Thursday, January 16, 2025

Fond memories of cycle!

 పాత రచన పునర్ముద్రణ! కొన్ని సవరణలు, వివరణలతో 


1970's!! అంటే మూగమనసులు సినిమా మొదటి సీన్లో ముసలతను చెప్పినట్టు "అబ్బో అదెప్పటి మాటా?" ఓ 50 ఏళ్ళ కిందటి సంగతులు!


ఆ రోజుల్లో కుర్రకారు కి పేరులోనే కారు.. ఇప్పటి యువత లాగా ఇంటర్ లో బైక్, డిగ్రీ లో కారు లేదు మాకు 🙁


ఆ రోజుల్లో సైకిల్ ఉంటే కాస్త ఉన్న వాళ్ళకింద లెక్క! హంబర్ సైకిల్ ఉంటే కాలర్ ఎగరెయ్యడమే! 


ఇంతకీ అప్పట్లో నాకు  హంబర్ సైకిల్ ఉండేది. ఇహ చూడండి. నా వైభోగం. ఊరంతా రయ్యిరయ్యిమని తిరిగెయ్యడమే! 


ఒహటి రెండు సార్లు మా నాన్నకి కొంతమంది (నా లాగ స్పీడుగా సైకిల్ తోక్కలేని వృద్ధులు!) కంప్లైంట్ చేసేవాళ్ళు! "మీ అబ్బాయి ఈ మధ్య సైకిల్ మరీ స్పీడుగా తొక్కుతున్నాడు" అని! మా నాన్న దాన్ని చాలా లైట్ తీసుకోని "మీ పిచ్చి కాని, కుర్రాళ్ళు కాకపోతే మనం తొక్కుతాముటండీ స్పీడుగా" అని సుతారంగా వాళ్ళ కంప్లైంట్ ని బుట్ట దాఖలు చేసేవాళ్ళు! ఆ మాట నా చెవిని పడగానే నేను మరీ రెచ్చిపోయి శాయశక్తులా వీర స్పీడుగా సైకిల్ తొక్కడం మొదలెట్టా!


నాకు సైకిల్ ఎలా వచ్చిందంటే నేను తొమ్మిదో క్లాస్ చదువుతున్నప్పుడు సైకిల్ కొన్నారు మా నాన్న! నిజానికి అయన కోసమే కొనుక్కున్నారు కానీ కొన్న రెండు నెలలకే ఆయనకి సబ్ జడ్జి నుంచి డిస్ట్రిక్ట్ జడ్జిగా ప్రమోషన్ తో పాటు గుంటూరు ట్రాన్స్ఫర్ అవ్వడంతో కుటుంబాన్ని అమలాపురంలోని వదిలేసి తను ఒక్కరు వెళ్లిపోయారు.ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో మేము నలుగురు పిల్లలం ఊరు మారడం కష్టం కాబట్టి. సైకిల్ వదిలేసి వెళ్లారు! అలా వారసత్వం టైపులో నాకు దక్కింది ఆ సైకిల్.  అప్పుడు చూడాలి నా మొహం! పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగిపోయింది! అది కొన్నప్పుడు షాపుకి నేను వెళ్ళాను. నిజానికి సైకిల్ పార్ట్శ్ అన్నీ మనం కొన్నప్పుడు షాప్ వాడు బిగించి సైకిల్ చేస్తాడని అప్పుడే తెలిసింది! వాడు అలా నా(!) సైకిల్ మొత్తం తయారు చేస్తున్నప్పుడు నేనలా తన్మయత్వంతో చూస్తూ తెగ ఆనంద పడిపోయాను! 


దానికొక చుక్కల చుక్కల బ్లూ కలర్ సీట్ కవర్ వేయించాను. దాంట్లో కొంచం స్పాంజ్ ఉండి కూర్చున్నప్పుడు కాస్త హాయిగా ఉండేది. ట్రింగ్ ట్రింగ్ మనే కొత్త బెల్ 🙂 దాని శబ్దం వినడానికి చాలా బాగుండేది. అందుకని ఎవరూ అడ్డు లేకపోయినా అప్పుడప్పుడూ ఆ బెల్ గణగణమనిపించేవాడిని! అల్ప సంతోషిని కదా!!


