నెలలో ఒకట్రెండు రోజులు తప్పించి మిగతా అన్ని రోజులు కూర చేయడం నాకు అలవాటు. కాలక్షేపం. ఆనందం అన్నది పాఠకులకి తెలిసిందే!
రోజూ చేయడం అన్నది నిరవధికంగా గత రెండున్నర ఏళ్లుగా సాగుతూండడంతో కూరల్లో తరుచుగా ప్రయోగాలు చేయడం అన్నది కూడా పరిపాటి అయ్యింది.
ఈ ప్రయోగాలకి ఇన్స్పిరేషన్ కోసం అప్పుడప్పుడూ యూట్యూబ్ లో వంటల వీడియోలు చూస్తాను. సాయంత్రం తీరుబడి ఉన్నప్పుడు టీవీ ముందు కూలబడి, రేపు ఏ కూర చెయ్యాలో మా ఆవిడని అడిగి (ఇన్ అదర్ వర్డ్స్ పర్మిషన్ అడిగి!) ఆ కూర వీడియోలు ఓ నాలుగైదు చూసి వాటిల్లో నాకు నచ్చిన అంశాలని ఎంచుకుని (వీడియోని కాదు) రెండు మూడు వీడియోలు కలగాపులగం చేసి ఓ కొత్త కూర చేసి పారేస్తాను.
ఎవరూ కనిపెట్టకపోతే కొత్త వంటలెలా పుడతాయి?
అప్పుడప్పుడూ నేను అలా కనిపెట్టి, చేసిన కూర మాస్టర్ చెఫ్ కార్యక్రమంలో చేస్తే ఫైనల్ కి వెళ్లే అవకాశాలు బహు ఎక్కువ! ఫైనల్ లో గెలిచేసినా గెలిచేయచ్చు!
ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే నిన్న సాయంత్రం అలాగే మా ఆవిడని రేపు ఏం కూర చేయమంటావు అనడిగితే దొండకాయ చేయండి అంది. ఉత్తర క్షణంలో ఓ నాలుగు దొండకాయ కూర వీడియోలు చూసేసి ఇవాళ పొద్దున్న వాటిని ఎలా మిక్స్ చేసి కూర చెయ్యాలో అని ఆలోచిస్తూ నిద్ర పోయా. కలలో ఓ మాంఛి రెసిపీ తట్టింది కూడా!
సరే రోజులాగే కాకికంటే ముందు లేచి, ఫిల్టర్ వేసి ఓ మాంఛి వేడి వేడి "ఆనంద్"లాంటి ఫిల్టర్ కాఫీ తాగి, వాకింగ్ చేసి ఇహ అప్పుడు కూర చేద్దామని వంటింట్లోకి వెళ్తే .... యూట్యూబ్ వీడియో కాప్షన్ టైపులో చెప్పాలంటే ... ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు!
నేనలాగే షాక్ అయ్యా! ఎందుకంటే వంటింట్లో గట్టు మీద బీరకాయలు దర్శనం ఇచ్చాయి.
అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. పొద్దున్నే నేను చేయాల్సిన కూర ఫ్రిడ్జ్ లోంచి తీసి వంటింట్లో గట్టు మీద పెట్టడం మా ఆవిడకి నేను ప్రత్యేకంగా అప్పగించిన బాధ్యత. ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ లో ఎక్కడేముందో అవి పెట్టిన ఆవిడకే తెలుసు. పైపెచ్చు ఒక గిన్నె లాగితే రెండు గిన్నెలు ఢాంమని కింద పడడం, లేదా ఓ కూర కవర్ తీస్తే రెండు కూర కవర్లు బైట తలకిందులుగా పడి అందులో ఉన్న దొండకాయల్లో, వంకాయలో దొర్లుకుంటూ హాల్ అంతా పడడం వాటిని మళ్ళీ ఏరి సదరు కవర్లలో పెట్టడం లోగడ చేసి నా నడుం పట్టుకుపోయి ఇలా ఏర్పాటు చేసాను.
మళ్ళీ కథలోకి వస్తే ఇప్పుడు గట్టు మీద బీరకాయలు ఉన్నాయంటే దానర్ధం మేధావులైన పాఠకులు ఇట్టే కనిపెట్టేస్తారు.
అంటే ఇప్పుడు నాకు అగ్ని పరీక్ష అన్నమాట! అంటే దొండకాయ కూరకి ఫుల్లుగా ప్రిపేర్ అయ్యి వస్తే ఇప్పుడు బీరకాయ కూర చేయాలన్నమాట!
