దీపావళి డీప్ క్లీనింగ్!
చాలామంది "ఎందుకైనా పనికొస్తుంది" అని కొన్నిటినీ, సెంటిమెంటల్ వేల్యూ తో కొన్నిటిని, పారేయడానికి మనసొప్పక ఇంకొన్నిటినీ, ఎప్పటికైనా రిపేర్ చేయిద్దామని మరి కొన్నిటిని ఇలా ఇల్లంతా ఎటు చూసినా మనం వాడని, వాడలేని, పనికిరాని, పని చెయ్యని, పనికిమాలిన వస్తువులతో నింపేస్తారు!
ముఖ్యంగా సొంత ఇల్లుంటే మరీనూ! అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళు, ట్రాన్స్ఫర్లు ఉండే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇల్లు ఖాళీ చేసినప్పుడల్లా అలాంటి చెత్తని వీలయ్యినంత వదిలించుకుంటూ ఉంటారు.
ఇలా ఇల్లంతా "చెత్త" ఉంటే అనారోగ్యం. చూడ్డానికి బాగోదని తీరి కూర్చొని ఇల్లు శుభ్రంగా ఉంచమంటే రేపు చేద్దాం, ఎల్లుండి చూద్దాం అని వాయిదాలేస్తూ వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిపేస్తారని. డబ్బుతో లంకె పెడితేనైనా కనీసం సంవత్సరానికోసారైనా అలాంటి చెత్తని పారేస్తారని "దీపావళి నాడు ఇల్లు శుభ్రంగా ఉంటే కానీ లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టదు" అని ఒక సంప్రదాయం మొదలెట్టారు.
కాబట్టి దీపావళి ఇంకొన్ని రోజులే ఉంది కనుక కాస్త ఓపిక చేసుకుని, కొంచం బద్దకం వదిలించుకుని ఇంట్లో ఉన్న చెత్తా చెదారం పారేయండి! వదిలించుకోండి! (చెదారం అంటే ఏమిటో ఖచ్చితంగా నాకు తెలీదు!)
వాడని, వాడలేని, పనికిరాని, పని చెయ్యని, పనికిమాలిన వస్తువులని ఇలా విభజించచ్చు
1. ఖచ్చితంగా పారేయాల్సినవి - అంటే అయిదేళ్లక్రితం కొన్న టీవీ అట్టపెట్టె, రెండేళ్ల క్రితం కొన్న మొబైల్ డొక్కు , పదేళ్ల క్రితం కొన్న మొబైల్ సన్న పిన్ చార్జర్, గత దశాబ్దంలో మొబైల్‌తో పాటు వచ్చిన ఇయర్ ఫోన్లు వగైరా
2. రిపేర్ చేయించి వాడుకునేవి - కానీ నాకో సందేహం. అవి నిజంగా నిత్యం కాకపోయినా నెలకోసారైనా వాడే వస్తువైతే ఈ పాటికి రిపేర్ చేయించి ఉంటారు. అలా చేయించకపోతే దాని అవసరం లేదన్నమాట. అలాంటప్పుడు అదే స్థితిలోనో, లేక రిపేర్ చేయించొ OLX లో ఎంతొస్తే అంతకి అమ్మేయండి!
3. పని చేస్తాయి కానీ గత రెండేళ్లుగా వాడని వస్తువులు - అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మీ అబ్బాయికి మీరు హై స్కూల్లో కొన్న సైకిల్ (ఆ మెట్ల కింద తుప్పు పట్టిపోతూ ఉంటుంది! చూడండి!), మీకిప్పుడు నచ్చని, మీరు వాడని రిస్ట్ వాచీలు, స్మార్ట్ ఫోన్ ముందు కొన్న మామూలు మొబైల్, గుప్తుల కాలంనాటి మిక్సర్ ఇలాంటివి. వీటిని ఒకటే ఎవరికన్నా ఉచితంగా దానం చేసేయండి. (ఉచితంగా కాకుండా డబ్బులు తీసుకొని కూడా దానం చేస్తారా అని అడక్కండి ఎందుకంటే నేను ఈ "ఉచిత దానం" అన్న పద ప్రయోగం చాలాసార్లు చదివాను!) కనీసం వాళ్ళ ఆశీస్సులు, ఒకింత పుణ్యం దక్కుతుంది. లేదూ OLX ఉందిగా?
