రైల్వే స్టేషన్ కి హడావిడిగా, ఆడరాబాదరాగా, రైలు బయల్దేరడానికి ఇహ కేవలం ఐదే నిమిషాలు ఉన్నప్పుడు ఆటోీ లోంచి చెంగున గెంతి, స్ట్రాలీని బరబరా, గొరగొరా లాక్కుంటూ, ఆయాసపడుతూ, ఒక్కరవ్వ ముందెందుకు బయల్దేరలేదని మనల్ని మనం తిట్టుకుంటూ, హైదరాబాద్ రోడ్లనీ, "వెధవ" ట్రాఫిక్ నీ కూడా జమిలిగా తిడుతూ, ఆలీసం అవ్వడంతో ఆటో వాడి దగ్గర మనకి రావాల్సిన పది రూపాయలు వదిలేయాల్సి వచ్చిందని బాధ పడుతూ స్టేషన్ లోకి అడుగెట్టగానే మనం ఎక్కాల్సిన రైలు అరగంట ఆలస్యంగా వస్తుందన్న బోర్డ్ చూడగానే హమ్మయ్య అని పరుగులాంటి నడకకి ఎయిర్ బ్రేక్ వేసి బాబా రాందేవ్ చెప్పినట్టు మూడుసార్లు దీర్ఘంగా శ్వాస తీసి వదిలి, స్లో మోషన్లో మన రైలు వచ్చే ప్లాట్ఫారం కి వెళ్లి, ఇంకోసారి హమ్మయ్య అనుకుని, మనవాళ్ళకి ఫోన్ కొట్టి "రైలు మిస్సయ్యినంత పనయ్యింది. వెధవ ట్రాఫిక్, వెధవ రోడ్లు, పైగా మేమెక్కింది ఓ డొక్కు ఆటో, ఒరే అబ్బీ కొంచెం వేగిరం పోనివ్వరా రైలు తప్పిపోతామో ఏమిటో అని ఎన్నిసార్లు చెప్పినా ఆ ఆటో స్పీడ్ వెళ్తేనా, సౌండ్ ఎక్కువ, స్పీడ్ తక్కువ, అయినా అదృష్టం. రైలు అరగంట లేటుట! చెప్పడం మర్చిపోయాను. నీకసలే మతిమరుపు ఎక్కువ. రాత్రి పడుకునేముందు గ్యాస్ సిలిండర్ ఆఫ్ చెయ్యడం మర్చిపోకు. అలాగే పాలు తోడు పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టడం కూడా" అని ధారాప్రవాహంగా అనర్గళంగా, అవిరామంగా ఓ పది నిమిషాలు అప్పగింతలు పెట్టి ఇంతలో మైకులో మన రైలు ఇంకో అరగంట ఆలస్యంగా వస్తుందన్న అనౌన్స్మెంట్ విని అప్పటిదాకా రైలు ఆలస్యం మన అదృష్టంగా భావించామన్న విషయం అలవోకగా మర్చిపోయి "మనదేశం ఇంతే. వెధవ రైళ్లు ఎప్పుడూ ఆలస్యమే. ఈ దేశం బాగుపడదు. దీన్ని బాగుచెయ్యడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు అని రైల్వే వాళ్ళని, భారద్దేశాన్ని, మన తలరాతని విడివిడిగా, జమిలిగా తిట్టుకుంటూ ఒరే అబ్బీ కాఫీ ఎంత? ఓ కప్పందుకో, వెధవ రైల్వేస్టేషన్ కాఫీ దరిద్రంగా ఏడుస్తుంది కాఫీ ఏమిటి నా మొహం రంగు నీళ్లు కానీ ఏం చేస్తాం ఇంకో అరగంట కాలక్షేపం చెయ్యాలిగా ఆలస్యం అవుతోందని అమ్మాయి కాఫీ తాగి వెళ్ళమన్నా ఆగకుండా తాగకుండా వచ్చామాయే. ఏమో మళ్లీ ఇంకో అరగంట అలీసం అంటాడేమో అని ఆ గోరువెచ్చటి కాఫీ రంగు నీళ్లు సగం తాగి సగం వదిలేసి, ఆ కప్పుని కిటికీలోంచి బైటికి అతి సున్నితంగా తోసేసి, ఏమండీ హడావిడిలో నీళ్ల సీసా పెట్టుకోడం మర్చిపోయాం ఓ రెండు వాటర్ బాటిల్స్ కొనండి అమ్మాయి రాత్రికి పులిహోర ఆవకాయ ప్యాక్ చేసి ఇచ్చింది మీకసలే హడావిడిగా తినడం ఎక్కిళ్ళు తెచ్చుకోవడం పెద్ద బాడ్ హ్యాబిట్ ఆనక నీళ్లు లేకపోతె ఇబ్బంది పడిపోతారు అని ముగుడుగారికి పురమాయించి, తీరిగ్గా ఫేస్బుక్ ఓపెన్ చేసి, ఐ హేట్ ఇండియన్ రైల్వేస్ ట్రైన్స్ నెవర్ కం ఆన్ టైం అని ఓ పోస్ట్ పడేసి ఆ రోజుకి చేయాల్సిన సామాజిక బాధ్యత పూర్తి చేసామన్న సంతృప్తితో ఆయనగారు కొన్న వాటర్ బాటిల్ అయన చేతే ఓపెన్ చేయించి ఓ గ్లాసుడు నీళ్లు తాగి హమ్మయ్య అనుకుంది ఒహావిడ
NB: పై రచన ఆసాంతం ఒకే వాక్యమని గమనించి, వీలయితే మీరు కూడా ఊపిరి తీసుకోకుండా ఆసాంతం ఒక్కసారిగా breathless పాట టైపులో చదవడానికి ప్రయత్నించండి