సైకిల్ నా పరం అయ్యిన దగ్గరినించీ అన్ని బైటి పనులు అంటే కూరలు తేవడం, రోజూ పొద్దున్నే పాలవాడి దగ్గరకి వెళ్లి పాలు కాన్ లో తేవడం, పచారీ సామాన్లు తేవడం, అక్కలిద్దరినీ బజారుకి తీసుకెళ్లడం (ఇద్దరినీ ఒక్కసారి కాదండోయ్! విడివిడిగా!!), అప్పుడప్పుడూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి కూడా, ఇలా ఒహటేమిటి నానా గోత్రస్య అన్ని పనులకి నేను, నా సైకిల్ ఎవరెడీ 😉


తదుపరి మేమంతా కూడా గుంటూరు వచ్చేసాం. కానీ మా నాన్న జిల్లా జడ్జిగా సైకిల్ తొక్కడం బాగోదని పదివేలు పెట్టి సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు కొనుక్కున్నారు. కానీ అప్పుడప్పుడూ వెరైటీగా ఆఫీస్ కి సైకిల్ తొక్కుకుని వెళ్ళేవారు! ఆయన సైకిల్ తొక్కుతూంటే ముందర కారు డ్రైవర్ తనో సైకిల్ మీద, వెనకాల డవాళ బంట్రోతు ఇంకో సైకిల్ మీద!


ఆ మధ్య పేపర్ లో చదివాను! కొన్ని వేల మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిళ్ళు నడిపుతూ దొరికి పోయారుట హైదరాబాద్ లో! 


ఆ రోజుల్లో మా లాంటి కుర్రాళ్ళని కూడా పోలీసులు భారీ ఎత్తుని పట్టుకొనే వాళ్ళు. రాత్రి పూట సైకిల్ కి లైట్ లేకుండా తొక్కినా, లేదా డబుల్స్, ట్రిపుల్స్ తొక్కినా! ఆ రోజుల్లో ఆ రెండూ చాల పెద్ద నేరాలు!! 


లైట్ కోసం డైనమో పెడితే టైర్ అరిగి పోతుందని హేండిల్ బార్ ముందు హుక్కుకి బాటరీ లైట్ పెట్టెవాడిని! దాన్ని సాయంత్రం బైటికి వెళ్ళినప్పుడల్లా హేండిల్ బార్ కి తగిలించడం. ఇంటికొచ్చాక తీసి లోపల పెట్టడం! ఇప్పుడు హెల్మెట్ లాగ 🙂 


అప్పుడప్పుడూ ఆ పోలిసుల బారిని పడడం, మర్నాడు మాజిస్త్రేట్ కోర్ట్ లో దోషుల్లా నిలపడి జరిమానా కట్టడం. ఇంట్లో వాళ్లకి తెలియకుండా! 


ఓసారి నా ఫ్రెండ్స్ ఇద్దరినీ ఎక్కించుకుని ట్రిపుల్ రైడింగ్ చేస్తూ శంకరవిలాస్ సెంటర్ కి వెళ్లాను. సెంటర్ ఇంకొంచం దూరం ఉందనగా అక్కడ పోలీసులు ఉంటారని దిగండిరా అని ఫ్రెండ్స్ తో అంటే "మీ నాన్న జిల్లా జడ్జి! నిన్నెవడురా పట్టుకునేది? మేము దిగం" అని భీష్మించుకుని కూర్చున్నారు! ఇహ చేసేదేం లేక సెంటర్ దాకా వెళ్లడం ఏమిటి ఓ పోలీసు కానిస్టేబుల్ గయ్యిమని విజిల్ వేసుకుంటూ మమ్మల్ని ఆపాడు. 


వెంటనే నా ఫ్రెండ్స్ ఇద్దరూ జంప్! నేను మా నాన్న జిల్లా జడ్జి అని చెప్పడానికి మనసు రాక చెప్పలేదు. కానిస్టేబుల్ సైకిల్ తీసుకుని రేప్పొద్దున్న మెజిస్ట్రేట్ కోర్ట్ కి వచ్చి జరిమానా కట్టి సైకిల్ విడిపించుకోమన్నాడు!


ఇంకేం చేసేది. ఏడుపు మొహంతో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళా! మా నాన్నంటే ఆ రోజుల్లో మాకు సింహస్వప్నం. ఆయన నవ్వుతూ పిలిచినా మేము మా జాగ్రత్తలో మేముండేవాళ్ళం. సింహం నవ్వుతోందని వెళ్లి జోకులు  వేస్తామా ఏమిటి?


