Friday, May 17, 2024

స్వీయ చరిత్ర - చివరి అవకాశం!

 ఈ మధ్య జీవితం ఆఫ్టర్ ఇంటర్వెల్ కి వచ్చింది కాబట్టి ఓ పాలి నా జీవితాన్ని సింహావలోకనం చేసుకున్నా! ఖాళీ సమయం ఎక్కువుంటే ఇలాంటి పిచ్చి పనులే చేస్తాం. 


సింహావలోకనం అంటే అర్ధం (తెలీనివారికి మాత్రమే!): గతాన్ని అందులో తప్పొప్పులను నిలకడగా విశ్లేషించుకోవటం


గమ్మత్తేమిటంటే అలా వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన తప్పుల కంటే నా చుట్టూ ఉన్నవాళ్లు చేసిన తప్పులే ఎక్కువగా కనిపించాయి!


అలా మొత్తం జీవితం టీవీ సీరియల్ లాగా కొన్ని వేల ఎపిసోడ్స్ రూపంలో వాయిదా పద్దతిలో పునః సమీక్షించాక బోల్డు కోపం వచ్చేసింది అలా లోగడ తప్పులు చేసిన వాళ్ళ మీద. నాకు హాని చేసిన వాళ్ళ మీద! 


ఏమిటి సార్ దక్షిణ భారత గాంధీగారి టైపు మీరు! మీక్కూడా హాని చేసే శత్రువులు ఉన్నారా అంటే ఉండరా? గాంధీగారికి గాడ్సే ఉన్నట్టు నాక్కుడా ఉన్నారు కొంతమంది నేనంటే పడని వాళ్ళు! నేనేమన్నా నా మీద విరుచుకు పడిపోయేవాళ్లు. నా మీద పడి ఏడ్చేవాళ్ళు!


హింతకీ ఏతా వాతా చెప్పొచ్చేదేమిటంటే గతంలో నన్ను బాధ పెట్టిన వాళ్ళని క్షమించేసాను కానీ ఇప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తూంటే కొంపతీసి అనవసరంగా క్షమించేసానా అనో పెద్ద అనుమానం పట్టుకు పీడిస్తోంది. అనుమానం పెనుభూతం. 


ఒహవేళ అనవసరంగా క్షమిస్తే ఇప్పుడేం చెయ్యాలి అని కొన్నాళ్ళు ఆలోచించా. చించాక ఓ నిర్ణయానికొచ్చా


లోగడ నన్ను రకరకాలుగా విసిగించినవాళ్ళని ఇప్పుడు ఏం చెయ్యలేను ఎందుకంటే కొంతమంది నా జీవితంలోంచి, ఇంకొంతమంది ఈ ప్రపంచంలోంచి నిష్క్రమించారు. 


మరి నా పగ! ప్రతీకారం! కసి! ఎలా తీర్చుకోవాలి. హీరోల చిన్నప్పుడు వాళ్ళకి తీరని అన్యాయం చేసిన వాళ్ళమీద పెద్దయ్యాక పగ, ప్రతీకారం, కసి వాళ్ళని అడ్డంగా నరికేసి తీర్చుకోవడం బోల్డు తెలుగు సినిమాలు చూసి నేర్చేసుకున్ననాయే! సరే సుమోలు ఎగిరించడం, కత్తులు, కఠారులతో చీల్చి చెండాడడం ఆహింశావాదినైన నాకు తగని పని! 


మరి ఎలా? ఎలా? ఎలా?


హప్పుడు తట్టింది ఓ బ్రహ్మాండమైన ఐడియా! ఒక ఐడియా మీ(నా) జీవితాన్నే మార్చేస్తుంది!


అదేమిటంటే ఇప్పుడు నేను అర్జెంటుగా నా జీవిత చరిత్ర నేనే రాయదల్చుకున్నా! అందులో లోగడ నన్ను బాధ పెట్టినవాళ్లందరినీ పేరుపేరునా వాళ్ళు చేసిన దాన్ని చిలవలు, పలవలు చేసి మరీ రాసి పారేస్తా! ఎలా ఉంది ఐడియా!