4. సెంటిమెంటల్ వేల్యూ ఉన్నవి - ఇవి వేరే ఇంకెవ్వరికీ ఎందుకూ పనికిరావు. లోపాయికారీ మనకీ పనికిరావు! మనం కూడా ఎప్పుడో కానీ వాటిని చూడం కూడా! - ఉదాహరణకి కాలేజీ రోజుల్లో మీరు రాసి ఇవ్వని ప్రేమలేఖ!, మీ ప్రేయసి జడలోంచి పడి వాడిపోయి ముట్టుకుంటే పొడిపొడి అయిపోయే పువ్వు, మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్, డిగ్రీలో
చేతులూపుకుంటూ ఒక స్పైరల్ బౌండ్ పుస్తకాన్ని ఒక చేత్తో పట్టుకుని ఊపుకుంటూ కాలేజీకి తీసుకెళ్లిన ఆ రఫ్ నోట్ బుక్! వగైరా! వీటిని కావాలంటే స్కాన్ చేసి ఒరిజినల్ పారెయ్యచేమో ఆలోచించండి. మీ ఇష్టం. అలా దాచుకున్నా అభ్యంతరం లేదు! కానీ నా అనుభవంలో ఇలాంటివి ఒక సంవత్సరం పారేయకపోయినా ఈ దీపావళి క్లీనింగ్ ప్రతి సంవత్సరం చేస్తూంటే అంతకు ముందు సంవత్సరం పారేయనివి రెండో సంవత్సరం లేదా మూడో సంవత్సరంలోనే పారేస్తాను నేనైతే. అంటే వాటిమీద మనసు విరిగిపోతుందన్నమాట. ఎందుకీ మమకారాలు, సెంటిమెంట్లు అని అనిపించినప్పుడు.
మీ ఇంటిని కనీసం ప్రతి దీపావళికి ఇలా డీప్ క్లీనింగ్ చేస్తే అలా శుభ్రం అయిపోయాక దీపావళి నాడు ఇంటి ముఖద్వారం బార్లా తెరిచి (లక్ష్మీదేవి రావాలిగా లోపలికి!) హాల్లో సోఫాలో కాలు మీద కాలేసుకుని ఆమె రాకకోసం ఎదురు చూడ్డమే!
ఇలా డీప్ క్లీనింగ్ కార్యక్రమం మీరు చేపట్టాక ప్రతి ఇంట్లోనూ జరిగే రామాయణం ఎలా ఉంటుందంటే?!
ముందస్తు
మాట! ఇలా క్లీనింగ్ చేసినప్పుడు
మనం "ఇది పోయిందనుకున్నానే! హమ్మయ్య పోన్లే
ఇప్పుడు దొరికింది" , "అరే! ఇది పారేయకుండా
ఇన్నాళ్ళుంచామా" అని హాశ్చర్యపడిపోయే వస్తువులు
కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి
ఇహ పొతే ఇలా సంవత్సరానికోసారి
ఇల్లు పీకి పందిరేసే కార్యక్రమంలో
సాధారణంగా వినిపించే డైలాగ్స్ ఈ విధంగా ఉంటాయి
ఎవరింట్లోనైనా! జస్ట్ నేమ్స్ చేంజ్ అంతే
- పద్దూ
నీకిదే చెప్తున్నా! దేనినైనా పారెయ్యి కానీ నా చెక్క
బీరువా జోలికి మాత్రం రావద్దు
- డాడీ!
నువ్వు నీ చిన్నప్పుడు చదివావో
లోదో తెలీదు కానీ ఓ రెండు
కేజీలున్న ఆ పెద్ద బాలశిక్ష
పుస్తకం నువ్వు కనీసం ముట్టుకోవడం నేనెప్పుడూ చూడలేదు గత ఇరవై ఏళ్లుగా!
అది పారెయ్యకూడదు కానీ
నా చిన్నప్పటి కామిక్ పుస్తకాలు మట్టుకు పారెయ్యాలి!
- చూడూ!
నీ కామిక్ పుస్తకాలు నెట్టులో దొరుకుతాయి. చదివే ఓపిక లేకపోతె యూట్యూబ్
లో బోల్డు విడియోలున్నాయి.
- మీ
అందరికీ ఒకేసారి చెప్తున్నా! ఏ గదిలోనైనా మీ
ఇష్టం కానీ నా వంటింట్లోకి
మట్టుకు అడుగెట్టద్దు.
- డాడీ!
ఇంకా ఎన్ని సంవత్సరాలు దాస్తావు ఆ 32 ఇంచిల ప్యాంట్లు!
నువ్వు ఆ సైజు నేను
టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు దాటేసావు.
ఇప్పుడు నాకు పెళ్లీడు
వచ్చింది. కానీ నువ్వు ఆ
ప్యాంట్లు మట్టుకు పారేయనివ్వవు.
