దెబ్బతిన్న మనోభావాలు!
ఎవరి మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటే ఎవరివో అయితే నాకెందుకు? నావే
అదేంటో ఈ మజ్జెన రెండు మూడ్రోజులకోసారి దెబ్బ తినేస్తున్నాయి.
క్షమించాలి. దెబ్బ తీస్తున్నారు !
వివరించాలా? వరిస్తా!
నా పోస్టులు కొన్నైనా చూసినవారికి ఒక విషయం అర్ధం అవ్వాలి. అదేమిటంటే నేను 99% అన్నీ కేవలం హాస్యానికే రాస్తాను. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఎప్పుడూ ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది. అందుకని నేను కనీసం రోజుకి ఒక్కసారైనా లైట్ గా అయినా నవ్వించగలిగితే నాకు ఓ చటాకు మంచి కర్మ పాయింట్స్ వస్తాయని ఓ దురాశ.
ఇక్కడే ఓ గమ్మత్తుంది. అదేమిటంటే ఆ 99% లో 90% నా మీదే నేను జోకులు వేసుకుంటాను. ఇంకొకరి మీద వేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటాయి. (మనో భావాలు దెబ్బ తినడం అన్నది ఈ దశాబ్దపు జాతీయ జాడ్యం అనుకుంటా!)
నా మీద నేనే జోకులు వేసుకుంటే నా మనోభావాలు దెబ్బ తినవు!
పిడకల వేట: నా మీద నేను జోకులు వేసుకున్నానని కొందరు రెచ్చిపోయి నా మీద జోకులు విస్తృతంగా వేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ మీదకి రజనీకాంత్ విలన్ పేల్చిన గుండుని విలన్ మీదకే తిప్పి కొట్టినట్టు నేను తిరిగి ఫెడేల్మని కొడితే తట్టుకోలేరు. నా మీద జోకులు వేస్తున్నప్పుడు స్రుతి మించకుండా జంధ్యాల జోకులు టైపులో ఎన్ని జోకులేసినా నాకు అంత ఆనందం. కానీ జబర్దస్త్ టైపు జోకులేస్తున్నారు. అది ఎగస్ట్రా! సభ్యత అనే సన్నటి గీత దాటకండి. గీత చెరిపేయకండి.
ఇహ పొతే ఆ 9% పోస్టుల్లో ఓ నిగూడార్థం ఉంటుంది. నేను ఎవరి మీదైనా కామెంట్ చేయాలంటే హాస్యం జోడించి ఒకింత వ్యంగ్యంగా నర్మగర్భంగా అసలు ఎవరి మీద కామెంట్ చేసానో వాళ్ళకి కనీసం నా మీదేనా అన్న సందేహం కూడా కలగకుండా రాస్తూంటాను. అలా రాయడంలో ఉన్న కిక్కే వేరు!
ఇహ నా మనోభావాలు ఎందుకు దెబ్బ తింటున్నాయి అంటే ....
ఇలా నా హాస్య భరిత పోస్టులని కోడిగుడ్డుపై జిల్లెట్ మాక్ 4 రేజర్ తో షేవింగ్ చేస్తారు కొంతమంది సోషల్ మీడియా అన్ని చోట్లా. జోకుని జోకుగా తీసుకోరు. చాలా సీరియస్ గా తీసుకుని అందులో లాజిక్ లేదని ఘాట్టిగా రెండు చేతుల్తో పట్టేసుకుని ఎవరెస్ట్ ఎక్కిన ఫీలింగ్ తో కామెంట్ చేస్తారు. నాకు అవి చదివిన వెంటనే అర్జెంటుగా చచ్చిపోవాలన్న కోరిక తీవ్రంగా వచ్చేస్తుంది. కానీ చెయ్యాల్సిన లోకకల్యాణం పనులు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఏ ఘోరానికి పాల్పడటం లేదు!
