ఇప్పుడే
ఒక కాకి "కావ్,
కావ్,
కావ్"
అని అరిచింది!
(అప్రస్తుత
ప్రసంగం! ఇలా
మూడు సార్లు అరవడానికి ఏదో
ప్రాతిపదిక, సాంప్రదాయం
ఉండి ఉంటుంది.
న్యాయస్థానంలో
కూడా ముద్దాయిలని,
సాక్షులని,
కేసు వేసిన
వాళ్ళనీ కూడా ఇలాగే బిళ్ళ
బంట్రోతు మూడు సార్లు పిలుస్తాడు!
వాడి చేతిలో
"చాయ్
పానీ" కి
పదో పరకో పెట్టక పొతే తర్వాత
వాయిదాలో ఎవ్వరికీ వినిపించకుండా
"అశ్వద్ధామ
హతః! కుంజరః!
అన్నసాంప్రదాయంలో
మెల్లిగా పేరు పిలుస్తాడు!
మూడు సార్లు
గబగబా పిలిచి "హాజిర్
నహి హై సాబ్" అని
జడ్జి గారికి చెప్పేస్తాడు!!)
మీరు
మరీనండి! మరీ
ఇంత బడాయా? రాయటానికి
ఏమి దొరక్కపొతే ఇలా కాకి
అరిచింది, కోయిల
కూసింది అని రాస్తారా?
అయినా కాకి
అరవడంలోనూ, అది
కూడా "కావ్,
కావ్,
కావ్"
మని అరవడంలోనూ
పెద్ద వింత ఏముంది?
కాకి పిల్లిలాగా
అరిచింది అని మీరు రాసినా
బాగుంది అని మీరు ప్రధమ కోపం
తెచ్చుకుంటే మీ తప్పు ఎంతమాత్రం
లెదు!
కాస్త
ఓపిగ్గా ఇంకొంచం చదివితే ఆ
కాకి అరుపులో విశేషం తెలుస్తుంది!
ఇంతకీ
ఇప్పుడు టైం ఎంతయ్యింది
అనుకుంటున్నారు?
ఓహ్!
నా మతిమండా?
నేను ఇది
ఎప్పుడు రాస్తున్నానో మీకెలా
తెలుస్తుంది? నేనే
చెప్తాను. ఇప్పుడు
నిలయంలో సమయం సాయంత్రం ఏడుగంటలు
దాటి ముప్ఫై నిమిషాలు అయ్యింది!!
మరిప్పుడు
అర్థం అయ్యిందా కాకి అరుపులో
విశేషం? కాకులు
ఎక్కడైనా రాత్రి 7-30కి
అరుస్తాయా? అఫ్
కోర్స్ (ఈ
పదాలకి సరైన తెలుగు మాట
తట్టడంలేదు!
దానిగురించి
టైం వేస్ట్ చెయ్యడం వేస్ట్!)
ఒక కాకి మొగుడు,
ఆ మొగుడి కాకి
పెళ్ళాం రాత్రి భోజనం అయ్యాక
దెబ్బలాడుకుంటే రాత్రి ఏ
టైంకైనా అరవచ్చు!
కాని నాకు అలా
రెండు కాకుల అరుపులు,
విరుపులు
వినిపించలేదు.
కేవలం ఒక్క
కాకి అలా మూడుసార్లు అరిచి
తన పనయ్యిపోయినట్టు ఎగిరిపోయింది.
ఎగిరిపోయింది
అన్నది నా ఊహాగానం!
ఎందుకంటే
చీకట్లో నల్లటి కాకి ఎగిరినా,
ఎగరకపోయినా
నాకు కనిపించదు!
(అసలే వృద్ధ్యాప్యం
దగ్గర పడుతోంది,
పైగా చత్వారం!)
ఇంతకీ
"వేర్
ఆర్ వుయ్?". ఒక
సినిమాలో సునీల్ అన్నట్టు
"రాస్తున్న
మీకే తెలీకపొతే,
చదువుతున్న
మాకేం తెలుస్తుంది"
అంటారా?
అనండి ఫర్వాలేదు!
మళ్ళీ
కథలోకి వస్తే కాకి రాత్రి
ఏడున్నరకి అరవడం విశేషమా
కాదా? నా
దృష్టిలో విశేషమే.
ఇక్కడ ఇంకో
విశేషం ఉంది! కాకి
ఇంట్లో అరిస్తే చుట్టాలు
వస్తారంటారు! కాబట్టి
ఈ సదరు కాకికి ఏదో ఉప్పందింది;)
కాని
మా ఇంట్లో ఇప్పుడు వచ్చే
చుట్టాలు ఎవరూ లేరే!
పోయిన వారమే
ఇద్దరు వచ్చారు!
మరిప్పుడు
ఎవరొస్తారు? అయినా
నాకు తెలీకుండా ఈ కాకికి ఎలా
తెలుస్తుంది? ఈ
రోజుల్లో చెప్పా పెట్టకుండా
పోవడం పెద్ద బ్యాడ్ హాబిట్
అయ్యిపోయింది కాని చెప్పాపెట్టకుండా
రావడం అన్నది లేదే?
ఆ మాటకొస్తే
ఒక్కసారి కాదు నాలుగు సార్లు
చెప్పి వస్తున్నారు!
ముందు మొబైల్లో
చెప్తారు, ఫలానా
రోజు వస్తాము అని.
ఇంకో రెండురోజులయ్యాక
మళ్లీ ఫోన్ చేసి ఫలానా రైల్లోనో,
బస్సులోనో,
లేక విమానంలోనో
వస్తున్నాము అని చెప్తారు!