- చూడు
బాబూ ఆ సిక్స్ ప్యాక్ నించి ఈ ఫామిలీ ప్యాక్
కి రావదానికి నాకు పదేళ్లు పట్టింది.
మరి అలాంటప్పుడు మళ్ళీ ఆ సైజు కి
వెళ్లాలంటే కూడా అన్నేళ్లే పడుతుంది.
ఊరికే తొందర పడితే లాభం లేదు. ఆ
సైజు కి వెళ్ళాక ఇప్పుడున్న
ప్యాంట్లు అన్నీ వేస్ట్ అయిపోతాయి. నువ్విప్పుడు ఆ 32 సైజు ప్యాంట్లు
పారేస్తే అప్పుడు మళ్ళీ బోల్డు డబ్బు పోసి కొనాలి. నా
వాళ్ళ కాదు.
- మమ్మీ!
ఇదేంటిది? భలే ఉంది. ఇంత
బరువేమిటి?
- అదా
తల్లీ. దాన్ని మరచెంబంటారు
- మరచెంబా?
అంటే
- అంటే
ఇప్పట్లా మా చిన్నప్పుడు సీసాలు,
ప్లాస్టిక్ సీసాలు లేవు. ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు బైట ఇప్పట్లా మినరల్
వాటర్ అమ్మడం కూడా లేదు. అందుకని
ఈ మరచెంబులో నీళ్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళం
- ఓహో!
కానీ ఇదేంటి మమ్మీ! ఇది ఖాళీ చెంబే
ఓ రెండు కేజీల బరువుంది. సైజు చూస్తే ఓ
లీటర్ నీళ్లు కూడా పట్టేట్టు లేవు
- అదంతేనమ్మా.
అప్పట్లో అవే ఉండేవి మరి.
మీలా మేధావి బుర్రలు కావు మావి. కొత్తవి
కనిపెట్టడానికి. అందుకని నోరు మూసుకుని పెద్దవాళ్ళు
ఏం చెప్తే అది వినేవాళ్ళం. మీలా ప్రతిదానికి
ఇదెందుకు ఇలా? అది అలానే
ఎందుకుండాలి అని ప్రశ్నలు వేస్తె
వీపు విమానం మోత మోగేది.
- ఇదేమిటీ
అని పొరపాటున అడిగితే నువ్వెక్కడికో వెళ్ళిపోయి భూమి గుండ్రంగా
ఉందని మా కుర్రోళ్ళ మీదకే
తెస్తావు. మీ పెద్దోళ్లున్నారే
- నేను
కాస్త ఆఫీస్ పని చేసుకోవాలి. నేను
లేను కదాని మీ ఇష్టం వచ్చినట్టు
కనిపించినవన్నీ పారెయ్యకండి. మీరంతా విడివిడిగానూ, జమిలీగానూ పారేద్దామనుకున్నవన్నీ ఓ చోట పెడితే
నేను ఆడిటింగ్ చేసి పర్మిషన్ ఇస్తా.
ఆ తర్వాతే పారేయడం
- ఇహ
అయినట్టేనా తల్లీ! మీ నాన్నఅప్రూవ్ చేయాలంటే
నా వంటింటి గిన్నెలు నీ కామిక్స్ మాత్రమే
పారేయమంటారు. నావల్ల కాదు కానీ నే
వెళ్లి వంట ఏర్పాట్లు చూస్తా.
మీతో పాటు సర్దుతూ కూర్చుంటే
వంటెవరు చేస్తారు. భోజనానికి ఒక్క
అయిదు నిమిషాలు ఆగరు ఒక్కళ్ళు కూడా
- డాడీ
ఆఫీస్ పని చేసుకుంటూ నువ్వు
వంట చేసుకుంటే నేనొక్కర్తినేనా సర్దడం. నాకేం పట్టింది! నేనూ టీవీ చూసుకుంటా
ఎవ్వరూ
చేయకపోతే నేనెందుకు చెయ్యాలి! నేను ఫ్రెండ్‌ని కలిసొస్తా
- పుత్రరత్నం
అయ్యా
అదీ సంగతి. మళ్ళీ వచ్చే దీపావళికి ఈ దీప్ క్లీనింగ్
కార్యక్రమం వాయిదా వేయడమైనది
ఇదీ ప్రతి దీపావళికి
ఇంటింటి రామాయణం!
గమనిక:
కొన్ని సంవత్సరాల క్రితం రాసిన దాన్నే కొంచం మార్చి పునః పోస్టు చేస్తున్నా
👌😊
ReplyDelete