సెలవుల్లో చేతిలో కెమెరా ఉంటే ఇదిగో ఇలాంటి కళాఖండాలు తీస్తాం!
ఇదేటి తొక్కలో ఫోటో అని తీసి పారేయకండి
భావుకత, సృజనాత్మకత ఉండాలి కానీ కాదేది భార్యని ప్రసన్నం చేసుకోడానికనర్హం!
ఎలా అంటారా?
ముందస్తుగా ఈ ఫోటోని నాకు తగినంత పారితోషికం ఇచ్చి కొనుక్కోవాలి. తర్వాత దాన్ని ఎంత పెద్ద సైజు వీలయితే అంత పెద్ద ప్రింట్ తీసి అందమైన ఫ్రేమ్ కట్టించి మీ డ్రాయింగ్ రూమ్ లో మంచి నదరుగా ఉన్న మేకుకి వేళ్ళాడదియ్యాలి.
అంతే! మీ ఆవిడకి మీమీదున్న ప్రేమని 2x పెంచచ్చు.
హేమిటి సార్? మరీ అతి చేస్తున్నారు. వేరుశెనగ తొక్క ఫోటో పెడితే మా ఆవిడకి నా మీద ప్రేమ అమాంతం పెరిగిపోతుందా? నా చెవిలో పెద్ద కాలీఫ్లవర్ పెడుతున్నారు - అని తొందరపడి వాపోకండి.
అలా ఫోటో ఫ్రేమ్ కట్టి వేళ్ళాడతీసాక ఏమవుతుందో 70 mm లో చూపిస్తా
మీ ఆవిడ మీకు కాఫీ ఇవ్వడానికి హాల్లోకి వచ్చినప్పుడు మీరు ఆ ఫోటో ఫ్రేమ్ ని అటునించి ఇటునించి దగ్గర్నించి, ఒకింత దూరం నుంచీ చూస్తూ కనిపించాలి మీ ఆవిడకి. లేకపోతే ఆ ఫోటో ఆవిడ కళ్ళల్లో పడకపోవచ్చు!
అప్పుడావిడ సహజంగానే ఇదేమిటండి ఎవరన్నా ఓ జలపాతమో, ఓ మౌంట్ ఎవరెస్ట్ ఫోటోనో పెడతారు హాళ్ళో. మీరేంటి ఆ తొక్కలో ఫోటో పెట్టారు అని అడుగుతుంది
అప్పుడు మీరు అక్కినేనిలా "హేంత మాటన్నావు ల్లతా (పేరులో మొదటక్షరానికి ఒత్తు పెట్టి పలకడం మర్చిపోకూడదు. అలా బరువుగా మాట్లాడితేనే అనుకున్న ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడింకో విన్నపం. నేను రాశానని మీ ఆవిడ పేరు లత కాకపోయినా అలా ల్లతా అని పిలిచారనుకోండి. తర్వాతి యాదృచ్చిక సంఘటనలకు మానేజ్మెంట్ ఏ విధమైన బాధ్యత వహించదు.
"అది మాములు తొక్కనుకున్నావా ల్లతా (ఇక్కడ మీ ఆవిడ పేరుని ప్రతిక్షేపించడం మరవద్దని మరో మారు మనవి) దాని వెనకాల ఓ మధురానుభూతి ఉంది!"
అనగానే ఆవిడ ఏమిటా మధురానుభూతి అని అనుమానంగా అడుగుతుంది.
ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి
ఆప్షన్ నెంబర్ 1: మన పెళ్ళికి ముందు మనం మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ పార్క్ (ఇక్కడ మీ ఇష్టమైన, గట్టిగా చెప్పాలంటే మీరెళ్ళిన పార్క్ పేరు చెప్పండి. పెళ్ళికి ముందు వెళ్లకపోతే హనీమూన్ లో మైసూర్ బృందావన గార్డెన్స్ కానీ ఊటీ టీ గార్డెన్స్ ఉదాహరించచ్చు) అప్పుడు నేను నీకు నా పాకెట్ మనీ తో ఓ సోలెడు వేరు శెనక్కాయలు కొని పెడితే నువ్వు ఎంతో ఇష్టంగా తిన్నావు గుర్తుందా? నువ్వలా తిన్న మొట్టమొదటి వేరు శెనక్కాయ తొక్కని నీకు తెలీకుండా తీసి ఇన్నాళ్లు దాచాను. దాన్నెక్కడ ఎలక కొడుతుందోనని ఓ ఫోటో తీయించా. మన జాయింట్ మధురానుభూతి ఎప్పుడూ కళ్లముందుండాలని ఇలా ఫ్రేమ్ కట్టించా - అని చెప్పాలి
ఆప్షన్ నెంబర్ 2: ఇది కొంచం నాలా ఓవర్ ఆక్షన్ చేసే వాళ్ళకి మాత్రమే. ఒకింత ప్రమాదం పాలయ్యే అవకాశం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త
ఒకప్పుడు నేను వయసులో ఉన్నప్పుడు ఓ సుందరితో పార్క్ కి ( మీ ఇష్టమైన పార్క్ పేరు చెప్పండి) వెళ్ళినప్పుడు ఆమెకి కృష్ణుడికి కుచేలుడు ఇచ్చినట్టు వేరు శెనక్కాయలు ఇస్తే ఆమె ఎంతో ఆనందంగా, ప్రేమగా వాటిని తింటే ఆ మధురానుభూతి జ్ఞాపకాలు మిగిలిపోవాలని ఆ అతిలోక సుందరి తిన్న మొట్టమొదటి వేరు శెనక్కాయ తొక్కని ఇలా భద్రంగా ఇన్నాళ్లు దాచాను. దాని ఫోటోనే ఇది.
ఇక్కడ మీ ఆవిడ దగ్గరనించి రెండు రకాల రియాక్షన్ రావచ్చు!
రియాక్షన్ నెంబర్ 1: మీ ఆవిడ వెంటనే ఎవరా సుందరి అనగానే మీరు ఎటు తిరిగీ ఓవర్ ఆక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచం ఓవర్ అయ్యి సుందరి కాదు అతిలోక సుందరి అని కరెక్ట్ చెయ్యాలి! వెంటనే ఉత్తరక్షణంలో ఆమె ఎవరో నీకు తెలుసు. బాగా తెలుసు అని ఉడికించాలి. అప్పుడామె తన క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురి పేర్లు లేదా మీ గర్ల్ ఫ్రెండ్స్ పేర్లు తెలిస్తే ఏవో చెప్తుంది. ఇక్కడో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీ ఫ్రెండ్స్ పేర్లయినా ఆమె ఫ్రెండ్స్ పేర్లయినా చెప్పినప్పుడు మీ మోహంలో ఏ విధమైన హావభావాలు మారకూడదు. ఏమాత్రం మీ ఎక్స్ప్రెషన్ మారినా ఖల్లాస్!
ఆమె నామావళి చెప్పడం పూర్తయ్యాక "హిదేనా నువ్వు నన్నర్ధం చేసుకున్నది. ఐ హార్టెడ్ - అని ఓ సారి గాఢంగా నిట్టూర్చి "ఆ అతిలోక సుందరి ఎవరనుకున్నావ్? నువ్వే!" అని క్లైమాక్స్ లో పీటముడి విప్పాలి.
రియాక్షన్ నెంబర్ 2: మీరలా ఎవరో అతిలోక సుందరితో పార్కుల్లో షికార్లు చేశారనగానే ఆవిడ మీ వేపు రుసరుసమంటూ చూసి అక్కడినించి విసురుగా వంటింట్లోకెళ్ళి కాఫీ గిన్నెని దభాల్న సింకులో భారీ డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్ వచ్చేట్టు విసిరి పడేస్తుంది. ఆ లోపల మీరెళ్ళి ఆవిడని పైన చెప్పినట్టు నువ్వే ఆ అతిలోక సుందరని నమ్మించాలి. ఇక్కడ సినిమావాళ్ళ భాషలో టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. ఏమాత్రం తేడా వచ్చినా ఇంతే సంగతులు. చిత్తగించవలెను.
