Monday, August 31, 2015

Betalprasna!!

ఈనాటి #బేతాళప్రశ్న !! కంగారు పడకండి! "ఈనాటి" అంటే ప్రతిరోజు బేతాళప్రశ్నలు వేస్తానని కాదు! ఏదో అప్పుడప్పుడూ!!

నేను కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే హైదరాబాద్ లో సిగ్నల్స్ దగ్గర సర్వ సాధారణంగా ఒక బిచ్చగత్తె కిటికీ అద్దాన్ని, దాని ఇంటి తలుపు తట్టినట్టు, తట్టడం మొదలెడుతుంది! ఇది నాకు బాగా ఇర్రిటేట్ చేసే విషయం కాని ఏమి చెయ్యలేని పరిస్తితి. పొరపాటుని ఏమన్నా నోరు జారి అన్నామంటే "పోకిరి" సినిమాలో లాగా రేపటి నించీ నన్ను టార్గెట్ చేసి బాధపెడతారేమో అని, నోరుమూసుకొని వాళ్ళున్న వేపు చూడకుండా,  రెండో వేపో, ఎదురుగానో చూస్తూ ఉంటాను. వాళ్ళు అలా కిటికీ అద్దంమీద కొట్టీ, కొట్టీ, విసిగి వెళ్ళిపోతారు.

ఇంతకీ ఇలా అసలు విషయం చెప్పకుండా నానుస్తున్నానని భావించే పాఠకులకి ఒక మనవి. ఇదే బేతాళ కథ చందమామలో వస్తే నాలుగు పేజీల తర్వాత బేతాళుడు రంగప్రవేశం చేస్తాడు కదా అందుకని నన్ను కనీసం నాలుగు లైనులు రాయనివ్వండి!

ఇక అసలు కథలోకి వస్తే ఒకరోజు నేను నాఫ్రెండ్ నా కారులో వెళ్తున్నప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాము. నా ఫ్రెండ్ కిటికీని ఒక బిచ్చగత్తె మాములుగానే ఠపఠప కొట్టడం మొదలెట్టింది. నేను కూడా మామూలుగా రెండో వేపు చూస్తూ, నిమ్మకు నీరెత్తినట్టు, కూర్చున్నాను. ఇంతలో నా ఫ్రెండ్ కిటికీ అద్దం దించేసి, రెండు సీట్లకి మధ్యలో నేను అపురూపంగా దాచుకున్న చిల్లరలోంచి ఒక అయిదురూపాయల కాయిన్ మంచి స్టైల్ గా తీసి ఆమె చేతిలో వేసాడు, నేను ఆపేలోపల :(

నాకు బోల్డు కోపం వచ్చింది. కాని ఏం మాట్లాడకుండా, సీరియస్గా (ఏడుపు) మొహం పెట్టుకోని గ్రీన్ సిగ్నల్ రాగానే అక్కడినించి నిష్క్రమించాను. పక్కవాళ్ళదయితే అయిదు రూపాయలేం ఖర్మ, అగ్రహారాలే దానం ఇస్తాను నేనైతే!

ఇంతకీ బేతాళప్రశ్న ఏమిటంటే ఆ బిచ్చగత్తెకి డబ్బు వేసింది నా ఫ్రెండ్ కాబట్టి, ఆ 5 రూపాయల పుణ్యం నా ఫ్రెండ్ కి వస్తుందా? డబ్బు నాది కాబట్టి పుణ్యం నాకు వస్తుందా? లేక ఇద్దరికీ చేరి సగమా?

