మళ్ళీ మర్చిపోతాను ముందస్తుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
వైకుంఠం అనగానే అరచేతిలో వైకుంఠం గుర్తొస్తుంది
అరచేయి అనగానే నా చిన్నప్పుడు అరచేతిలో బొంగరం తిప్పడం గుర్తొస్తుంది
ఇప్పుడు ఆ ఎపిసోడ్ మీ కోసం
నాకు సుమారు పదేళ్లున్నప్పుడు నా దగ్గర రెండు బొంగరాలు ఉండేవి. చెక్కతో చేసిన మాన్యువల్ బొంగరాలు! మాన్యువల్ అని ఎందుకన్నానంటే ఈ రోజుల్లో మెకానికల్ బొంగరాలొస్తున్నాయి!
నాకు ఇప్పటికీ ఆ రెండు బొంగరాలు కళ్ళముందు కనిపిస్తాయి వాటిని తలుచుకోగానే. ఒకటి పెద్దది. బండలా ఉండేది. కానీ మంచి ఆకర్షణీయమైన రంగుల్లో ఉండేది! చిన్నది బుజ్జిది! అది నా ఫేవరెట్
ఆ రెండు బొంగరాలతో బోల్డు విన్యాసాలు, యుధ్ధ క్రీడలు.
యుద్ధ క్రీడలంటే ప్రత్యర్థి బొంగరాన్ని మన బొంగరంతో నడినెత్తి మీద కొట్టి కపాలమోక్షం చేయడం! ఈ బొంగర యుద్దాలు వారానికోసారో, పండగ ప్రత్యేకంగానో జరిపేవాళ్ళం. లేకపోతే రోజూ బొంగరాలు పగలకొట్టుకుంటే ఇంట్లో మళ్ళీ మళ్ళీ బొంగరాలకి డబ్బులడిగితే మన వీపు బద్దలవుతుంది కదా?
నా బుజ్జి బొంగరం ములికి బాగా సూదిగా ఉండేది. దాన్ని గురి చూసి కొట్టడం కూడా చాలా వీజీగా ఉండేది. అందుకని దాంతో చాలా బొంగరాలు పగలకొట్టాను.
ఆ పెద్ద బండ బొంగరం మోటుగా ఉండేది. కొంచం గురి తప్పేది కూడా. కానీ ఇంకో బొంగరం నెత్తి మీద పడిందంటే దాని బరువుకే ప్రత్యర్థి బొంగరం మిగిలిపోయేది. అది బాగా బరువుగా ఉండడంతో కొన్నాళ్ళకి నేను దాన్ని విసిరే యాంగిల్ సరిగ్గా లేక ఓసారి దాని ములికి కొంచం ఓ పక్కకి ఒంగిపోయింది. నాకదంటే ఇష్టం లేదు కాబట్టి ఆ ఒంపు సరి చేయకుండా అలాగే వాడేవాడిని. ఆ వంకర ముల్లుతో అది పాపం అటూ ఇటూ సముద్రంలో తుఫానులో ఊగిపోయే నావలా, బాగా మందు కొట్టి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళేవాడిలా అష్టావక్రముగా తిరిగేది. చూడ్డానికి భలే విచిత్రంగా ఉండేది. కొన్నాళ్ల తర్వాత అప్పోజిషను వాడి బొంగరం ధాటికి తట్టుకోలేక కింద ములికి దగ్గర నించి పగిలిపోయింది!
తర్వాత చాలా ఏళ్ళు కేవలం ఆ చిన్న బొంగరంతోనే విన్యాసాలు. విన్యాసం అంటే ఏమిటంటారా బొంగరం విసిరి అది నేలమీద తిరుగుతూంటే దాని ములికి దగ్గర మన చేయి పెట్టి రెండు వేళ్ళ మధ్యనించి దాన్ని చేతిమీదకి తీసుకుని అరచేతిలో తిప్పడం!
కొంతమంది అనుభవజ్ఞులు బొంగరాన్ని కిందకి కాకుండా గాల్లోనే భూమికి సమాంతరంగా విసిరి దాన్ని డైరెక్ట్ గాఅరచేతిలోనే పడేట్టు వేసి అరచేతిలో తిప్పేవాళ్ళని లీలగా గుర్తు.
కొన్ని సంవత్సరాల క్రితం ఓ బంధువుల ఇంట్లో వాళ్ళ అబ్బాయి ఈనాటి మెకానికల్ బొంగరం తిప్పుతూంటే వాడిని మాయ చేసి ఆ బొంగరాన్ని నా అరచేతిలో తిప్పి చూపిస్తే వాడికి అరచేతిలో వైకుంఠం చూసినంత హాశ్చర్యానందసంభ్రమం! ఇప్పటి ఈ (E) జనరేషన్ కి అలాంటి విన్యాసాలు తెలీవు. అసలా మాటకొస్తే అతి తక్కువమందికి ఈ బొంగరాల విషయం తెలుసు.
అలా నేను అరచేతిలో బొంగరం తిప్పిన ఫోటో మీకోసం వైకుంఠ ఏకాదశి ప్రత్యేకం!
No comments:
Post a Comment