Sunday, May 24, 2020

ఉపవాసం! Fasting.

పొద్దున్నే మా ఆవిడ "ఏమండీ" అని పిలిచింది
అయిపోయా!
ఏ మగడినైనా భార్య ఒకింత ముద్దుగా "ఏమండీ" అని కానీ, లేపోతే "ఏమండేమండేమండీ" అని ఒకింత గారాబంగానూ పిలిస్తే ఆ మగడు ఖల్లాస్!
ఇప్పుడు నాకేం లాసో?
"ఏమిటోయ్" అన్నా ఒక్క రవ్వ నీరసంగా
"రెణ్ణెల్ల నుంచీ రోజంతా తినడం పడుక్కోవడమే కదా? అందుకని ఇవాళ ఒక్కరోజు ఉపవాసం చేయండి" అంది
చచ్చాం! అలవాటు లేని పనాయె. కానీ ఆవిడకి కాదని చెప్పడమే?
"సర్లే ఉపవాసమేగా? శుభ్రంగా చేస్తా. ఇంతకీ ఉపవాసం అంటే ఎలా చెయ్యాలో" అని కూపీ లాగా
"ఆబ్బే. పెద్ద కష్టం ఏమీ కాదండీ. కేవలం వండిన పదార్ధాలు తినకూడదు అంతే" అంది
ఈ ఆడాళ్ళెప్పుడూ ఇంతే. తుఫానులైనా ముందస్తు హెచ్చరికలు చేస్తాయి కానీ వీళ్ళు సునామీ టైపు. ఒక్కసారిగా మీద పడిపోడమే!
ఈ ఉపవాసం గురించి నిన్నే చెప్తే ఒకింత ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేవాడిని కదా. నిన్న రాత్రి భోజనం ఎక్కువ తినడం. ఉపవాసానికి కావాల్సినవి అన్నీ కొనుక్కొచ్చుకోవడం వగైరా.
సరే ఇప్పుడు చేసేదేముంది. "ఓస్. అంతేనా. అయితే ఇవాళ ఉపవాసం. కంఫర్మ్" అని డిక్లేర్ చేసేసా
వెంటనే వంటింట్లోకి వెళ్లి డబ్బాలన్నీ వెదికి నాక్కావాల్సినవన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా. జీడిపప్పు, ఆ లయన్ బ్రాండ్ ఖర్జూరం, ఆల్మండ్, పచ్చి వేరుశెనగ పలుకులు, హార్లిక్స్ పౌడర్ కూడా చిన్న పోట్లాము కట్టా. ఇవన్నీ వండని పదార్ధాలేగా. మా అబ్బాయి లేచాకా ఓ రెండు సీసాలు కొబ్బరి నీళ్లు తెప్పిస్తా. మొన్న మా ఆవిడ "ఇంటినిండా వెధవ ఖాళీ సీసాలే" అని పారెయ్యబోతూంటే రెండు థమ్స్పాప్ ఒకటిన్నర లీటర్ సీసాలు "వేసంకాలం కదా ఫ్రిడ్జ్ లో నీళ్ళకి పనికొస్తాయి అని దాచడం మంచిదయ్యింది.
సరే తొమ్మిదింటికి పళ్ళబ్బాయి వస్తే ఓ మూడు కేజీలు బంగినపల్లీ (ఒక కేజీ ఫ్యామిలీకి ...అన్నీ నేనే తినేసేంత స్వార్ధపరుడిని కాదు) కొంటే ఎలాగోలా ఇవాళ్టి ఉపవాస కార్యక్రమం జయప్రదంగా ముగించచ్చు.
ఇవి సరిపోతాయా ఇంకేమన్నా నేను మర్చిపోయినవి ఉంటె అర్జెంట్గా చెప్పండి. ఎలానూ షాపులన్నీ తెరిచే ఉన్నాయి కాబట్టి మా అబ్బాయిని పంపించి తెప్పించుకుంటా.
మొత్తానికి ఈ "ముడి"సరుకంతా నా బెడ్ రూమ్ లోకి చేరేశా. అసలే ఎండలు మండిపోతున్నాయి. పైపెచ్చు ఉపవాసం. నీరసం మీద వడదెబ్బ తగిలితే బహు ప్రమాదం. మరంచేత ఇవాళంతా ఏసీ వేసుకుని మంచం దిక్కుండా సాయంత్రం దాకా కాలక్షేపం చేస్తా. ఇవన్నీ అయిపోయి ఇంకా నీరసంగా ఉంటే సినిమాల్లో పేద హీరో టెక్నీక్ ఎలానూ ఉంది. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి !
