ATM లో కాష్ లేదు! PayTM లో ఎకౌంటు లేదు!!
ఇల్లీమజ్జేనా మూడు, నాలుగు వారాలుగా నేను బోల్డు మందికి బోల్డు డబ్బు బాకీ పడిపోయాను. సొమ్ము లేక కాదు. రొఖ్ఖం లేక! మల్లెపూలమ్మికీ, మిరపకాయ బజ్జీలబ్బికి. వాళ్లింకా డెబిట్/ క్రెడిట్ కార్డులు, PayTM లు తీసుకునే స్థాయికి ఎదగలేదు. మరంచేత బ్యాంకులో సొమ్ములున్నా, బ్యాంకు వాళ్ళ దగ్గర సొమ్ములు లేకపోవడంతో మా చెడ్డ చావొచ్చింది.
మా ఇంటికి కేవలం రెండు వందల గజాల్లో "మా బ్యాంకు......బ్యాంకు" దాంట్లో ఒక ATM ఉన్నాయి. నేను ఖాళీ దొరికినప్పుడూ, బాకీలు గుర్తొచ్చినప్పుడు అలా సరదాగా ATM దాకా రాంప్ మీద అందమైన మోడల్ నడిచే టైపులో వయ్యారంగా నడుచుకుంటూ (ఎంత కాష్ అవసరం అయితే మట్టుకు పరిగెడతారా ఏంటి అసయ్యంగా!) వెళ్ళడం అలవాటు చేసుకున్నా. ఎటూ ఈ మజ్జెన వ్యాయామం గట్రా ఏమీ చెయ్యటం లేదు, మరీ భారీగా కనిపిస్తున్నానని, మా ఇంటావిడ భారీగా వాపోతోందని సరే వాక్ ది టాక్ లాగా వాక్ టు ది బ్యాంక్ ప్రోగ్రాం ఒకటి దాదాపు ప్రతి రెండురోజులకి ఒక సారి!
సరే చదువరులందరికీ తెలిసిన విషయమే కదా ATM లలో కాష్ ఎండమావిలాంటిదని. ఈ వాక్ టు ది బ్యాంక్ కార్యక్రమం ఇలా మూడు వారాలు కొనసాగించాక నేను మాత్రం ఓ చటాక్ బరువు తగ్గానేమోనని అనుమానం పట్టుకుంది. ఎందుకంటే ప్యాంట్లు ఓ తెగ జారిపోవడం మొదలయ్యింది!** ఇదేదో బాగుంది. బోల్డు రోజులు ఈ ATM లలో కాష్ రాకుండా ఉంటె బాగుండును నేను బోల్డు బరువు తగ్గిపోవచ్చు అని ఇష్టదైవాన్ని అష్టోత్తరం చదివి నా మనోవాంఛ కేవలం దేవుడికే వినిపించేట్టు చెప్పే సమయంలో వెంటనే నా అంతరాత్మ ఓ జెల్ల కొట్టింది.
ఇదేటిది. అపశకునం. నిష్టగా పూజ పూర్తిచేసే టైం కి ఇలా జెల్ల ఏమిటి. ఎందుకైనా మంచిదని ఒక్క క్షణం మూడోకన్ను మూసే ఆలోచించాను. అఫ్ కోర్స్ మూడో కన్ను (జ్ఞాననేత్రం!) ఎప్పుడూ మూసుకునే ఉంటుందనుకోండి. అప్పుడు తట్టింది ఆ జెల్ల నాకు వార్నింగ్ అని. అదేటంటే నేను పుట్టిందే లోక కల్యాణం కోసం ... ఇప్పటికే ఈ విషయం చాల సార్లు మనవి చేసాను.... మరి అసుంటప్పుడు ఇలా కేవలం నా బరువు తగ్గడం కోసం మొత్తం పెజానీకానికే నిరవధికంగా కాష్ లేకుండా చెయ్యడమా? నో! నెవర్!
అంతే! ఆ ఆలోచన న్యూటన్ తలమీద ఆపిల్ పడినట్టు నా తలమీద జెల్ల తగలగానే నాక్కూడా జ్ఞానోదయం అయ్యి వెంటనే నా క్షుద్ర కోరికని తొక్కేసి అన్ని ATM లలో కాష్ పొంగి పొరలాలని నా వంతు ఉడతాభక్తితో పూజని కానిచ్చేశాను.
సూచన: నా జీవితచరిత్ర మున్ముందు ఎవరన్నా రాస్తే ఇల్లీ నా భారీ త్యాగాన్ని ఏదైనా అధ్యాయం చివర ఓ బాక్స్ లో ప్రచురించచ్చు.
సరే నా మిగతా కోరికలు పట్టించుకోనట్టే .. నా పూజానంతర కోరిక కేవలం నిస్వార్ధంతో, దేశ ప్రజల శ్రేయస్సు కోసం కోరినది అని కూడా గుర్తించకుండా ...దేవుడు ఈ కోరికని కూడా అస్సలు పట్టించుకోలేదు. ఇది నా భక్తికి ఒక అగ్నిపరీక్ష. ఈ పరీక్ష నేను సెప్టెంబర్ లో పాస్ అయ్యే అవకాశం ఉంది!
ఇంతకీ కధలోకి, మీకు కధలాగే ఉంటుంది లెండి... కానీ నా సామాన్య జీవితంలో ఇదొక అసామాన్య సంఘటన....నిన్న యధావిధిగా యదాలాపంగా కాళ్ళు ఈడ్చుకుంటూ (ఈ బరువు మోయడం అంత సులభమా?) ATM కి వెళ్లాను.