సమాధానం తెలిసీ చెప్పకపొతే ఏమవుతుందో నాక్కూడా తెలీదు :(

NB: అద్దిరబన్నా ఇన్నాళ్ళకి ఒక బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చే అవకాశం వచ్చింది కదా అని మొత్తం పుణ్యం నా ఫ్రెండ్ కే చెందుతుంది అని చెప్దామనుకునేవాళ్లకి ఒక చట్ట బద్ధమైన హెచ్చరిక. (ఎందుకంటే ఆ దానం నా అనుమతి లేకుండా చేసాడు కాబట్టి!) అలాంటి తీర్పు ఇచ్చిన వాళ్ళ ఇళ్ళకి నేను వచ్చి, వీధిలో వెళ్తున్న బిచ్చగాళ్ళకి మీఇంట్లోంచి తలా ఒక కేజీ ఉల్లిపాయలు దానం ఇచ్చే ప్రమాదం ఉంది! తస్మాత్ జాగ్రత్త!!! 

Saturday, August 22, 2015

Un Fair & Not so Lovely!!

అన్ ఫెయిర్ & నాట్ సో లవ్లీ!!

ముందు మాట: ఈ రచనలో ఒక్క రవ్వ మనం ప్రతిరోజూ వినే ఒక రెండు slang పదాలు సందర్భానుసారం అంటే ఎమోషన్కి expression పండాలంటే (సినిమా వాళ్ళ భాషలో) ఆ మాత్రం మాండలీకం వాడాల్సిందే అని రాయడం జరిగింది! కొంతమందికి అసభ్యంగా అనిపిస్తే క్షంతవ్యుడిని.

ఇంకొంచం ముందు మాట: ఈ రచన కొంచం సత్యజిత్ రే సినిమాలా అనిపించచ్చు!! అంటే నేను ఆయన రేంజ్ అని కాదు. ఆయన సినిమాల్లో లాగా కొన్ని జీవిత నగ్న సత్యాలు చెప్తానన్నమాట! ఇక్కడ నాకో సందేహం అసలు ఈ "నగ్న సత్యం" అన్న మాట ఎందుకు పుట్టింది? అంటే కొన్ని నిజాలు బట్టలు వేసుకుని, లేదా ఎవ్వరికీ కనిపించకూడదని ముసుగులు వేసుకుని ఉంటాయా?

చివరి మాట: ఇదేమిటి ఈ విచిత్రం? చివరి మాట కూడా ముందస్తుగా చెప్పేస్తున్నారు అని హాస్చర్య పడిపోతున్నారా? ఇలా ఎందుకంటే కొంతమంది చివరి దాక చదవక పోయే ప్రమాదం ఉంది! అందుకని ముందు జాగ్రత్త చర్య అన్నమాట. ఇంతకీ విషయం ఏమిటంటే నేను మానసిక వైద్యుడిని కాదు! నేను రాసిన దానికి ఎక్కడా రీసెర్చ్ చేసి తెలుసుకున్నవి లేవు. కేవలం నా సొంత తెలివి మాత్రమే! నేను రాసిన దాంట్లో ఒకింత లేదా బోల్డంత నిజం ఉందనిపిస్తే నమ్మండి.

ఇహ కథా ప్రారంభం!

సాధారణంగా ఇంట్లో కూతురైనా, కొడుకైనా నాన్న దగ్గరి నించి కొంచం భారిగా సొమ్ములు కావాలంటే, అంటే వాళ్లకి ఏ Samsung S 6 కాని iPhone 6 కాని కావాలనుకోండి. నాన్నని డైరెక్ట్ గా అడిగితే బెడిసి కొట్టే అవకాశాలు ఎక్కువ కదా. ముందు అమ్మని కాకా పడతారు రికమండేషన్ కోసం! అప్పుడేం చేస్తారు? అమ్మ వంటింట్లో వంట చేస్తున్నప్పుడు వెళ్లి పక్కని నిలబడి మెల్లిగా ఆ కబురు ఈ కబురు చెప్తారు. డైరెక్ట్ గా విషయంలోకి వస్తే బాగోదు కదా. మేనమామ కబుర్లు పుట్టింటిదగ్గరా అన్నట్టు వీళ్ళ సంగతి అమ్మలకి తెలీకనా. వాళ్ళు కూడా వీళ్ళ కబుర్ల ప్రహశనంలో పాల్గొంటారు. తర్వాత ఏమి అడుగుతారో అని లోపల్లోపల ఆలోచించేస్తూ!