అన్నట్టు ఈ ఆడోళ్లన్నస్సలు నమ్మకూడదు. మొగుళ్ళ విషాయానికొచ్చేటప్పటికీ ఏ శాస్త్రాల్లోనూ లేని విషయాలు చెప్పి మనల్ని నిండా మోసం చేసేస్తారు. అంచేత నేనే శాస్త్రాలు ముందేసుకు కూర్చున్నా. ఏమన్నా శాపవిమోచనం టైపు ఉపాయాలు దొరుకుతాయేమోనని.
పదినిమిషాల్లోపే ఓ అద్భుతమైన ఉపాయం తట్టింది. పూర్వం యుధ్ధాలన్నీ, మహా సంగ్రామం కురుక్షేత్రంతో సహా, సూర్యోదయం నించీ సూర్యాస్తమయం దాకానేట! ఉపవాసం యుద్ధం కంటే గొప్పా ఏమిషి? అందుకని ఉపవాసం కూడా సూర్యాస్తమయం దాకానే! హమ్మయ్య. పెద్ద ప్రాణానికేం ఇబ్బంది లేదు.
మొన్న పచ్చడి చేద్దామని చిలకడదుంపలు కొన్నా. బద్దకించి పచ్చడి చేయకపోవడం మంచిదయ్యింది. సూర్యాస్తమయం ఇహ పది నిమిషాల్లో (రోజూ పేపర్లో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలు ఎందుకిస్తారా అని ఇన్నాళ్లు ఓ తెగ ఆలోచించా. ఇప్పుడు తెలిసింది!) అవుతుందనగా బెల్లంతో ఉడకపెట్టి నా ఉపవాస దీక్ష విరమిస్తా.
రాత్రికి నాకిష్టమైన వంకాయ కూర చెయ్యమని చెప్తే ఆవిడ బోల్డు హాశ్చర్యపడిపోయింది. ఉత్త యాక్టింగ్ లెండి. అదేమిటి ఉపవాసం ఉంటానని మళ్ళీ రాత్రికి భోంచేయడం ఏమిటీ అని. నాకు తెలీదనుకోకు. నేనిప్పుడే శాస్త్రాలు తిరగేసా. శుభ్రంగా రాత్రి భోంచేయచ్చు. అని తెగేసి చెప్పా. మొహం అదోలా పెట్టుకుని ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడవన్నీ పట్టించుకునే ఓపిక లేదు నాకు. అసలే ఉపవాసం.
అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నేనిక్కడ గంటగంటకీ మీ కామెంట్స్ కి జవ్వాబులివ్వడం లాంటి కార్యక్రమం చేస్తూంటా. ఓ గంటసేపు నా నించి ఏ విధమైన ఆక్టివిటీ లేకపోతె 108 కి ఫోన్ చేసి కబురందివ్వండి. అదేమిటి మాస్టారూ? మీ ఫామిలీ అంతా ఉన్నారుగా అని మీ అందరికీ ఓ గొప్ప అనుమాన సందేహం రావచ్చు. ఉన్నారు కానీ నన్ను పట్టించుకోరు. ఎందుకంటే ఇందాకే చెప్పానుగా ఇవాళంతా బెడ్ మీదే అని. ఒహవేళ నాకు పోషకాహారం తగ్గి కళ్ళు తిరిగి స్పృహ కోల్పోతే వాళ్లొచ్చి చూసి నేను హాయిగా ఏసీ వేసుకొని బొబ్బున్నానని వెళ్ళిపోతారు. నేనసలే ఉపవాసం కాబట్టి మధ్యాహ్నం భోజనానికి కూడా పిలవరు. మరదీ మేటర్. అందుకని నేను స్పృహలో ఉన్నానో లేనో అన్న దానికి అగ్నిపరీక్ష ఇక్కడ నా ఆక్టివిటీ నే. నా ప్రాణాలు మీ అందరి చేతుల్లో పెడుతున్నా.
ఇప్పుడే అందిన వార్త! శాస్త్రాల్లో వెదక్కా వెదక్కా నాకు తెలిసిన రహస్యం ఏమిటంటే ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండటం. అంటే ఉపవాసం అనే పదానికి దగ్గరగా ఉండటం అని అర్థం. దేనికి దగ్గరగా ఉండటం? దేవుడికి!
అంటే ఉపవాసం అంటే దేవుడిదగ్గర ఓ పీట, లేదా నాలాంటి భారీ కాయాలు నేలమీద కూర్చోలేం కాబట్టి, ఓ కుర్చీ వేసుకుని రోజంతా కూర్చొంటే అదే ఉపవాసం! ఇదే విషయం మా ఆవిడకి చెప్తే నమ్మదే? మీరన్నా చెప్పండి. ఓ మనుషోత్తముడి ప్రాణం నిలపెట్టిన పుణ్యం మూటకట్టుకోండి.