ఈ మధ్య మా బ్యాంకు వాళ్ళు ఒకింత ఎగస్ట్రా సేవ చేస్తున్నారు వినియోగదారులకు! అదేమిటంటే వరదల్లో ఇరుక్కుపోయి పైనించి హెలికాప్టర్ లోంచి తిండి పొట్లాలు విసిరితే వాటిమీద ఎగబడే ప్రజల్లాగా ఇలా ATM కనిపించగానే ప్రజలు స్కూటర్లు, కార్లు ఎక్కడపడితే అక్కడ పార్క్ చేసి యమా స్పీడు గా ATM లొకీ చొచ్చుకుపోయి ఆ పైన అది నోక్కమన్న ఆప్షన్స్ అన్నీ నొక్కీ ఆశగా చొంగకార్చుకుంటూ బైటికి నోట్లు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు లాగేద్దామా అని ఎదురు చూసి, ఆ ATM ఓ అరనిమిషం దాని కడుపులో ఏదో తిప్పుతున్నట్టు శబ్దాలు చేసి బైటకి నోట్లు బదులు ఓ చిన్ని స్లిప్ ఓ అర్ధం కాని కోడ్ ప్రింట్ చేసి బైటికి కక్కితే ఆ పెజలు విపరీతమైన డిప్రెషన్, డిసప్ప్పాయింట్మెంట్ కి లోనయ్యి పక్కనే బ్యాంకు ఉంటె అందులో వీరావేశంతో జొరబడి కనిపించిన ప్రతి బ్యాంకు ఉద్యోగిని వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని పట్టి ఒకింత బూతులు తిట్టడం అన్నది రివాజుగా మారడంతో ఇలా ATM కి అటాచ్ బ్యాంకు బ్రాంచ్ ఉంటె మట్టుకు, ఆ ATM లో కాష్ లేకపోతే అనగా ఇరువదినాలుగు గంటలు దాని షట్టర్ క్లోజ్ చేసి ఉంచుతున్నారు. అలా చేస్తే స్కూటర్, కార్లు వాళ్ళు షట్టర్ వేసేసిన ATM చూసి పరిస్తితి "షరా మాములే! ATM లో కాష్ నిల్లె" అని అర్ధం చేసుకుని ఆగకుండా వెళ్ళిపోతున్నారు. బ్యాంకు వాళ్ళు యమా హ్యాపీ!
కధలోకి మళ్ళీ వస్తే ....షరా మామూలే! ATM కి షట్టర్ దించేసి ఉంది. నేను నడిచి (బోల్డు శ్రమతో) కేవలం కాష్ కోసమే వెళ్లాను కాబట్టి వెంటనే బ్యాంకు లోకి దూసుకుపోయాను. నేను అప్పుడప్పుడూ అలా లోపలి రావడం వాళ్ళకి అలవాటే. అప్పుడప్పుడూ వాళ్ళ మీద, బ్యాంకింగ్ వ్యవస్థ మీద, ఈ బ్యాంకులతో ప్రజలు పడుతున్న అవస్థ మీద కూసిన్ని కుళ్ళు జోకులు వేస్తె వాళ్ళు ఏడవలేక నవ్వడం అలవాటు చేసుకున్నారు.
ఎదురుగా కాషియర్ ని పట్టుకొని "ఏం సార్! ఈ మధ్య మీ దగ్గర అస్సలు డబ్బులు ఉండటం లేదు. మీక్కావాలంటే చెప్పండి. నా దగ్గర కాష్ రిచ్ పార్టీలున్నారు. షార్ట్ టర్మ్ అప్పేమన్నా కావాలంటే సరసమైన వడ్డీకి ఏర్పాటు చేస్తా" అని ఓ బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చాను.
ఆ కాషియర్ నవరసాలకి ఇంకో నాలుగు జోడించి పదమూడు రసాలు ఒక్కసారిగా మొహంలో చూపించాడు. నా దగ్గర స్పైకెమెరా లేదు కానీ లేకపోతే మీ అందరికీ కూడా ఆ తెరాస ...(ఇదో సంధి...తేరా=పదమూడు ప్లస్.రస=రసాలు).. మొహం పోస్ట్ చేసి చూపించేవాడిని. మీకా అదృష్టం లేదు... కేవలం ఊహించుకోండి.
ఈ ATM లలో కాష్ ఎప్పుడు దొరుకుతుంది. నా అప్పులెప్పుడు తీరతాయి. ఏమిటో జీవితం. బ్యాంకు ఎకౌంటు లో డబ్బుండీ బ్యాంకు లో డబ్బు లేక ఇబ్బందులు ఇంకేన్నాళ్ళో?!
కథ కంచికి! నేను ATM కి.
** ఈ పాంట్లు ఇంత వేగిరం అంత బరువు తగ్గి ఇలా జారిపోవడం ఏమిటా అని ఓ చిన్ని FBI ఇన్వెస్టిగేషన్ చేసాక అర్ధం అయ్యింది., పాంట్లు జారడం బరువు తగ్గి కాదు, బొజ్జ పెరిగి పాంట్లు పైకెళ్ళలేక, గుండ్రంగా ఉన్న బొజ్జ మీద పట్టుదొరక్క కిందకి జారిపోతున్నాయి అని. హతవిధీ!!