అయినా వంటనావంటసమర్దుడిని ఈ చిన్ని పరీక్షలు అంటే స్లిప్ టెస్టులు నాకో లెఖ్ఖా?
అసలే నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఇలాంటి అగ్ని పరీక్ష విజయవంతంగా పాస్ అయ్యి ఓ చరిత్ర సృష్టించాను.
అదేమిటంటే .....
కాలేజీలో చదువుకునే రోజుల్లో అంటే రోజూ కాలేజీకి వెళ్లానని ఓ పెడర్ధం వచ్చే ప్రమాదం ఉంది. అబ్బే అటువంటి చెడు అలవాట్లు లేవు నాకు.
మరంచేత ఆడుతూ పాడుతూ మధ్యే మధ్యే చిత్రదర్శనం వగైరాలు చేసి సంవత్సరం చివర అటెండన్స్ బహు తక్కువుందని నోటీసు బోర్డులో మన పేరు చూసి తొణక్కుండా బెణక్కుండా ఏదో మాయ చేసి ఓ ఇరవై అయిదు రూపాయలు (5 సినిమాల ఖర్చు!) కాండోనేషన్ కట్టి పరీక్షలకి ప్రవేశ హాల్ టికెట్ గర్వంగా తీసుకుని ఫైనల్ పరీక్షలు రాయడం మొదలెట్టాక ఇంగ్లీష్ పేపర్ తర్వాత తెలుగు పరీక్షకి కాలేజీకి వెళ్లిన నేను మళ్ళీ యూట్యూబ్ కాప్షన్ భాషలో ఈసారి "అవాక్కయ్యాను"!
ఎందుకు?
ఎందుకంటే నేను తెలుగు నాన్ డిటైల్డ్ అశోకుడి జీవిత చరిత్ర సెకండ్ హ్యాండ్ బుక్ కొని ముందు రోజు రాత్రి ఓ లుక్కేసి అది కూడా క్లుప్తంగా అశోకుడు చెట్లు నాటెను. కళింగ యుద్ధంలో ఓడిపోయి దీనంగా దిగులుగా అయ్యిపోయి బౌద్ధ మతం స్వీకరించెను లాంటి ప్రధాన సంఘటనలు ముక్కున పెట్టుకుని ఆ రోజుల్లో సెకండ్ పేపర్ కేవలం నాన్ డిటైల్డ్ మీద ఒక్కటే ప్రశ్న వచ్చేది అది కూడా అతని శీలము వర్ణించుడి టైపు. అశోకుడి గురించి తెగ రాసేద్దామని ఓ అరగంట ముందు కాలేజీకి వెళ్తే నా క్లాసుమేట్లు అందరి చేతుల్లో ఇంకేదో పుస్తకం!
ఏంట్రా బాబూ అని ఒకడి పుస్తకం లాక్కుని చూస్తే బుద్దుడి జీవిత చరిత్ర! ఇదేటిది అశోకుడి చరిత్ర పరీక్షకి వచ్చి అందరూ ఇలా బుద్దుడి చరిత్ర చదివిస్తున్నారు అని ఇప్పుడు లేనిపోని సిగ్గు పడితే ఘోరాలు అయిపోయే అవకాశం ఉందని ఒకణ్ణి అడిగా "ఏంటి గురూ బుద్దుడి చరిత్ర చదువుతున్నావు? మనకి సిలబస్ అశోకుడి చరిత్ర కదా?
వాడు నా వేపు అదోలా చూసాడు. ఇప్పుడవన్నీ పట్టించుకుంటే లాభము లేదు. పరీక్షకి ఇంకా 20 నిమిషాలే ఉంది. ఇదేదో మూడో ప్రపంచ యుద్ధం అంతటి ప్రమాదంలా ఉంది
వాడు అదోలా చూసాక ఓ నిమిషం ఆగి జాలిగా చూడడం మొదలెట్టాడు. ఇప్పటి డైలీ టీవీ సీరియల్స్ లో అయితే ఓ 5 నిమిషాలు వాడి చూపులు, ముఖ కవళికలు క్లోజ్ అప్ లోనూ మిడ్ షాట్స్ లోనూ చూపించచ్చు. అప్పుడా సౌకర్యాలు లేవు.
ఒరేయ్ ఆ నవరసాలు ఒలికించడం ఆపి సమాధానం చెప్పరా బాబు అని నా చేత బ్రతిమాలించుకున్నాక బాంబు పేల్చాడు.
