుడ్లు పెట్టిన పక్షి గూట్లో పెడితే ఆ ఆడ కాకి, ఆ మగ కోయిల వెంట చెడు తిరుగుళ్ళు తిరిగి అలిసిపోయి గూడుకొచ్చాక ఒకటి రెండు గుడ్లు ఎక్కువగా కనిపించినా పెద్ద పట్టించుకోవుట ఎందుకంటే కాకులు లెక్కల్లో కొంచం వీక్ ట :(

ఇంక ఆ తర్వాతేముంది? ఆ అమాయక్పక్షి "దున్నేవాడిదే భూమి" అన్న టైపులో తన గూట్లో ఉన్న గుడ్లన్నీ తనవే అని భావించి, వరస పెట్టి వాటిని పొదగడం మొదలెడుతుంది. మెల్లిమెల్లిగా ఒక్కో గుడ్డులోంచి ఒక్కో పిల్ల బైటకి వస్తుంది. కోయిల పిల్లలు కూడా కాకి రంగులోనే ఉంటాయి దాదాపుగా. అక్కడక్కడా కొంచం ఎరుపున్నా ఆ తల్లి కాకి పెద్దగా అనుమానపడదు. బహుశా నా పుట్టింటి దూరపు బంధువుల రంగు వచ్చిందని ఓ తెగ ఆనందపడిపోతుంది ;)

అలా సవతి కాకి తల్లి దగ్గర పెరుగుతున్న కోయిల పిల్లలు కూడా ముందస్తుగా కొన్నాళ్ళు కాకిలాగే అరుస్తాయిట కూడా! వాటి తెలివి మండిపోనూ. అందుకే అంటారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని! కాకి బావ కూడా ఈ పెద్ద జాయింట్ ఫ్యామిలీని చాల జాగ్రత్తగా పెంచుతుందిట. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది?

చెప్తాను. వింటూనే ఉండండి. 98.3 FM . ఇది చాల హాట్ గురూ!! చ్చా! రోజూ ఈ రేడియో వింటే ఇదే ప్రాబ్లం :(

అలా అలా కొన్నాళ్ళయ్యాక కోయిల అసలు "రంగు" బైట పడుతుంది. ఎప్పుడంటే వసంతకాలం వచ్చినప్పుడు. రావడం ఏమిటి దాని వంశం బుద్ధులు ఏమవుతాయి? ఎన్నాళ్ళు నటిస్తుంది? వెంటనే గొంతు సవరించుకుని "కుహూ! కుహూ!!" అని వసంతరాగంలో ఒక కీర్తన ఆలాపన ఎత్తుకుంటుంది. అది విన్న తల్లి కాకికి ముందు ఏమీ అర్ధం కాదు. తర్వాతర్వాత "ఓహో! బహుశా నా అదృష్టం బాగుండి ఒక మధుర గాయని పుట్టింది నాకు" అని ఫీల్ అయ్యిపోతుంది. సాయంత్రం వాళ్ళ ఆయన బైట రోజంతా బలాదూర్ తిరిగి గూటికి చేరగానే కనీసం మంచినీళ్ళు , కాఫీ లాంటివి ఏమీ ఇవ్వకుండా "బావా! బావా! కాకిబావా! (కాకులు మొగుళ్ళని ప్రేమతో బావా అనే పిలుస్తాయి!!) ఇవాళ ఏం జరిగిందో తెలుసా?" అని ఊరిస్తుంది. అసలే పగలంతా ఎండలో పని లేకుండా ఎగిరెగిరి తిరిగి తిరిగి వచ్చాడేమో, మొగుడికి వీర చికాకేస్తుంది. ఇలా గూటికి వచ్చానో లేదో ఈ య(ల)క్ష ప్రశ్నలేమిటని! కాని విసుక్కున్నాడా ఆ పూట పస్తే అన్న నగ్న సత్యం తెలిసిన వాడు కాబట్టి నల్ల మొహం వీలయినంత తెల్లమొహం చేసి "ఏమో? ఇంతకీ ఏం జరిగిందేమిటి?" అని అంటాడు.

వెంటనే పిచ్చితల్లి "మన మొదటి పిల్ల చూసారూ. ఇందాకల ఏమి పాడిందో తెలుసా? బహుశా మా మేనత్త పోలికనుకుంటా! ఆ గొంతు, ఆ ఆలాపన! మీరు మిస్ అయిపోయారు. పోనిలెండి రేప్పొద్దున్న లేవగానే మళ్ళీ పాడమంటాను" అంటుంది. మగ కాకి "ఓస్! ఇంతేనా? ఇంకా ఈ పక్క గూడు మగడు ఇవాళ ఒక పెద్ద స్పూన్, ఫోర్క్ తెచ్చాడు తెలుసా? అని దెప్పుతుందేమో? అనుకున్నా! హమ్మయ్య ఈ పూటకి బ్రతికిపోయాను" అని మనసులో అనుకోని, "అలాగా? అయితే సరే" అని లేని, రాని ఆవలింత తెచ్చుకొని నాకు నిద్రొస్తోంది అని బోజ్జుంటాడు.

