పాత రచన పునర్ముద్రణ! కొన్ని సవరణలు, వివరణలతో
1970's!! అంటే మూగమనసులు సినిమా మొదటి సీన్లో ముసలతను చెప్పినట్టు "అబ్బో అదెప్పటి మాటా?" ఓ 50 ఏళ్ళ కిందటి సంగతులు!
ఆ రోజుల్లో కుర్రకారు కి పేరులోనే కారు.. ఇప్పటి యువత లాగా ఇంటర్ లో బైక్, డిగ్రీ లో కారు లేదు మాకు 🙁
ఆ రోజుల్లో సైకిల్ ఉంటే కాస్త ఉన్న వాళ్ళకింద లెక్క! హంబర్ సైకిల్ ఉంటే కాలర్ ఎగరెయ్యడమే!
ఇంతకీ అప్పట్లో నాకు హంబర్ సైకిల్ ఉండేది. ఇహ చూడండి. నా వైభోగం. ఊరంతా రయ్యిరయ్యిమని తిరిగెయ్యడమే!
ఒహటి రెండు సార్లు మా నాన్నకి కొంతమంది (నా లాగ స్పీడుగా సైకిల్ తోక్కలేని వృద్ధులు!) కంప్లైంట్ చేసేవాళ్ళు! "మీ అబ్బాయి ఈ మధ్య సైకిల్ మరీ స్పీడుగా తొక్కుతున్నాడు" అని! మా నాన్న దాన్ని చాలా లైట్ తీసుకోని "మీ పిచ్చి కాని, కుర్రాళ్ళు కాకపోతే మనం తొక్కుతాముటండీ స్పీడుగా" అని సుతారంగా వాళ్ళ కంప్లైంట్ ని బుట్ట దాఖలు చేసేవాళ్ళు! ఆ మాట నా చెవిని పడగానే నేను మరీ రెచ్చిపోయి శాయశక్తులా వీర స్పీడుగా సైకిల్ తొక్కడం మొదలెట్టా!
నాకు సైకిల్ ఎలా వచ్చిందంటే నేను తొమ్మిదో క్లాస్ చదువుతున్నప్పుడు సైకిల్ కొన్నారు మా నాన్న! నిజానికి అయన కోసమే కొనుక్కున్నారు కానీ కొన్న రెండు నెలలకే ఆయనకి సబ్ జడ్జి నుంచి డిస్ట్రిక్ట్ జడ్జిగా ప్రమోషన్ తో పాటు గుంటూరు ట్రాన్స్ఫర్ అవ్వడంతో కుటుంబాన్ని అమలాపురంలోని వదిలేసి తను ఒక్కరు వెళ్లిపోయారు.ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో మేము నలుగురు పిల్లలం ఊరు మారడం కష్టం కాబట్టి. సైకిల్ వదిలేసి వెళ్లారు! అలా వారసత్వం టైపులో నాకు దక్కింది ఆ సైకిల్. అప్పుడు చూడాలి నా మొహం! పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగిపోయింది! అది కొన్నప్పుడు షాపుకి నేను వెళ్ళాను. నిజానికి సైకిల్ పార్ట్శ్ అన్నీ మనం కొన్నప్పుడు షాప్ వాడు బిగించి సైకిల్ చేస్తాడని అప్పుడే తెలిసింది! వాడు అలా నా(!) సైకిల్ మొత్తం తయారు చేస్తున్నప్పుడు నేనలా తన్మయత్వంతో చూస్తూ తెగ ఆనంద పడిపోయాను!
దానికొక చుక్కల చుక్కల బ్లూ కలర్ సీట్ కవర్ వేయించాను. దాంట్లో కొంచం స్పాంజ్ ఉండి కూర్చున్నప్పుడు కాస్త హాయిగా ఉండేది. ట్రింగ్ ట్రింగ్ మనే కొత్త బెల్ 🙂 దాని శబ్దం వినడానికి చాలా బాగుండేది. అందుకని ఎవరూ అడ్డు లేకపోయినా అప్పుడప్పుడూ ఆ బెల్ గణగణమనిపించేవాడిని! అల్ప సంతోషిని కదా!!
