వసంతకాలే సంప్రాప్తే/ కాకఃకాకః పికఃపికః. ;)
వసంతకాలం మొదలయ్యింది కాబట్టి ఈ "పాడు" కోయిలలు అడ్డంగా దొరికిపోతాయి! అసలు నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే ఈ కోయిల్లకి విపరీతమైన తెలివితేటలు కదా? దానికి తోడు ఒకింత బద్ధకం కూడా ఉందేమోనని అనుమానం! లేకపోతే శుభ్రంగా ఒక సొంతిల్లు కట్టుకొని అందులో గుడ్లు పెట్టి, వాటిని పొదిగి పిల్లని చేసి, అవి ఎదిగి జీవితంలో పైకొస్తే హాయిగా చూసి ఆనందించ్చుగా? ఊహూ.. ఈ "ఊహూ! ఇదేదో కొయిల గానం "కూహూ" కి ప్రాస కాదండోయ్!
ఇంతకీ దాని బద్ధకం, తెలివితేటలూ కలగలిపి అదేం చేస్తుందంటే కాకి, దానిలాంటి ఇంకా కొన్ని అమాయక పక్షుల గూళ్ళు బ్రహ్మాండంగా ఉన్నవి సెలెక్ట్ చేస్తుందిట ముందస్తుగా. ఆ పైన మగ కోయిల ఆ గూటి ఓనర్ పక్షిని అలా తన మృదు మధుర గానంతో మెస్మరైజ్ చేసి అలా అలా కూసింత దూరం తీసుకెల్తుందిట. అంతే ఆ అదను చూసి పెళ్ళాం కోయిల గభుక్కుని ఆ అమాయకపక్షి గూట్లోకి ఒక్క గెంతు గెంతి, ఒక రెండు మూడు గుడ్లు పెట్టి పారిపోతుందిట! ఇక్కడ ఇంకో బ్రహ్మాండమైన తెలివితేటలు చూపిస్తాయి, ఈ కోయిల జంట. అప్పటికే ఒకటో, రెండో గుడ్లు పెట్టిన కాకి గూడునే ఎంపిక చేస్తాయి. లేదంటే ఎంత అమాయకపక్షి అయినా అలా బైట షికారుకి వెళ్లి వచ్చేటప్పటికి తన గూట్లో ఒక రెండో, మూడో గుడ్లు కనిపిస్తే హాశ్చర్యం, అనుమానం రావా? అందుకని అలా గుడ్లు పెట్టిన పక్షి గూట్లో పెడితే ఆ ఆడ కాకి, ఆ మగ కోయిల వెంట చెడు తిరుగుళ్ళు తిరిగి అలిసిపోయి గూడుకొచ్చాక ఒకటి రెండు గుడ్లు ఎక్కువగా కనిపించినా పెద్ద పట్టించుకోవుట ఎందుకంటే కాకులు లెక్కల్లో కొంచం వీక్ ట :(
ఇంక ఆ తర్వాతేముంది? ఆ అమాయక్పక్షి "దున్నేవాడిదే భూమి" అన్న టైపులో తన గూట్లో ఉన్న గుడ్లన్నీ తనవే అని భావించి, వరస పెట్టి వాటిని పొదగడం మొదలెడుతుంది. మెల్లిమెల్లిగా ఒక్కో గుడ్డులోంచి ఒక్కో పిల్ల బైటకి వస్తుంది. కోయిల పిల్లలు కూడా కాకి రంగులోనే ఉంటాయి దాదాపుగా. అక్కడక్కడా కొంచం ఎరుపున్నా ఆ తల్లి కాకి పెద్దగా అనుమానపడదు. బహుశా నా పుట్టింటి దూరపు బంధువుల రంగు వచ్చిందని ఓ తెగ ఆనందపడిపోతుంది ;)
అలా సవతి కాకి తల్లి దగ్గర పెరుగుతున్న కోయిల పిల్లలు కూడా ముందస్తుగా కొన్నాళ్ళు కాకిలాగే అరుస్తాయిట కూడా! వాటి తెలివి మండిపోనూ. అందుకే అంటారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని! కాకి బావ కూడా ఈ పెద్ద జాయింట్ ఫ్యామిలీని చాల జాగ్రత్తగా పెంచుతుందిట. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది?
చెప్తాను. వింటూనే ఉండండి. 98.3 FM . ఇది చాల హాట్ గురూ!! చ్చా! రోజూ ఈ రేడియో వింటే ఇదే ప్రాబ్లం :(
అలా అలా కొన్నాళ్ళయ్యాక కోయిల అసలు "రంగు" బైట పడుతుంది. ఎప్పుడంటే వసంతకాలం వచ్చినప్పుడు. రావడం ఏమిటి దాని వంశం బుద్ధులు ఏమవుతాయి? ఎన్నాళ్ళు నటిస్తుంది? వెంటనే గొంతు సవరించుకుని "కుహూ! కుహూ!!" అని వసంతరాగంలో ఒక కీర్తన ఆలాపన ఎత్తుకుంటుంది. అది విన్న తల్లి కాకికి ముందు ఏమీ అర్ధం కాదు. తర్వాతర్వాత "ఓహో! బహుశా నా అదృష్టం బాగుండి ఒక మధుర గాయని పుట్టింది నాకు" అని ఫీల్ అయ్యిపోతుంది. సాయంత్రం వాళ్ళ ఆయన బైట రోజంతా బలాదూర్ తిరిగి గూటికి చేరగానే కనీసం మంచినీళ్ళు , కాఫీ లాంటివి ఏమీ ఇవ్వకుండా "బావా! బావా! కాకిబావా! (కాకులు మొగుళ్ళని ప్రేమతో బావా అనే పిలుస్తాయి!!) ఇవాళ ఏం జరిగిందో తెలుసా?" అని ఊరిస్తుంది. అసలే పగలంతా ఎండలో పని లేకుండా ఎగిరెగిరి తిరిగి తిరిగి వచ్చాడేమో, మొగుడికి వీర చికాకేస్తుంది. ఇలా గూటికి వచ్చానో లేదో ఈ య(ల)క్ష ప్రశ్నలేమిటని! కాని విసుక్కున్నాడా ఆ పూట పస్తే అన్న నగ్న సత్యం తెలిసిన వాడు కాబట్టి నల్ల మొహం వీలయినంత తెల్లమొహం చేసి "ఏమో? ఇంతకీ ఏం జరిగిందేమిటి?" అని అంటాడు.