అందుకని మెల్లిగా మా అమ్మకి చెప్పా సైకిల్ సంగతి. ఎంత పని చేసావురా అని నన్ను తిట్టాక ఇహ తప్పదని వెళ్లి మా నాన్న దగ్గర గొణిగింది. అయన అప్పటికి ఇంకా తీయని సినిమా "జస్టిస్ చౌదరి" టైపు! చట్టానికి న్యాయానికి ముందు కుటుంబం కూడా కనిపించదు! ఆ రోజుల్లో దాదాపు అందరు జడ్జీలు చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు. అలాంటివాళ్లే ఆ సినిమాకి ప్రేరణ!


"రేప్పొద్దున్న మెజిస్ట్రేట్ కోర్ట్ కి వెళ్లి చేతులు కట్టుకుని క్షమాపణ చెప్పి జరిమానా కట్టి రమ్మను! అప్పటికి కానీ బుద్ధిరాదు. ఇహ ముందు ఇలాంటి వెధవ పనులు చెయ్యడు" అని హుకుం జారీ చేసారు! సైకిల్ డబుల్స్ తొక్కడం వెధవ పనా?! హేమిటో?


కానీ మా అమ్మ ఎంతైనా మాతృ హృదయం కదా మర్నాడు పొద్దున్న ఓ బంట్రోతుని కోర్ట్ కి పంపించి సైకిల్ విడిపించింది. 


ఇంకోసారి గుంటూరులోనే  బ్రాడిపేట్ ఓవర్ బ్రిడ్జి కష్టపడి తొక్కి, ఎక్కాను. అటు వేపు దిగడం మొదలెట్టిన వెంటనే ఉంటుంది ఆనందం! అది అనుభవించిన వారికే తెలుస్తుంది! ఒక్కో గజం కిందకి దొర్లుతున్న కొద్దీ సైకిల్ స్పీడ్ ఎక్కువ అవుతూంటుంది. "బ్రిడ్జి దిగడంలో ఉన్న మజా అది అనుభవించితే తెలుయునులే! భలే భలే!" అప్పుడప్పుడూ అలా బ్రిడ్జి  దిగుతున్నప్పుడు హేండిల్ బార్ వదిలేసి రెండు చేతులు పైకెత్తి హీరో లాగ పోజులు కొట్టిన సందర్భాలు లేకపోలేదు! 


ఇంతకీ అప్పుడేమయ్యిందంటే నాకు ముందు ఒక రిక్షా దాని పక్కనే రెండు సైకిళ్ళు  పక్క పక్కనే వెళ్తున్నాయి! అవి కూడా స్పీడుగానే.. నా సైకిల్ స్పీడ్ చూస్తే ఇంకో 5 సెకండ్లలో వాళ్ళని దాటేస్తాను! వాళ్ళని ఓవర్ టేక్ చేద్దామంటే ఎదురుగా ఒక కారు! బ్రేక్ వేసాను. కాని స్పీడ్ తగ్గలేదు. బ్రేక్ సరిగ్గా పని చేసినట్టు లేదు. నాకు టెన్షన్ వచ్చేసింది! ఇహ లాభం లేదని బ్రహ్మాస్త్రం బెల్ కొట్టాను! కాని హాశ్చర్యం. విచిత్రం! అది మోగలేదు! దాని పైన ఉండే స్టీల్ డోమ్ కింద ప్లేట్ కి తగులుతోంది. టిక్కు టిక్కుమని నాకే వినిపించని శబ్దం చేసింది !! అయిపోయింది. నేనెళ్ళి వాళ్ళని గుద్దెయ్యడమే మిగిలింది. 


అంతే బుర్ర పాదరసంలా పని చేసింది!! వెంటనే నేనొక పని చేసాను. అదేమిటంటే వెంటనే గట్టిగా "బెల్! బెల్!" అని అరిచాను. అంతే వెంటనే నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ అదేదో బుల్ అన్నట్టు వినిపించిందేమో ఎటువాళ్ళు అటు పారిపోయి నాకు రహదారి రాచమార్గం చేసారు! వాళ్ళ మధ్యలోంచి పద్మవ్యూహంలోకి అభిమన్యుడు దూసుకెళ్లినట్టు దూరిపోయి వెళ్ళిపోయా స్పీడుగా!