సైకిల్ నా పరం అయ్యిన దగ్గరినించీ అన్ని బైటి పనులు అంటే కూరలు తేవడం, రోజూ పొద్దున్నే పాలవాడి దగ్గరకి వెళ్లి పాలు కాన్ లో తేవడం, పచారీ సామాన్లు తేవడం, అక్కలిద్దరినీ బజారుకి తీసుకెళ్లడం (ఇద్దరినీ ఒక్కసారి కాదండోయ్! విడివిడిగా!!), అప్పుడప్పుడూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి కూడా, ఇలా ఒహటేమిటి నానా గోత్రస్య అన్ని పనులకి నేను, నా సైకిల్ ఎవరెడీ 😉
తదుపరి మేమంతా కూడా గుంటూరు వచ్చేసాం. కానీ మా నాన్న జిల్లా జడ్జిగా సైకిల్ తొక్కడం బాగోదని పదివేలు పెట్టి సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు కొనుక్కున్నారు. కానీ అప్పుడప్పుడూ వెరైటీగా ఆఫీస్ కి సైకిల్ తొక్కుకుని వెళ్ళేవారు! ఆయన సైకిల్ తొక్కుతూంటే ముందర కారు డ్రైవర్ తనో సైకిల్ మీద, వెనకాల డవాళ బంట్రోతు ఇంకో సైకిల్ మీద!
ఆ మధ్య పేపర్ లో చదివాను! కొన్ని వేల మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మోటార్ సైకిళ్ళు నడిపుతూ దొరికి పోయారుట హైదరాబాద్ లో!
ఆ రోజుల్లో మా లాంటి కుర్రాళ్ళని కూడా పోలీసులు భారీ ఎత్తుని పట్టుకొనే వాళ్ళు. రాత్రి పూట సైకిల్ కి లైట్ లేకుండా తొక్కినా, లేదా డబుల్స్, ట్రిపుల్స్ తొక్కినా! ఆ రోజుల్లో ఆ రెండూ చాల పెద్ద నేరాలు!!
లైట్ కోసం డైనమో పెడితే టైర్ అరిగి పోతుందని హేండిల్ బార్ ముందు హుక్కుకి బాటరీ లైట్ పెట్టెవాడిని! దాన్ని సాయంత్రం బైటికి వెళ్ళినప్పుడల్లా హేండిల్ బార్ కి తగిలించడం. ఇంటికొచ్చాక తీసి లోపల పెట్టడం! ఇప్పుడు హెల్మెట్ లాగ 🙂
అప్పుడప్పుడూ ఆ పోలిసుల బారిని పడడం, మర్నాడు మాజిస్త్రేట్ కోర్ట్ లో దోషుల్లా నిలపడి జరిమానా కట్టడం. ఇంట్లో వాళ్లకి తెలియకుండా!
ఓసారి నా ఫ్రెండ్స్ ఇద్దరినీ ఎక్కించుకుని ట్రిపుల్ రైడింగ్ చేస్తూ శంకరవిలాస్ సెంటర్ కి వెళ్లాను. సెంటర్ ఇంకొంచం దూరం ఉందనగా అక్కడ పోలీసులు ఉంటారని దిగండిరా అని ఫ్రెండ్స్ తో అంటే "మీ నాన్న జిల్లా జడ్జి! నిన్నెవడురా పట్టుకునేది? మేము దిగం" అని భీష్మించుకుని కూర్చున్నారు! ఇహ చేసేదేం లేక సెంటర్ దాకా వెళ్లడం ఏమిటి ఓ పోలీసు కానిస్టేబుల్ గయ్యిమని విజిల్ వేసుకుంటూ మమ్మల్ని ఆపాడు.
వెంటనే నా ఫ్రెండ్స్ ఇద్దరూ జంప్! నేను మా నాన్న జిల్లా జడ్జి అని చెప్పడానికి మనసు రాక చెప్పలేదు. కానిస్టేబుల్ సైకిల్ తీసుకుని రేప్పొద్దున్న మెజిస్ట్రేట్ కోర్ట్ కి వచ్చి జరిమానా కట్టి సైకిల్ విడిపించుకోమన్నాడు!
ఇంకేం చేసేది. ఏడుపు మొహంతో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళా! మా నాన్నంటే ఆ రోజుల్లో మాకు సింహస్వప్నం. ఆయన నవ్వుతూ పిలిచినా మేము మా జాగ్రత్తలో మేముండేవాళ్ళం. సింహం నవ్వుతోందని వెళ్లి జోకులు వేస్తామా ఏమిటి?