ఆ ఫలానా రోజు
ఇదిగో ఇప్పుడే ఇల్లు వదిలాం,
బయల్దేరాం
అని ఒక ఫోనో, లేక
SMS పెడతారు.
ఆ రైలో,
బస్సో,
విమానమో లేట్
అయ్యిందని, లేక
కరెక్ట్ టైమేనని మళ్లీ ఇంకో
ఫోన్ లేదా మెసేజ్!
ఇదిగో రైల్,
బస్సు,
విమానం స్టార్ట్
అయ్యాయని ఇంకో ఫోన్ లేదా
మెసేజ్! ఇదిగో
ఇప్పుడే మీ ఊరి స్టేషన్,
ఎయిర్పోర్ట్
లో దిగామని ఇంకో మెసేజ్!
ఆటో లేదా టాక్సీ
ఎక్కామని ఇంకో ఫోన్ లేదా
మెసేజ్ ఇలా మనకి ప్రత్యక్ష
ప్రసారం ఇస్తారు కదా మరింక
నాకు తెలీకుండా ఈ కాకికి ఎలా
తెలిసిందో! ఎలా
తెలిసిందో అన్నదానికంటే ఎవరు
వస్తారో అని ఆలోచించడం
మంచిదనిపించింది.
మా
అమ్మ రెండు రోజుల క్రితం ఈ
ఊళ్లోనే ఉన్న నా అక్క వాళ్ళింటికి
వెళ్ళింది. రేపు
పొద్దున్న వస్తున్నానని నాకు
ఫోన్ చేసి చెప్పింది!
ఈ కాకిగారు
ఇంట్లో వేడికి నిద్ర పట్టకో,
లేక వాళ్ళ
ఆవిడతో దేబ్బలాడో అలా బైటకి
వచ్చి ఆ సెల్ టవర్ మీద
కూర్చున్నప్పుడు మా అమ్మ
ఫోన్ చేస్తే అది ఆ టవర్ మీద
ఆ మెసేజ్ పట్టేసుకుంది!
ఇంక అదేదో
పెద్ద "బ్రేకింగ్
న్యూస్" లాగ
వెంటనే నాకు చెప్పెయ్యకపోతే
దానికి ఇంటికెల్లినా నిద్ర
పట్టదు కాబట్టి వెంటనే దాని
పని గంటలు అయిపోయినా నా ఇంట్లోకి
(అంటే
మరీ హాల్లోకి కాదనుకోండి,
బైట కాంపౌండ్లోకి
అన్నమాట!) వచ్చి
అలా వెంటనే వచ్చిన,
అప్పుడే అందిన
సమాచారం సాంప్రదాయం ప్రకారం
అరిచి కాకి గోల చేసి వెళ్ళిపోయింది!!
ఇక్కడ
నేనొక "లా"
పాయింట్ లాగాలి!
అదేమిటంటే
నా దగ్గరే ఉన్న నా అమ్మ మళ్ళీ
నాదగ్గరకి వస్తూంటే ఆమె
చుట్టమవుతుందా?
అవ్వదు!
కాని ఈ కాకికి
మా ఇంట్లో సభ్యుల వివరాలు
అందినట్టు లేవు,
బహుశా ఆ మధ్య
జరిగిన "సార్వత్రక
సర్వే" కాపీ
దానికి అందలేదేమో?
ఈ విషయం మీద
అంటే ఇలా మన ఇంట్లోనే ఉంటున్న
వాళ్ళు అలా బైటికి రెండు
రోజులు వెళ్లి వస్తే ఈ కాకులు
వాళ్ళని చుట్టాల కింద పరిగణించి
వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తూంటే
ఇలా అరిచి కాకిసందేశం ఇవ్వడం
సబబేనా అని ఏదైనా టివి చానెల్లో
ఒక పానెల్ డిస్కషన్ పెట్టడానికి
అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి!
అంటే
బాధ పడుతుంది కానీ ఇప్పుడంత
అర్జెంటుగా నాకు చెప్పెయ్యాల్సిన
అవసరం ఉందంటారా?
కాని ఈ కాకి
కొంచం లోకజ్ఞానం తెలిసిన
కాకి అయ్యుంటుంది.
(ఇలా లోకజ్ఞానం
ఉన్న కాకుల్ని లోకులు అని
అందురు. అందుకే
కదా అంటారు "లోకులు
పలు కాకులు" అని!)
ఏమో రేప్పొద్దున్న
నా ప్రాణం ఉంటుందో ఉండదో,
ఒకవేళ నేను
(అంటే
కాకి, నేను
కాదు అని మనవి)
బతికుంటానో
లేదో, ఒకవేళ
నిద్రలోనే పొతే,
ఇలా నాకు
అందించాల్సిన సమాచారం
అందచెయ్యనందుకు,
పైలోకంలో
ఏవైనా కుంచం శిక్ష పడుతుందేమో?
ఎందుకొచ్చిన
గొడవ? ఇప్పుడే
చెప్పేసి ఇంటికి చక్కా పొతే
పోలా? అయినా
ఎవరో మహానుభావుడు అన్నాడు
కూడా "ఇవాల్టి
పని ఇవాళే చెయ్యమని".
అలా అలోచించి
ఆ కాకి రాత్రయ్యిపోయినా దాని
కర్తవ్య నిర్వహణ చేసేసి చేతులు
క్షమించాలి, రెక్కలు
దులుపుకుని వెళ్ళిపోయింది.
కథ
కంచికి! కాకి
దాని ఇంటికి!