ఈ సైకిల్ తో ఇంకా చాలా మధుర స్మృతులున్నాయి. మరింకెప్పుడైనా చెప్తా. 


సైకిల్ AI  సౌజన్యంతో 


Friday, May 17, 2024

స్వీయ చరిత్ర - చివరి అవకాశం!

 ఈ మధ్య జీవితం ఆఫ్టర్ ఇంటర్వెల్ కి వచ్చింది కాబట్టి ఓ పాలి నా జీవితాన్ని సింహావలోకనం చేసుకున్నా! ఖాళీ సమయం ఎక్కువుంటే ఇలాంటి పిచ్చి పనులే చేస్తాం. 


సింహావలోకనం అంటే అర్ధం (తెలీనివారికి మాత్రమే!): గతాన్ని అందులో తప్పొప్పులను నిలకడగా విశ్లేషించుకోవటం


గమ్మత్తేమిటంటే అలా వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన తప్పుల కంటే నా చుట్టూ ఉన్నవాళ్లు చేసిన తప్పులే ఎక్కువగా కనిపించాయి!


అలా మొత్తం జీవితం టీవీ సీరియల్ లాగా కొన్ని వేల ఎపిసోడ్స్ రూపంలో వాయిదా పద్దతిలో పునః సమీక్షించాక బోల్డు కోపం వచ్చేసింది అలా లోగడ తప్పులు చేసిన వాళ్ళ మీద. నాకు హాని చేసిన వాళ్ళ మీద! 


ఏమిటి సార్ దక్షిణ భారత గాంధీగారి టైపు మీరు! మీక్కూడా హాని చేసే శత్రువులు ఉన్నారా అంటే ఉండరా? గాంధీగారికి గాడ్సే ఉన్నట్టు నాక్కుడా ఉన్నారు కొంతమంది నేనంటే పడని వాళ్ళు! నేనేమన్నా నా మీద విరుచుకు పడిపోయేవాళ్లు. నా మీద పడి ఏడ్చేవాళ్ళు!


హింతకీ ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే గతంలో నన్ను బాధ పెట్టిన వాళ్ళని క్షమించేసాను కానీ ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తూంటే కొంపతీసి అనవసరంగా క్షమించేసానా అనో పెద్ద అనుమానం పట్టుకు పీడిస్తోంది. అనుమానం పెనుభూతం. 


ఒహవేళ అనవసరంగా క్షమిస్తే ఇప్పుడేం చెయ్యాలి అని కొన్నాళ్ళు ఆలోచించా. చించాక ఓ నిర్ణయానికొచ్చా


లోగడ నన్ను రకరకాలుగా విసిగించినవాళ్ళని ఇప్పుడు ఏం చెయ్యలేను ఎందుకంటే కొంతమంది నా జీవితంలోంచి, ఇంకొంతమంది ఈ ప్రపంచంలోంచి నిష్క్రమించారు. 


మరి నా పగ! ప్రతీకారం! కసి! ఎలా తీర్చుకోవాలి. హీరోల చిన్నప్పుడు వాళ్ళకి తీరని అన్యాయం చేసిన వాళ్ళమీద పెద్దయ్యాక పగ, ప్రతీకారం, కసి వాళ్ళని అడ్డంగా నరికేసి తీర్చుకోవడం బోల్డు తెలుగు సినిమాలు చూసి నేర్చేసుకున్ననాయే! సరే సుమోలు ఎగిరించడం, కత్తులు, కఠారులతో చీల్చి చెండాడడం ఆహింశావాదినైన నాకు తగని పని! 


మరి ఎలా? ఎలా? ఎలా?


హప్పుడు తట్టింది ఓ బ్రహ్మాండమైన ఐడియా! ఒక ఐడియా మీ(నా) జీవితాన్నే మార్చేస్తుంది!


అదేమిటంటే ఇప్పుడు నేను అర్జెంటుగా నా జీవిత చరిత్ర నేనే రాయదల్చుకున్నా! అందులో లోగడ నన్ను బాధ పెట్టినవాళ్లందరినీ పేరుపేరునా వాళ్ళు చేసిన దాన్ని చిలవలు, పలవలు చేసి మరీ రాసి పారేస్తా! ఎలా ఉంది ఐడియా!