"అశోకుడి జీవిత చరిత్ర పోయినేడాడిది. ఈ ఏడాది మార్చేశారు. ఇప్పుడు బుద్దుడి జీవిత చరిత్ర నాన్ డిటైల్డ్"
ఈ డైలాగ్ సిల్క్ నైట్ గౌన్ వేసుకున్న గుమ్మడి వింటే వెంటనే గుండె పట్టుకుని మోహంలో అర్ధం కాని ఫీలింగ్స్ అన్నీ చూపించి నేలమీద ఢాంమని పడిపోయేవాడు
కానీ మనం యూత్ కదా? వెంటనే గుండ్రాయి (గుండె రాయి) చేసుకుని ఓ పాలి ఆ బుక్కిటివ్వు అని వాడు ఇవ్వను అనే లోపల నేనే వాడి చేతిలోంచి ఆ పుస్తకం లాగేసి ఒకింత దూరంగా వెళ్లి అక్కడో పెద్ద రాయుంటే దాని మీద సెటిల్ అయ్యి గబగబా బుద్దుడి జీవిత చరిత్ర 110 పేజీలు యమా స్పీడుగా తిప్పేసి ఆయన జీవితంలో ముఖ్యాంశాలు ముక్కున పెట్టుకుని వెళ్లి పరీక్ష ఇంకా అయిదు నిమిషాలుంది అనగా ఆ పుస్తకాన్ని సదరు ఓనర్ చేతిలో పెట్టి దిగ్విజయంగా పరీక్ష భారీగా అడిషనల్ షీట్స్ తీసుకునల్లా రాసి పారేసి విజయగర్వంగా నవ్వుతూ బైటికొచ్చా.
రిజల్ట్స్ వచ్చాక చూస్తే ఏముంది? షరా మామూలే? అత్తెసరు మార్కులతో అగ్ర శ్రేణిలో పాస్ అయ్యా!
ఇక్కడో కొసమెరుపు! పరీక్ష రాసి బైటికొచ్చాక అందరు తెచ్చిన పుస్తకాలు గది బైట చిందరవందరగా పడేసి ఉంటాయిగా. వెళ్లి ఓ పుస్తకం తెరిచి నేను ఏమన్నా ముఖ్యమైన విషయాలు మర్చిపోయానా అని చూస్తే మళ్ళీ యూట్యూబ్ భాషల్లో షాక్ అయ్యాను.
ఎందుకంటే బుద్దుడి జీవిత చరిత్ర చరిత్రకారుల కంటే బాగా రాశానని ఫీల్ అయ్యాను కానీ అతి చిన్ని పొరపాటు అయ్యింది. భార్య పేరు తల్లికి, తల్లి పేరు భార్యకి తారుమారు చేసేసా! అప్పటికప్పుడు రుబ్బితే ఇలాగే ఉంటుంది మరి! కానీ పరీక్ష పేపర్ దిద్దిన మాష్టారు వీడికి బాగా తెలుసు బుద్దుడి గురించి (పైగా ఓ 100 గ్రాముల అడిషనల్ షీట్స్ కూడా నింపానుగా!) ఏదో టెన్షన్ లో అలా పొరపడ్డాడు కుర్రాడు పాపం అని పాస్ చేసాడు!
మరి మళ్ళీ ఇప్పటికొస్తే (చూసారా సినిమాలు చూస్తే ఇలా ఫ్లాష్ బ్యాక్ లు బాగా అలవాటవుతాయి) అప్పటికప్పుడు మారిన సిలబస్ కి తడబడకుండా పరీక్ష పాస్ అయ్యిన వాడికి ఇలా చివరి క్షణంలో కూర మారిస్తే ఓస్! ఇదెంత ఛాలెంజ్
వెంటనే ఎప్పుడూ అన్ని కూరల్లో వేసేవే వేసి బీరకాయ కూరని యధావిధి అద్భుతంగా చేసి పడేసా. చిన్ని ట్రిక్ చేశా. ఎప్పుడూ వేసేవే కానీ అవి మూకుడులో వేసే వరస మార్చి చేశా! అంటే కూర వేగాక వేయాల్సిన కారం, ధనియాల పొడి వగైరా పోపులోనే వేసి చేశా. రుచి అడక్కండి. స్వర్గానికి ఇంచుమించు ఓ ఇంచి దూరం!
కథ కంచికి. నేను స్నానానికి!
Excellent story ARUN sir 🙏
ReplyDeleteThank you
DeleteChala bagundi sir
ReplyDeleteThank you
Delete❤️❤️❤️😊🤗
ReplyDeleteThank you
DeleteSome PPL, whatever they do, they leave a very positive n cheerful impact. Your post, pics and the write up are truly amazing and while reading, I felt as if some conversation happening with my own family members...💯❤️
ReplyDeleteThank you very much. You made my day!
Delete