ఈ మధ్య ఓ సాయంత్రం ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు నన్నో పాట పాడమన్నారు. నాకసలే మొహమాటం ఎక్కువ. ఎవ్వరికీ "No" చెప్పలేను. అదీ కాక నన్ను పాట ఆపమనేవాళ్ళే కాని పాడమనేవాళ్ళు ఒకింత తక్కువేనని చెప్పాలి. మరందుకని వచ్చిన అవకాశం మీన, మేషాలు లెక్కెడుతూ కూర్చుంటే శ్రోతలు మనసు మార్చుకునే ప్రమాదం ఉంది.
అందుకని వెంటనే గొంతు సవరించుకోకుండానే ఓ మనవి విన్నవించాను. అదేమిటంటే "నేను ఏ పాట పాడినా అది ఏ రాగంలో ఉన్నా నేను దాన్ని "రాగమాలిక" లాగ మార్చి పాడే అలవాటుంది నాకు. అందుకని అప్పుడప్పుడూ మూడు నాలుగు రాగాలు, కూనిరాగాలు, స్వరాలూ, అపస్వరాలు, గతులు, సంగతులు, గమకాలూ, చమక్కులు ఇవన్నీ మేళవించి, రంగరించి పాడుతా! తస్మాత్ జాగ్రత్త" అని మూడో ప్రమాద హెచ్చరిక జెండా ఎగరేసి ఓ పాలి గొంతు సవరించుకుని మరీ పాట మొదలెట్టా.
సరే. అందరూ కళ్ళు మూసుకొని వినడం మొదలెట్టారు. తన్మయత్వంతోనా, నా ముఖకవళికలు, మొహంలో కదలికలు చూడలేకా, లేక వాళ్ళ ముఖకవళికలు దాచడానికా అన్నది టీవీ9 వాడు పానెల్ డిస్కషన్ పెడితే కాని తేలని, తెలీని వ్యవహారం.
నేను కూడా మధ్ద్యమధ్యలో పెద్ద పెద్ద గాయకులు కూడా పాడుతున్నప్పుడు కళ్ళు, ఎడం చేతివేలుతో ఎడమ చెవి మూసుకుని పాడడం చూసిన సీన్ గుర్తు తెచ్చుకుని నేను మట్టుకు తన్మయత్వంతో, తాదాత్మంతో (ఈ మాటకి అర్ధం సరిగ్గా తెలీదు కాని ఇక్కడ ప్రాస బాగా కుదిరిందని వాడడం జరిగిందని పాఠకులకి విజ్ఞప్తి) వెరైటీ గా ఉంటుందని ఓ కన్ను ఓ చెవి మూసి పాడేసాను.
పాట అయ్యిన వెంటనే ఫ్రెండ్స్ అందరూ ఓ నిమిషం పాటు తెగ చప్పట్లు కొట్టేసారు. వార్నీ. ఇంత బాగా మెచ్చుకుని ఇన్ని చప్పట్లు కొడతారని తెలిస్తే ఇంకుంచం బాగా పాడేవాడిని కదా అనుకుని అదే అన్నాను. అంతే అందరూ షాక్ అయిపోయారు. ఇదేటిది. నా మధురగానం రెండోసారి వినే భాగ్యం కల్లో కూడా ఊహించక ఆ మహద్భాగ్యం ఎదురొచ్చేటప్పటికి తట్టుకోలేక షాక్ లోకి వెళ్ళిపోయారా? ఈ లోపల అందరిలో ఒకింత భారీమనిషి తేరుకుని "మేము చప్పట్లు కొట్టింది నువ్వు బాగా పాడావని కాదు! హమ్మయ్య మొత్తానికి నీ పాట అయ్యిపోయిందని" అని నిర్మోహమాటంగా మొహం మీద నీళ్ళు కొట్టినట్టు అని నా చిన్నారి హృదయాన్ని బద్దలు చేసాడు. అది డాల్బీ డిజిటల్ సరౌండ్ సిస్టం శబ్దంతో వెయ్యినూటపదారు ముక్కలయ్యిపోయింది. ఫెవికాల్ కూడా చేతులెత్తేసే సీన్!
ఫ్రెండ్స్ కొంపలకి. కధ కంచికి (ట్రైన్ లో టికెట్లెస్ ట్రావెల్) నేను నా అలకగృహానికి! అలక తగ్గాక మీ అందరికీ నా పునర్దర్శన ప్రాప్తి రస్తు!