కాకపొతే ప్రభుత్వంవారు చాలాసార్లు చాలామందికి "చివరి అవకాశం" అని ఓ సదుపాయం కలిగిస్తారు. ఉదాహరణకి ఇల్లు మునిసిపల్ కార్పొరేషన్ నిబంధలని అతిక్రమించి కట్టేసుకున్న వాళ్ళు, భూమిని ఆక్రమించేసిన వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు చలాన్లు సంవత్సరాల తరబడి కట్టనివాళ్ళు వగైరా వగైరా వాళ్లందరికీ కూసింత సొమ్ములు ప్రభుత్వానికి కడితే మీ తప్పులు అన్నీ మాఫ్ అని ఓ చివరి అవకాశం ఇస్తారు. దాని చివరి తేదీని అలా బోల్డు సార్లు పొడిగిస్తారు కూడా! ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సొమ్ములు! తప్పు చేసిన వారిని శిక్షించడం కాదుగా!


మరి అలాంటివాళ్లకే పాపం ప్రభుత్వం "ఒక్క ఛాన్స్" ఇస్తున్నప్పుడు నేను కూడా ఒకింత దయ, దాక్షిణ్యాలతో నా వెనకటి జీవితంలో నాకు హాని చేసిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళకి కూడా ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందని అనిపించింది 


ఆ అవకాశం ఏమిటంటే సరే పోయిన వాళ్ళని వదిలేస్తా క్షమించి. బ్రతికున్న వాళ్లంతా ఇప్పటి నించి నేను స్వీయ చరిత్ర రాసి, ముద్రించే దాకా నన్ను బాగా చూసుకుంటే వాళ్ళ మీద రాసిన పేజీలు చింపేస్తా!


లేదంటారా? వాళ్లందరి మీద ఎడాపెడా, చెడామడా, అవాకులు, చెవాకులు రాసి పారేస్తా! తస్మాత్ జాగ్రత్త! 


ఆపైన వాళ్ళిష్టం. ఆనక బాధ పడి ప్రయోజనం లేదు. 


ఎందుకంటే పుస్తకం అయితే చింపేస్తే చెరిగిపోతుంది ముద్రించిన అన్ని పుస్తకాలు మనమే కొనేసి తగలెట్టేద్దాం అని కుళ్ళు ఐడియా వేస్తే పప్పులో కాలేసినట్టే. 


నేనో రెండాకులు ఎక్కువ చదివా. అందుకే ఈ-బుక్ ముద్రిస్తా! ఇంటర్నెట్లో అమ్మేస్తా! ఒక్కడు ఒక్క పుస్తకం కొన్నా చాలు. వాళ్ళు ఆ పుస్తకాన్ని విశృంఖలంగా వాట్సాప్ లో షేర్ చేసేస్తారుగా? ఇహ ప్రపంచంలో అది శాశ్వతంగా నిలిచిపోతుంది!


కాబట్టి మీరు కూడా మీ జీవితాన్ని ఓసారి లైట్ గా సింహావలోకనం చేసుకోండి. అందులో నన్నేమైనా బాధ పెట్టినా, నాకు హాని చేసినా ఈ సదవకాశాన్ని  సద్వినియోగం చేసుకోండి! ఆలసించిన ఆశాభంగం! 


నన్ను మంచిగా చూసుకోవడం అంటే ఆపిల్ పళ్ళట్టుకుని వచ్చి పలకరించడం కాదండోయ్! మరేం చెయ్యాలి అంటే అది ప్రస్తుతం నాకే తెలీదు! మీకేం ఉప్పందించను? భవిష్యత్తులో ఏమన్నా ఐడియాలు తడితే ఈ బ్లాగ్ తరువాయి భాగం ప్రచురించబడును!


అంతవరకు సెలవు!  

Tuesday, November 7, 2023

Deepavali Deep Cleaning! దీపావళి డీప్ క్లీనింగ్!!

దీపావళి డీప్ క్లీనింగ్!

చాలామంది "ఎందుకైనా పనికొస్తుంది" అని కొన్నిటినీ, సెంటిమెంటల్ వేల్యూ తో కొన్నిటిని, పారేయడానికి మనసొప్పక ఇంకొన్నిటినీ, ఎప్పటికైనా రిపేర్ చేయిద్దామని మరి కొన్నిటిని ఇలా ఇల్లంతా ఎటు చూసినా మనం వాడని, వాడలేని, పనికిరాని, పని చెయ్యని, పనికిమాలిన  వస్తువులతో నింపేస్తారు!

