Tuesday, October 14, 2014

మొక్కని అన్నంతో పెంచుతున్నాను!!

మొక్కని అన్నంతో పెంచుతున్నాను!!

నమ్మలేని నిజం! నేను ఒక మొక్కకి అన్నం పెడుతున్నాను!!

అదెలాగా? ఎందుకు? అదేం బుద్ధి?! అని మీరు లక్ష యక్ష ప్రశ్నలు వేస్తారని తెలుసు.  మరింకెందుకు ఆలీసం! సమగ్రంగా వివరిస్తాను

మా ఇంట్లో రోజూ పొద్దున్న మిగిలిపోయిన రాత్రి అన్నం డాబామీద పావురాలకి పెడతాము. రోజూ మా ఆవిడ ఆ డ్యూటీ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ నేను పాపాలు ఎక్కువ చేసేస్తున్నానేమోనని ఒక్క పిసరు పాపభీతి పుట్టినప్పుడు మా ఆవిడ చేతిలోంచి ఆ అన్నం గిన్నె తీసుకొని ఆ పావురాలకి నేనే అన్నం పెడుతూంటాను. అలా పెట్టాక ఇంకో పని కూడా ఉందండోయ్! డాబా మీద roof garden లాగ ఫీల్ అయ్యిపోయి ఓ నాలుగు మొక్కలు కూడా పెంచుతున్నాం. ఈ పావురాల బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అయ్యాక ఆ మొక్కలకి నీళ్ళు పొయ్యడం కూడా రోజూ చేసే పని.

నేను పావురాలకి గోడమీద గిన్నెలో అన్నం అంతా చేత్తో ఊర్చిపెట్టాక నా చేతికి అయిదారు మెతుకులు అతుక్కుంటాయి. వెంటనే మొదటి మొక్కకి పోస్తున్న నీళ్ళతో చెయ్యి కదిగేసుకుంటాను. అప్పుడు ఆ మెతుకులన్నీ ఆ కుండీలో పడతాయి. మర్నాడు పొద్దున్న చూస్తే ఒక్క మెతుకు కూడా కనిపించదు! అంటే అర్థం ఆ మొక్కకి నేను అన్నం పెట్టి పెంచుతున్నట్టే కదా! ఆ మొక్క కూడా పోషఖాహారంతో  బాగా ఏపుగా పెరుగుతోంది! దానికి అన్నం బాగా వంట పట్టినట్టుంది:)

ఇదీ నేను మొక్కకి అన్నం పెట్టె ప్రహసనం !!

No comments:

Post a Comment