కాకపొతే ప్రభుత్వంవారు చాలాసార్లు చాలామందికి "చివరి అవకాశం" అని ఓ సదుపాయం కలిగిస్తారు. ఉదాహరణకి ఇల్లు మునిసిపల్ కార్పొరేషన్ నిబంధలని అతిక్రమించి కట్టేసుకున్న వాళ్ళు, భూమిని ఆక్రమించేసిన వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు చలాన్లు సంవత్సరాల తరబడి కట్టనివాళ్ళు వగైరా వగైరా వాళ్లందరికీ కూసింత సొమ్ములు ప్రభుత్వానికి కడితే మీ తప్పులు అన్నీ మాఫ్ అని ఓ చివరి అవకాశం ఇస్తారు. దాని చివరి తేదీని అలా బోల్డు సార్లు పొడిగిస్తారు కూడా! ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది సొమ్ములు! తప్పు చేసిన వారిని శిక్షించడం కాదుగా!


మరి అలాంటివాళ్లకే పాపం ప్రభుత్వం "ఒక్క ఛాన్స్" ఇస్తున్నప్పుడు నేను కూడా ఒకింత దయ, దాక్షిణ్యాలతో నా వెనకటి జీవితంలో నాకు హాని చేసిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళకి కూడా ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందని అనిపించింది 


ఆ అవకాశం ఏమిటంటే సరే పోయిన వాళ్ళని వదిలేస్తా క్షమించి. బ్రతికున్న వాళ్లంతా ఇప్పటి నించి నేను స్వీయ చరిత్ర రాసి, ముద్రించే దాకా నన్ను బాగా చూసుకుంటే వాళ్ళ మీద రాసిన పేజీలు చింపేస్తా!


లేదంటారా? వాళ్లందరి మీద ఎడాపెడా, చెడామడా, అవాకులు, చెవాకులు రాసి పారేస్తా! తస్మాత్ జాగ్రత్త! 


ఆపైన వాళ్ళిష్టం. ఆనక బాధ పడి ప్రయోజనం లేదు. 


ఎందుకంటే పుస్తకం అయితే చింపేస్తే చెరిగిపోతుంది ముద్రించిన అన్ని పుస్తకాలు మనమే కొనేసి తగలెట్టేద్దాం అని కుళ్ళు ఐడియా వేస్తే పప్పులో కాలేసినట్టే. 


నేనో రెండాకులు ఎక్కువ చదివా. అందుకే ఈ-బుక్ ముద్రిస్తా! ఇంటర్నెట్లో అమ్మేస్తా! ఒక్కడు ఒక్క పుస్తకం కొన్నా చాలు. వాళ్ళు ఆ పుస్తకాన్ని విశృంఖలంగా వాట్సాప్ లో షేర్ చేసేస్తారుగా? ఇహ ప్రపంచంలో అది శాశ్వతంగా నిలిచిపోతుంది!


కాబట్టి మీరు కూడా మీ జీవితాన్ని ఓసారి లైట్ గా సింహావలోకనం చేసుకోండి. అందులో నన్నేమైనా బాధ పెట్టినా, నాకు హాని చేసినా ఈ సదవకాశాన్ని  సద్వినియోగం చేసుకోండి! ఆలసించిన ఆశాభంగం! 


నన్ను మంచిగా చూసుకోవడం అంటే ఆపిల్ పళ్ళట్టుకుని వచ్చి పలకరించడం కాదండోయ్! మరేం చెయ్యాలి అంటే అది ప్రస్తుతం నాకే తెలీదు! మీకేం ఉప్పందించను? భవిష్యత్తులో ఏమన్నా ఐడియాలు తడితే ఈ బ్లాగ్ తరువాయి భాగం ప్రచురించబడును!


అంతవరకు సెలవు!