 

ముఖ్యంగా సొంత ఇల్లుంటే మరీనూ! అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళు, ట్రాన్స్ఫర్లు ఉండే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇల్లు ఖాళీ చేసినప్పుడల్లా అలాంటి చెత్తని వీలయ్యినంత వదిలించుకుంటూ ఉంటారు.

 

ఇలా ఇల్లంతా "చెత్త" ఉంటే అనారోగ్యం. చూడ్డానికి బాగోదని తీరి కూర్చొని ఇల్లు శుభ్రంగా ఉంచమంటే రేపు చేద్దాం, ఎల్లుండి చూద్దాం అని వాయిదాలేస్తూ వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు గడిపేస్తారని. డబ్బుతో లంకె పెడితేనైనా కనీసం సంవత్సరానికోసారైనా అలాంటి చెత్తని పారేస్తారని "దీపావళి నాడు ఇల్లు శుభ్రంగా ఉంటే కానీ లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టదు" అని ఒక సంప్రదాయం మొదలెట్టారు.

 

కాబట్టి దీపావళి ఇంకొన్ని రోజులే ఉంది కనుక  కాస్త ఓపిక చేసుకుని, కొంచం బద్దకం వదిలించుకుని ఇంట్లో ఉన్న చెత్తా చెదారం పారేయండి! వదిలించుకోండి! (చెదారం అంటే ఏమిటో ఖచ్చితంగా నాకు తెలీదు!)

 

వాడని, వాడలేని, పనికిరాని, పని చెయ్యని, పనికిమాలిన  వస్తువులని ఇలా విభజించచ్చు

 

1. ఖచ్చితంగా పారేయాల్సినవి - అంటే అయిదేళ్లక్రితం కొన్న టీవీ అట్టపెట్టె, రెండేళ్ల క్రితం కొన్న మొబైల్ డొక్కు , పదేళ్ల క్రితం కొన్న మొబైల్ సన్న పిన్ చార్జర్, గత దశాబ్దంలో మొబైల్తో పాటు వచ్చిన ఇయర్ ఫోన్లు వగైరా

 

2. రిపేర్ చేయించి వాడుకునేవి - కానీ నాకో సందేహం. అవి నిజంగా నిత్యం కాకపోయినా నెలకోసారైనా వాడే వస్తువైతే పాటికి రిపేర్ చేయించి ఉంటారు. అలా చేయించకపోతే దాని అవసరం లేదన్నమాట. అలాంటప్పుడు అదే స్థితిలోనో, లేక రిపేర్ చేయించొ OLX లో ఎంతొస్తే అంతకి అమ్మేయండి!

 

3. పని చేస్తాయి కానీ గత రెండేళ్లుగా వాడని వస్తువులు - అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మీ అబ్బాయికి మీరు హై స్కూల్లో కొన్న సైకిల్ ( మెట్ల కింద తుప్పు పట్టిపోతూ ఉంటుంది! చూడండి!), మీకిప్పుడు నచ్చని, మీరు వాడని రిస్ట్ వాచీలు, స్మార్ట్ ఫోన్ ముందు కొన్న మామూలు మొబైల్, గుప్తుల కాలంనాటి మిక్సర్ ఇలాంటివి. వీటిని ఒకటే ఎవరికన్నా ఉచితంగా దానం చేసేయండి. (ఉచితంగా కాకుండా డబ్బులు తీసుకొని కూడా దానం చేస్తారా అని అడక్కండి ఎందుకంటే నేను "ఉచిత దానం" అన్న పద ప్రయోగం చాలాసార్లు చదివాను!) కనీసం వాళ్ళ ఆశీస్సులు, ఒకింత పుణ్యం దక్కుతుంది. లేదూ OLX ఉందిగా?