వెంటనే పిచ్చితల్లి "మన మొదటి పిల్ల చూసారూ. ఇందాకల ఏమి పాడిందో తెలుసా? బహుశా మా మేనత్త పోలికనుకుంటా! ఆ గొంతు, ఆ ఆలాపన! మీరు మిస్ అయిపోయారు. పోనిలెండి రేప్పొద్దున్న లేవగానే మళ్ళీ పాడమంటాను" అంటుంది. మగ కాకి "ఓస్! ఇంతేనా? ఇంకా ఈ పక్క గూడు మగడు ఇవాళ ఒక పెద్ద స్పూన్, ఫోర్క్ తెచ్చాడు తెలుసా? అని దెప్పుతుందేమో? అనుకున్నా! హమ్మయ్య ఈ పూటకి బ్రతికిపోయాను" అని మనసులో అనుకోని, "అలాగా? అయితే సరే" అని లేని, రాని ఆవలింత తెచ్చుకొని నాకు నిద్రొస్తోంది అని బోజ్జుంటాడు.
మర్నాడు పొద్దున్నే పెళ్ళాం కాకి, కావు, కావు మని కాకి గోల చేసి మొగుడిని, పిల్లల్నీ లేపెస్తుంది. ఇహ అన్నీ కలిపి బృంద గానం మొదలెడతాయి. మధ్యలో నేపధ్య గాయని లాగ "కుహూ! కూహూ!! అని మన పిల్ల కోయిల అందుకుంటుంది. వెంటనే తల్లి కాకి మొగుడిని పట్టుకొని "చూసారా? చూసారా? విన్నారా ఎంత బాగా పాడుతోందో నా చిన్ని తల్లి! నా బంగారు తల్లి " అని ఓ మురిసిపోతుంది. అప్పుడు మొగుడుకి అసలు విషయం కొంచం కొంచంగా మెల్లి మెల్లిగా అర్ధం అవుతుంది. ఎంతయినా బైట ప్రపంచం కాస్త ఎక్కువగానే చూసాడు కదా? అప్పుడు చెప్తుంది పెళ్ళానికి "పిచ్చి మొహమా? మీ మేనత్త పోలిక కాదు! గాడిద గుడ్డు కాదు! నువ్వు పోదిగింది కోయిల గుడ్డుని! ఇప్పుడు దీని అసలు రంగు, గొంతు బైట పడింది" అని జ్ఞానోదయం చేస్తుంది. దాంతో హతాశురాలైన తల్లి కాకి కాసీపు కావు కావుమని వాపోయి, ఆ కోయిల పిల్లని "ఏదీ! నీ పేస్ టర్నింగ్ ఇచ్చుకో!" అని అది మొహం చూపించగానే "ఛీ! అప్రాచ్యురాలా! నా కడుపున చెడ పుట్టావు కదే" అని నాలుక్కరుచుకుని "నా కొంపలో ఏమీ తెలీని నంగనాచి లాగ ఇన్నాళ్ళు ఏమి నటించావే! "పాడు" కోయిలా! ఛీ ఇహ నీ మొహం నాకు చూపించకు ఇవ్వాల్టి నించి" అంటుంది! ఓస్! మొహం చూపించద్దు అంతేగా అని అటు తిరిగి సెటిల్ అయ్యిపోతుంది పిల్ల కోయిల ;) అప్పుడర్ధం అవుతుంది తల్లికాకికి తను ఇంకా అమాయకురాలేనని. ఏదో తప్పు చెప్పానని! ఈ మెలోడ్రామా అంతా కొంచం దూరం నించి ఇంకో కొమ్మ మీదనించి చూస్తున్న మొగుడు కాకి ఇహ లాభం లేదని రంగప్రవేశం చేసి పిల్ల కోయిలతో "మొహం కాదు! అసలు నీ బాడీ నే ఓ సారి టర్నింగ్ ఇచ్చుకో" అని అది వెనక్కి తిరిగాక దాని తోకమీద ఒక్క తన్ను తన్ని "గెట్ అవుట్ అఫ్ మై నెస్ట్! యు బ్లడీ కోయిల్! అని గెంటేస్తాడు.
పాపం! పిల్లకోయిల "కొంపా, గూడు పాయే! తల్లీ, తండ్రి లేరాయే! నేననాధనయిపోయే! ఈ జీవితమింతేలే" అని ఒక విషాద గీతం తనిష్ట మొచ్చిన రాగంలో ఏడ్చుకుంటూ, క్షమించాలి, పాడుకుంటూ, అలా అలా హోరైజన్ లోకి నిష్క్రమిస్తుంది!
కథ కంచికి. కోయిల ఇంకో గూటికి!
PS: ఇలా ఈ "పాడు" కోయిల, కాకి చరిత్ర పునరావృతం అవుతూనే ఉంది!