(పిడకల వేట: ఇక్కడ ఇంకో సందేహం. Samsung వాళ్ళు, Apple వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి ఇలా నంబర్ల వారీగా ఫోనులు అమ్మేస్తూ ఉంటారా? ఇద్దరి లేటెస్ట్ ఫోనులు 6 దాక వచ్చి ఆగాయి. అసలు Apple కంపెనీ వాళ్ళు iPhone 2 మార్కెట్ లో వదిలినప్పుడే నేను వాపోయాను. నేను iPhone కొనే సొమ్ములు కూడపెట్టేటప్పటికి iPhone 8 వస్తుంది అని. నేనింకా ఒక మట్టిహుండీ కొనలేదు. కనీసం మార్గదర్శి లోనైనా చేరలేదు. వీళ్ళు అప్పుడే iPhone 6 దాక వచ్చేసారు!)

అప్పుడు కూతురో, కొడుకో అమ్మ తరుగుతున్న వంకాయలు నీళ్ళల్లో వెయ్యడం చూసి "అదేంటమ్మా? వంకాయ ముక్కలు నీళ్ళల్లో ఎందుకేస్తున్నావు? మొన్న బెండకాయలు తరిగాక వాటిని నీళ్ళల్లో వెయ్యలేదు కదా?" అంటారు. అప్పుడు ఆ అమ్మ ఏమంటుంది "వంకాయ నీళ్ళల్లో వెయ్యక పొతే ముక్కలు నల్లగా అయిపోతాయి" అంటుంది! దాంతో ఈ కుర్రాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఒక్కసారి మీరే ఆలోచించండి. నలుపు చూడ్డానికి బాగుండదు. తెలుపు కాని ఇంకే రంగైనా బాగుంటుంది అనే కదా! అది వాళ్ళ మనసులో నాటుకు పోతుంది. అంతే అది అలా కొన్ని సంవత్సరాలకి బలపడి వాళ్ళు నల్లగా ఉంటే వీలయినంత తెల్లగా అవ్వడం కోసం ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి వాడడం, పెళ్లి ఊసోచ్చేటప్పటికి అబ్బాయిలంతా (వాళ్ళు నల్లగా ఉన్నా సరే!) తెల్లగా ఉన్నఅమ్మాయే కావాలని పట్టు పట్టడం చాల సర్వ సాధారణం అయ్యిపోయింది. మరి ఈ discrimination కి పునాది వేసి దాన్ని పెంచి పెద్దది చేసి తొక్కలోది ఈ తెల్ల తొక్కకి అంత పెద్దపీట వేసి, చివరాఖరికి పిల్లలని తప్పుపట్టేది కేవలం పెద్దవాళ్ళే!

నాకు తెలీక అడుగుతాను వంకాయ కూరకాని, పచ్చడి కాని చేసాక అది నల్లగా ఉంటే ఏమయ్యిందిట? వంకాయగా ఉన్నప్పుడు మహా సుందరమైన రంగులో ఉన్నట్టు! కూర నల్లగా ఉంటే వచ్చే ఉపద్రవం ఎమన్నా ఉందా? లేదు.ఏ రంగులో ఉంటే ఏమిటి. అనవసరంగా పిల్లల మనస్సుల్లో నలుపు బాగుండదని ఒక ఆలోచన ఎందుకు పెట్టడం?

ఒక్కసారి ఆలోచించండి! నేనుచెప్పినదాంట్లో ఒకింత నిజం ఉందనిపిస్తే ఇవాల్టి నించి కనీసం వంకాయలని తరిగాక నీళ్ళలో వెయ్యడం మానేయ్యండి!

ఈ వర్ణ వ్యత్యాసానికి తెర దించెయ్యండి, ఇవాల్టి నుంచీ వర్ణరహిత సమాజం కోసం మీ వంతు తోడ్పడండి !!