 

4. సెంటిమెంటల్ వేల్యూ ఉన్నవి - ఇవి వేరే ఇంకెవ్వరికీ ఎందుకూ పనికిరావు. లోపాయికారీ మనకీ పనికిరావు! మనం కూడా ఎప్పుడో కానీ వాటిని చూడం కూడా! - ఉదాహరణకి కాలేజీ రోజుల్లో మీరు రాసి ఇవ్వని ప్రేమలేఖ!, మీ ప్రేయసి జడలోంచి పడి వాడిపోయి ముట్టుకుంటే పొడిపొడి అయిపోయే పువ్వు, మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్, డిగ్రీలో చేతులూపుకుంటూ ఒక స్పైరల్ బౌండ్ పుస్తకాన్ని ఒక చేత్తో పట్టుకుని ఊపుకుంటూ  కాలేజీకి తీసుకెళ్లిన ఆ రఫ్ నోట్ బుక్! వగైరా! వీటిని కావాలంటే స్కాన్ చేసి ఒరిజినల్ పారెయ్యచేమో ఆలోచించండి. మీ ఇష్టం. అలా దాచుకున్నా అభ్యంతరం లేదు! కానీ నా అనుభవంలో ఇలాంటివి ఒక సంవత్సరం పారేయకపోయినా దీపావళి క్లీనింగ్ ప్రతి సంవత్సరం చేస్తూంటే అంతకు ముందు సంవత్సరం పారేయనివి రెండో సంవత్సరం లేదా మూడో సంవత్సరంలోనే పారేస్తాను నేనైతే. అంటే వాటిమీద మనసు విరిగిపోతుందన్నమాట. ఎందుకీ మమకారాలు, సెంటిమెంట్లు అని అనిపించినప్పుడు.

 

మీ ఇంటిని కనీసం ప్రతి దీపావళికి ఇలా డీప్ క్లీనింగ్ చేస్తే అలా శుభ్రం అయిపోయాక దీపావళి నాడు ఇంటి ముఖద్వారం బార్లా తెరిచి (లక్ష్మీదేవి రావాలిగా లోపలికి!) హాల్లో సోఫాలో కాలు మీద కాలేసుకుని ఆమె రాకకోసం ఎదురు చూడ్డమే!

 

ఇలా డీప్ క్లీనింగ్ కార్యక్రమం మీరు చేపట్టాక ప్రతి ఇంట్లోనూ జరిగే రామాయణం ఎలా ఉంటుందంటే?!

ముందస్తు మాట! ఇలా క్లీనింగ్ చేసినప్పుడు మనం "ఇది పోయిందనుకున్నానే! హమ్మయ్య పోన్లే ఇప్పుడు దొరికింది" , "అరే! ఇది పారేయకుండా ఇన్నాళ్ళుంచామా" అని హాశ్చర్యపడిపోయే వస్తువులు కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి

ఇహ పొతే ఇలా సంవత్సరానికోసారి ఇల్లు పీకి పందిరేసే కార్యక్రమంలో సాధారణంగా వినిపించే డైలాగ్స్ విధంగా ఉంటాయి ఎవరింట్లోనైనా! జస్ట్ నేమ్స్ చేంజ్ అంతే

- పద్దూ నీకిదే చెప్తున్నా! దేనినైనా పారెయ్యి కానీ నా చెక్క బీరువా జోలికి మాత్రం రావద్దు

- డాడీ! నువ్వు నీ చిన్నప్పుడు చదివావో లోదో తెలీదు కానీ రెండు కేజీలున్న పెద్ద బాలశిక్ష పుస్తకం నువ్వు కనీసం ముట్టుకోవడం నేనెప్పుడూ చూడలేదు గత ఇరవై ఏళ్లుగా! అది పారెయ్యకూడదు  కానీ నా చిన్నప్పటి కామిక్ పుస్తకాలు మట్టుకు పారెయ్యాలి!

- చూడూ! నీ కామిక్ పుస్తకాలు నెట్టులో దొరుకుతాయి. చదివే ఓపిక లేకపోతె యూట్యూబ్ లో బోల్డు విడియోలున్నాయి.

- మీ అందరికీ ఒకేసారి చెప్తున్నా! గదిలోనైనా మీ ఇష్టం కానీ నా వంటింట్లోకి మట్టుకు అడుగెట్టద్దు.

- డాడీ! ఇంకా ఎన్ని సంవత్సరాలు దాస్తావు 32 ఇంచిల ప్యాంట్లు! నువ్వు సైజు నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు దాటేసావు. ఇప్పుడు నాకు  పెళ్లీడు వచ్చింది. కానీ నువ్వు ప్యాంట్లు మట్టుకు పారేయనివ్వవు.