కొంతమంది అంతా బానే ఉంది కానీ నేను మా ఆవిడని పెళ్ళికి ముందు తర్వాత కూడా ఏ పార్క్ కి తీసికెళ్ళిన పాపాన పోలేదు. వేరు శెనక్కాయలు కొని పెట్టలేదు అని వాపోవచ్చు. వాళ్లకి కూడా నా దగ్గరో ఉపాయం ఉంది. రేపెటు తిరిగీ వీకెండ్ కాబట్టి మీ ఆవిడని అర్జెంట్గా ఏదన్నా పార్కుకి తీసుకెళ్లి వేరు శెనక్కాయలు కొని పెట్టండి. ఒక వేళ అక్కడ అవి అమ్మకపోతే - దానికింకో ఉపాయం. మీరే ముందస్తుగా బోల్డు వేరు శెనక్కాయలు కొని మీ పంట్లాము జేబులో వేసుకెళ్లండి.. తెలివుండాలే కానీ మార్గాలుండవా?
తదుపరి ఓ వారం తర్వాత ఈ పోస్ట్ మొదట్లో చెప్పిన రెండు మార్గాల్లో మీకు నచ్చినది ఎంచుకొని డు ఫెస్టివల్!
గమనిక: ఈ ఫోటో రేట్ గురించి ప్రైవేట్ గా మెసేజ్ చేయగలరు.
గమనిక 2: ఇది కేవలం భర్తలని ఉద్దేశించి రాసాను కాబట్టి నేనేదో పురుష పక్షపాతిని అని నిందారోపణ చేయకండి. వాళ్ళకి ఎందుకు రాసానంటే ఈ మగాళ్ళకి అన్నీ చెప్పాలి (కావాలంటే భార్యాలనడగండి!) కానీ ఈ ట్రిక్ భార్యలు కూడా నిక్షేపంగా వాడుకోవచ్చు. వాళ్ళకా మాట చెప్పనక్కరలేదు. వాళ్ళకి తడుతుంది కాబట్టి
గమనిక 3: ఇలాంటివి వాడినప్పుడు ఆ భార్యానుగ్రహాన్ని వెంటనే కాష్ చేసుకోవాలి. అల్ప సంతోషులయితే ఏమోయ్ నువ్వు గుత్తి వంకాయ అద్భుతంగా చేస్తావు (వంకాయ బదులు మీకిష్టమైన వంటకం చేపల పులుసు వగైరా చెప్పుకోండి!) అనగానే రెండు నిమిషాలాగండీ అని అద్భుతంగా మీకు నచ్చిన వంటకాలు చేసేస్తుంది. నాలాంటి కొంచం అడ్వాంటేజ్ తీసుకునేవాళ్లయితే "ఇవాళ సాయంత్రం నా ఫ్రెండ్ ''చిన్న'' పార్టీ ఇస్తున్నాడు. వాడికి ప్రమోషన్ వచ్చిందిట" అని నసిగితే చాలు. పర్మిషన్ గ్రాంటెడ్!
ఆడాళ్ళు ఏం అడగాలో నేను చెప్పాలా మీ పిచ్చికానీ? "మొన్న దీపావళికే కొనుక్కుందామనుకున్నా. సాయంత్రం కళానికేతన్ కి వెళ్లి ఓ పట్టు చీర కొనుక్కుందామండి" అనో లేదా మలబార్ గోల్డ్ కో టెండర్ పెట్టచ్చు!
అభీష్ట సిద్ధి రస్తు!