మర్నాడు పొద్దున్నే పెళ్ళాం కాకి, కావు, కావు మని కాకి గోల చేసి మొగుడిని, పిల్లల్నీ లేపెస్తుంది. ఇహ అన్నీ కలిపి బృంద గానం మొదలెడతాయి. మధ్యలో నేపధ్య గాయని లాగ "కుహూ! కూహూ!! అని మన పిల్ల కోయిల అందుకుంటుంది. వెంటనే తల్లి కాకి మొగుడిని పట్టుకొని "చూసారా? చూసారా? విన్నారా ఎంత బాగా పాడుతోందో నా చిన్ని తల్లి! నా బంగారు తల్లి " అని ఓ మురిసిపోతుంది. అప్పుడు మొగుడుకి అసలు విషయం కొంచం కొంచంగా మెల్లి మెల్లిగా అర్ధం అవుతుంది. ఎంతయినా బైట ప్రపంచం కాస్త ఎక్కువగానే చూసాడు  కదా? అప్పుడు చెప్తుంది పెళ్ళానికి "పిచ్చి మొహమా? మీ మేనత్త పోలిక కాదు! గాడిద గుడ్డు కాదు! నువ్వు పోదిగింది కోయిల గుడ్డుని! ఇప్పుడు దీని అసలు రంగు, గొంతు బైట పడింది" అని జ్ఞానోదయం చేస్తుంది. దాంతో హతాశురాలైన తల్లి కాకి కాసీపు కావు కావుమని వాపోయి, ఆ కోయిల పిల్లని "ఏదీ! నీ పేస్ టర్నింగ్ ఇచ్చుకో!"  అని అది మొహం చూపించగానే "ఛీ! అప్రాచ్యురాలా! నా కడుపున చెడ పుట్టావు కదే" అని నాలుక్కరుచుకుని "నా కొంపలో ఏమీ తెలీని నంగనాచి లాగ ఇన్నాళ్ళు ఏమి నటించావే! "పాడు" కోయిలా! ఛీ ఇహ నీ మొహం నాకు చూపించకు ఇవ్వాల్టి నించి" అంటుంది! ఓస్! మొహం చూపించద్దు అంతేగా అని అటు తిరిగి సెటిల్ అయ్యిపోతుంది  పిల్ల కోయిల ;) అప్పుడర్ధం అవుతుంది తల్లికాకికి తను ఇంకా అమాయకురాలేనని. ఏదో తప్పు చెప్పానని! ఈ మెలోడ్రామా అంతా కొంచం దూరం నించి ఇంకో కొమ్మ మీదనించి చూస్తున్న మొగుడు కాకి ఇహ లాభం లేదని రంగప్రవేశం చేసి పిల్ల కోయిలతో "మొహం కాదు! అసలు నీ బాడీ నే ఓ సారి టర్నింగ్ ఇచ్చుకో" అని అది వెనక్కి తిరిగాక  దాని తోకమీద ఒక్క తన్ను తన్ని "గెట్ అవుట్ అఫ్ మై నెస్ట్! యు బ్లడీ కోయిల్! అని గెంటేస్తాడు. 

పాపం! పిల్లకోయిల "కొంపా, గూడు పాయే! తల్లీ, తండ్రి లేరాయే! నేననాధనయిపోయే! ఈ జీవితమింతేలే" అని ఒక విషాద గీతం తనిష్ట మొచ్చిన రాగంలో ఏడ్చుకుంటూ, క్షమించాలి, పాడుకుంటూ, అలా అలా హోరైజన్ లోకి నిష్క్రమిస్తుంది!
కథ కంచికి. కోయిల ఇంకో గూటికి!   
PS: ఇలా ఈ "పాడు" కోయిల, కాకి చరిత్ర పునరావృతం అవుతూనే ఉంది! 


Friday, April 8, 2016

Ugadi Special !! ఉగాది స్పెషల్ ;)

నిన్న ఉగాది పండుగకి పొద్దున్నే వంటగదిలో బోల్డు హడావిడిగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే అందరికీ బైటినించి టిఫిన్ తెద్దామని ఒక దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్ కి వెళ్లి పార్సెల్ ఆర్డర్ ఇచ్చి నిలబడ్డాను.

ఉన్నట్టుండి నా షర్టు మీద ఏదో పొడి పడింది. బహుశా పైనించి సున్నం రాలిఉంటుందని దులిపేసాను. ఇంకో నిమిషానికి ఈసారి చేతి మీద పడింది. ఈసారి నిశితంగా పరిశీలించాను. సంభ్రమాశ్చర్యం :) ఆ పడింది విభూతి!! OMG!!! ఇన్నాళ్ళ, ఇన్నేళ్ళ నా నిరంతర భక్తికి మెచ్చి కొంపతీసి పైనించి దేవుళ్ళో, లేకపోతే వాళ్ళు  కొంచం బిజీగా ఉండి దేవతలో నామీద ఇలా కరుణ చూపించి సింబాలిక్ గా విభూతి నా మీద కురిపించారేమోనని తెగ ఆనందపడిపోయి తన్మయత్వంతో ఓ నిమిషం కళ్ళు మూసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాను ;)

ఇంతలో "సార్! మీ పార్సెల్ రెడీ!" అన్న పిలుపుతో ఈ పెపంచికంలోకి వచ్చి, నా పార్సెల్ తీసుకొని వచ్చేస్తూ ఒకసారి పైకి అలా మెల్లిగా తలెత్తి చూసాను. ఆ దేవుళ్ళో, దేవతలో అలా మేఘాల్లో కనిపిస్తారేమోనన్న చిరు దురాశతో! చూస్తే ఏముంది?!!
....
....
....
....
....
....
....
....
....
....
....
....
....
....
....
పైన కప్పుకి వేలాడతీసిన ఒక బూడిద గుమ్మడికాయ, దాంట్లో గుచ్చి ఉన్న అగర్బత్తి, దాని చివర ఇంకోసారి రాలడానికి సిద్ధంగా ఉన్న బూడిద :(

"చివరకి మిగిలేది బూడిద" అన్న జీవిత, వేదాంత నగ్నసత్యం మరొక్కసారి కనుక్కొన్నాను...ఉగాది స్పెషల్ ;)

బోనస్: దాన్ని "బూడిద" గుమ్మడికాయ అని ఎందుకంటారో కూడా తెలిసింది ;)