ఇంకో రకం ఆ 9% లోనే. అవేమిటంటే నేను ఏదైనా ధర్మ సూక్ష్మం చెప్పదలుచుకుంటే ఛస్తే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పను. దాన్ని కూడా ఏదో ఒక ఫోటోతోనో, ఆ ఫోటోకి పెట్టె కామెంట్ తోనో, ఫోటో లేకుండా ఓ పోస్టులో ఎక్కడో ఎవ్వరికీ దొరక్కుండా మాంత్రికుడి ప్రాణాలు చెట్టు తొర్రలో చిలకలో పెట్టినట్టు ఎంబెడ్డెడ్ గా పోస్ట్ చేస్తా.
ఆ అంతరార్ధం అర్ధం గమనించరు! గ్రహించరు! పైపెచ్చు మళ్ళీ కోడిగుడ్డుపై షేవింగ్ మామూలే. నాకేదో అస్సలు ఏ విషయం తెలీదన్నట్టు అరటిపండు ఒలిచి కామెంట్ చేస్తారు.
సోదాహరణంగా చెప్పమంటారా? చెప్తా! ఇంత రాసినవాడిని ఉదాహరణలు రాయకపోతే మళ్ళీ ఈ పోస్టుకి కూడా షరా మామూలే టైపులో కామెంట్స్ వస్తాయి.
ఉదా 1: ఈ మజ్జెన కొబ్బరికాయలో పువ్వు ఫోటో పెట్టాను. అంటే చాలామంది హద్దిరబన్నా ఇన్నాళ్ళకి దొరికాడీ పెద్ద మనిషి. ఏసేద్దాం అని అత్యుత్సాహంతో కామెంట్స్ పెట్టారు.
ఏమని?
చెప్పాగా? నాకేమి తెలీదని, నేనో గొప్ప అజ్ఞానినని వాళ్ళ ఫీలింగ్ అని. మరి నాకు జ్ఞాన బోధ చేయాలిగా?
"పువ్వు పుడితే అదృష్టం / శుభం కానీ పువ్వు పెడితే కాదు". ఆహా! నాకు తెలీదుగా ఈ చిన్ని విషయం!
"అది చేమంతి పువ్వు" - అబ్బో బానే కనిపెట్టేసారు!
"అవునండీ! అది చేమంతి పువ్వే" - కామెంట్స్ కి వత్తాసు కూడానూ
ఇదీ ఆ కామెంట్స్ వరస. సదరు వ్యక్తులు నాకు అది చేమంతి అని తెలీదని. అది నేనే ఆ కొబ్బరికాయలో పెట్టానని కూడా వాళ్ళు తెలుసుకోకుండా ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తారో నాకస్సలు అర్ధం కాదు.
ఇంతకీ ఇందులో ఓ నిగూడార్థం కూడా ఉంది. అదేమిటంటే
పాలు పొంగితే శుభం. కానీ గృహప్రవేశంలో దగ్గరుండి పాలు పొంగిస్తామే. మరి దానికి కొబ్బరికాయలో నేను పువ్వు పెట్టడానికి తేడా ఉందా?
ఇంకోటి. 50s, 60s దాకా ఓ నమ్మకం బాగా ఉండేది. ప్రజల్లో. అదేమిటంటే ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు, ప్రయాణానికి బయలుదేరినప్పుడు మంచి శకునం ఎదురొస్తే లాభం, విజయం అని. కానీ ఇక్కడ ఎదురొస్తే అన్న మాటని విస్మరించి ఇంట్లో ఉన్న పునిస్త్రీని రిక్షాకో, జట్కాకో ఎదురు రమ్మనే వారు. మంచి శకునం ఎదురొస్తే శుభం కానీ ఎదురు తెప్పిస్తే అని మరి అప్పటి పెద్దలకి తెలీదా? అలా చెయ్యడానికి, నేను కొబ్బరికాయలో పువ్వు పెట్టడానికి తేడా ఏమిటి?!