- చూడు బాబూ ఆ సిక్స్ ప్యాక్ నించి ఫామిలీ ప్యాక్ కి రావదానికి నాకు పదేళ్లు పట్టింది. మరి అలాంటప్పుడు మళ్ళీ సైజు కి వెళ్లాలంటే కూడా అన్నేళ్లే పడుతుంది. ఊరికే తొందర పడితే లాభం లేదు. సైజు కి వెళ్ళాక ఇప్పుడున్న ప్యాంట్లు అన్నీ వేస్ట్ అయిపోతాయి. నువ్విప్పుడు 32 సైజు ప్యాంట్లు పారేస్తే అప్పుడు మళ్ళీ బోల్డు డబ్బు పోసి కొనాలి. నా వాళ్ళ కాదు.

- మమ్మీ! ఇదేంటిది? భలే ఉంది. ఇంత బరువేమిటి?

- అదా తల్లీ. దాన్ని మరచెంబంటారు

- మరచెంబా? అంటే

- అంటే ఇప్పట్లా మా చిన్నప్పుడు సీసాలు, ప్లాస్టిక్ సీసాలు లేవు. ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు బైట ఇప్పట్లా మినరల్ వాటర్ అమ్మడం కూడా లేదు. అందుకని మరచెంబులో నీళ్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళం

- ఓహో! కానీ ఇదేంటి మమ్మీ! ఇది ఖాళీ చెంబే రెండు కేజీల బరువుంది. సైజు చూస్తే లీటర్ నీళ్లు కూడా పట్టేట్టు లేవు

- అదంతేనమ్మా. అప్పట్లో అవే ఉండేవి మరి. మీలా మేధావి బుర్రలు కావు మావి. కొత్తవి కనిపెట్టడానికి. అందుకని నోరు మూసుకుని పెద్దవాళ్ళు ఏం చెప్తే అది వినేవాళ్ళం. మీలా  ప్రతిదానికి ఇదెందుకు ఇలా? అది అలానే ఎందుకుండాలి అని ప్రశ్నలు వేస్తె వీపు విమానం మోత మోగేది.

- ఇదేమిటీ అని పొరపాటున అడిగితే నువ్వెక్కడికో వెళ్ళిపోయి భూమి  గుండ్రంగా ఉందని మా కుర్రోళ్ళ మీదకే తెస్తావు. మీ పెద్దోళ్లున్నారే

- నేను కాస్త ఆఫీస్ పని చేసుకోవాలి. నేను లేను కదాని మీ ఇష్టం వచ్చినట్టు కనిపించినవన్నీ పారెయ్యకండి. మీరంతా విడివిడిగానూ, జమిలీగానూ పారేద్దామనుకున్నవన్నీ చోట పెడితే నేను ఆడిటింగ్ చేసి పర్మిషన్ ఇస్తా. తర్వాతే పారేయడం

- ఇహ అయినట్టేనా తల్లీ! మీ నాన్నఅప్రూవ్ చేయాలంటే నా వంటింటి గిన్నెలు నీ కామిక్స్ మాత్రమే పారేయమంటారు. నావల్ల కాదు కానీ నే వెళ్లి వంట ఏర్పాట్లు చూస్తా. మీతో పాటు సర్దుతూ కూర్చుంటే వంటెవరు చేస్తారు. భోజనానికి  ఒక్క అయిదు నిమిషాలు ఆగరు ఒక్కళ్ళు కూడా

- డాడీ ఆఫీస్ పని చేసుకుంటూ నువ్వు వంట చేసుకుంటే నేనొక్కర్తినేనా సర్దడం. నాకేం పట్టింది! నేనూ టీవీ చూసుకుంటా

ఎవ్వరూ చేయకపోతే నేనెందుకు చెయ్యాలి! నేను ఫ్రెండ్ని కలిసొస్తా - పుత్రరత్నం

అయ్యా అదీ సంగతి. మళ్ళీ వచ్చే దీపావళికి దీప్ క్లీనింగ్ కార్యక్రమం వాయిదా వేయడమైనది

ఇదీ ప్రతి దీపావళికి ఇంటింటి రామాయణం!

గమనిక: కొన్ని సంవత్సరాల క్రితం రాసిన దాన్నే కొంచం మార్చి పునః పోస్టు చేస్తున్నా