అందుకని మెల్లిగా మా అమ్మకి చెప్పా సైకిల్ సంగతి. ఎంత పని చేసావురా అని నన్ను తిట్టాక ఇహ తప్పదని వెళ్లి మా నాన్న దగ్గర గొణిగింది. అయన అప్పటికి ఇంకా తీయని సినిమా "జస్టిస్ చౌదరి" టైపు! చట్టానికి న్యాయానికి ముందు కుటుంబం కూడా కనిపించదు! ఆ రోజుల్లో దాదాపు అందరు జడ్జీలు చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు. అలాంటివాళ్లే ఆ సినిమాకి ప్రేరణ!
"రేప్పొద్దున్న మెజిస్ట్రేట్ కోర్ట్ కి వెళ్లి చేతులు కట్టుకుని క్షమాపణ చెప్పి జరిమానా కట్టి రమ్మను! అప్పటికి కానీ బుద్ధిరాదు. ఇహ ముందు ఇలాంటి వెధవ పనులు చెయ్యడు" అని హుకుం జారీ చేసారు! సైకిల్ డబుల్స్ తొక్కడం వెధవ పనా?! హేమిటో?
కానీ మా అమ్మ ఎంతైనా మాతృ హృదయం కదా మర్నాడు పొద్దున్న ఓ బంట్రోతుని కోర్ట్ కి పంపించి సైకిల్ విడిపించింది.
ఇంకోసారి గుంటూరులోనే బ్రాడిపేట్ ఓవర్ బ్రిడ్జి కష్టపడి తొక్కి, ఎక్కాను. అటు వేపు దిగడం మొదలెట్టిన వెంటనే ఉంటుంది ఆనందం! అది అనుభవించిన వారికే తెలుస్తుంది! ఒక్కో గజం కిందకి దొర్లుతున్న కొద్దీ సైకిల్ స్పీడ్ ఎక్కువ అవుతూంటుంది. "బ్రిడ్జి దిగడంలో ఉన్న మజా అది అనుభవించితే తెలుయునులే! భలే భలే!" అప్పుడప్పుడూ అలా బ్రిడ్జి దిగుతున్నప్పుడు హేండిల్ బార్ వదిలేసి రెండు చేతులు పైకెత్తి హీరో లాగ పోజులు కొట్టిన సందర్భాలు లేకపోలేదు!
ఇంతకీ అప్పుడేమయ్యిందంటే నాకు ముందు ఒక రిక్షా దాని పక్కనే రెండు సైకిళ్ళు పక్క పక్కనే వెళ్తున్నాయి! అవి కూడా స్పీడుగానే.. నా సైకిల్ స్పీడ్ చూస్తే ఇంకో 5 సెకండ్లలో వాళ్ళని దాటేస్తాను! వాళ్ళని ఓవర్ టేక్ చేద్దామంటే ఎదురుగా ఒక కారు! బ్రేక్ వేసాను. కాని స్పీడ్ తగ్గలేదు. బ్రేక్ సరిగ్గా పని చేసినట్టు లేదు. నాకు టెన్షన్ వచ్చేసింది! ఇహ లాభం లేదని బ్రహ్మాస్త్రం బెల్ కొట్టాను! కాని హాశ్చర్యం. విచిత్రం! అది మోగలేదు! దాని పైన ఉండే స్టీల్ డోమ్ కింద ప్లేట్ కి తగులుతోంది. టిక్కు టిక్కుమని నాకే వినిపించని శబ్దం చేసింది !! అయిపోయింది. నేనెళ్ళి వాళ్ళని గుద్దెయ్యడమే మిగిలింది.
అంతే బుర్ర పాదరసంలా పని చేసింది!! వెంటనే నేనొక పని చేసాను. అదేమిటంటే వెంటనే గట్టిగా "బెల్! బెల్!" అని అరిచాను. అంతే వెంటనే నా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ అదేదో బుల్ అన్నట్టు వినిపించిందేమో ఎటువాళ్ళు అటు పారిపోయి నాకు రహదారి రాచమార్గం చేసారు! వాళ్ళ మధ్యలోంచి పద్మవ్యూహంలోకి అభిమన్యుడు దూసుకెళ్లినట్టు దూరిపోయి వెళ్ళిపోయా స్పీడుగా!
ఈ సైకిల్ తో ఇంకా చాలా మధుర స్మృతులున్నాయి. మరింకెప్పుడైనా చెప్తా.
సైకిల్ AI సౌజన్యంతో