ఇంకోటి ఆ రోజుల్లోనే ముఖ్యమైన ప్రయాణానికి ఓ శుభ ముహూర్తం పెట్టేవారు. అంతవరకూ బానే ఉంది. కానీ చాలాసార్లు ఓ ఇబ్బంది ఎదురయ్యేది. అదేమిటంటే ఉదాహరణకి వాళ్ళు వెళ్లాల్సిన రైలు సాయంత్రం 8 గంటలకి అయితే ఈ బయల్దేరాల్సిన శుభ ముహూర్తం పొద్దున్న ఆరింటికో మరీ అదృష్టం బాలేపోతే ముందురోజు రాత్రి 8 గంటలకో ఉండేది. అప్పుడు ఉసూరుమంటూ ఆ ముహూర్తానికి బయల్దేరిపోయి అతడు సినిమాలో బ్రహ్మానందంలా రైల్వే స్టేషన్ లోనో బంధువుల ఇళ్ళల్లోనో రైల్ టైం దాకా వేళ్ళాడేవాళ్ళు. అప్పుడు నాలాంటి వాళ్ళకి ఓ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చి ఆ సంప్రదాయాన్ని ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చేసుకున్నారు. వాళ్ళ సౌలభ్యం కోసం. కొంతమంది తీసుకెళ్లాల్సిన బ్యాగ్, హోల్డాల్ వగైరా ముహూర్తం సమయానికి తీసుకెళ్లి పక్కింట్లో పెట్టేసి ఇంటికి చక్కా వచ్చేవాళ్ళు. అంటే మన సామాను ఇంటి బైటికి వెళ్ళిపోతే మనం ప్రయాణానికి బయల్దేరినట్టే అన్న మాట!
మరి అలా పక్కింట్లో సామాను పెట్టడానికి, నేను కొబ్బరికాయలో పువ్వు పెట్టడానికి తేడా ఏమిటో?
ఉదా 2: ఇంకో పోస్ట్ ఇటీవల పెట్టా. ఓ కార్టూన్ పెట్టి పొరుగింటి పిల్ల కూర రుచి అని ఊరికే అనలేదు అని వ్యాఖ్యానించాను.
ఇహ చూస్కోండి. మొదలెట్టారు కొంతమంది. అది పొరుగింటి పుల్ల కూర. పిల్ల కూర కాదు. అని!
అయ్యా! ఆర్యా! నాకు ఆ మాత్రం సామెతలు తెలీకుండానే 60 ఏళ్ళు వచ్చాయని నిజంగా నమ్ముతున్నారా? మీ ఇంట్లో సంగతి నాకు తెలీదు కానీ మా ఇంట్లో సామెత మాట్లాడకుండా ఒక్క రోజు కూడా గడవదు. అంత ఎక్కువగా సామెతలు వాడతాము.
ఇక్కడ పుల్ల కూరకి పిల్ల కూర అని కావాలనే పన్ లాంటిది వాడాను. అది అర్ధం చేసుకోకుండా నాకు సామెతలు నేర్పించడం.
చెప్పుకుంటూ పొతే ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణలు. కానీ మేటర్ అర్ధం అయ్యింది కదా?
ఇహ ముందు దయ చేసి జోకుని జోకులా తీసుకుని నవ్వొస్తే నవ్వండి. లేకపోతే మొహం నా మొహంలా పెట్టుకుని కిందకి స్క్రోల్ చేసేయండి. అంతే కానీ కోడిగుడ్డుపై షేవింగ్ చేయకండి.
ఈ పోస్టుకి చాలామంది మనోభావాలు దెబ్బ తింటాయి గారంటీగా. నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నావి దెబ్బ తిన్నాయిగా ఇన్నాళ్లు. ఇప్పుడు మీ వంతు. అందరం సామూహికంగా ఫీల్ అయిపోదాం.
ఇలా ఈ విషయం రాద్దామా వద్దా అని చాలా నెలలుగా అలోచించి, చించి ఏదైతే అదే అయ్యింది. నా మనసులో మాట చెప్పేద్దామని నిర్ణయించుకుని రాసేశా. ఎవరో కనీసం ముఖ పరిచయం కూడా లేనివాళ్లు ఏదో ఫీలవుతారని నేను రోజూ ఫీల్ అవ్వడం ఎందుకు? తాంబూలాలు ఇచ్చేసాను.
నవ్వడం. నవ్వించడం. నవ్వలేకపోవడం. - వీటిల్లో ఏది కావాలో మీ చేతుల్లోనే ఉంది.