Monday, May 4, 2020

Gnanodayam. జ్ఞానోదయం

ఈ నా "రచన" మే 97 "రచన" మాసపత్రికలో ప్రచురించారు!


జ్ఞానోదయం!



ఓ సండే సాయంత్రం ఏం చెయ్యాలో తోచలేదు. డాబామీద అటూ ఇటూ పచార్లు చేస్తూంటే సడెన్గా ఓ విషయం అర్ధం అయ్యింది. అదేవిటంటే నేను బోల్డు కష్టాల్లో పడిపోయానని.


ఎవరన్నా బాత్రూములోనో, మెట్లమీదో పడ్డారంటే హాశ్చర్యపోవచ్చేమో కానీ కష్టాల్లో  పడ్డారంటే హాశ్చర్యపోనక్కరలేదు. ఎంచేతంటే ప్రతి మనిషికి "జాతస్యహి కష్టం ధృవం" అన్నారు పెద్దలు.


అయితే విచిత్రమేమిటంటే ఎవరన్నా అమ్మాయి కష్టాల్లో పడిందనుకోండి, అబ్బాయిలంతా ముందు హాశ్చర్యపడి తర్వాత జాలిపడి ఆ పైన ఆ అమ్మాయిమీద పడిపోతారు. దీన్నీ "డాంసెల్ ఇన్ డిస్ట్రెస్" ఫినామినా అంటాడు ఇంగ్లీషోడు.


అదీ నాబోటోడు కష్టాల్లో పడ్డాడనుకోండి.. ఈ జనాలు ఆశ్చర్యపడరు. జాలి పడరు. నా మీద విరుచుకు పడిపోతారు.


"వీడికీ మధ్య కళ్ళు నెత్తికెక్కాయి. కష్టాల్లో పడ్డాడంటే పడడా మరి? వీడికంతే కావాలి" అని బాడ్ ప్రాపగాండా ఒకటి. యాడింగ్ ఇన్సల్ట్ టు ఇంజురీ లాగా.

అదే అమ్మాయిలైతే? ఓహ్!

అమ్మాయిలంటే అందరికీ సాఫ్ట్ కార్నరే

అమ్మాయికి అందం కలిస్తే? మరిహ అడక్కండి

అందమైన అమ్మాయంటే గుర్తొచ్చింది. మా ఆఫీసులో కూడా ఓ అందమైన అమ్మాయుంది. మా ఇద్దరి టేబుల్ కీ మధ్య ఒక పిట్టగోడ అడ్డు.

నిలపడితే పిట్ట, కూర్చుంటే గోడ కనిపిస్తే దాన్ని పిట్టగోడ అంటారు.

మునుపు ఈ పిట్టగోడలు ఇళ్ల మధ్య, డాబాల మీద మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఆఫీసుల్లో కూడా దర్శనమిస్తున్నాయి.

ఈ పిట్టా వసపిట్ట కాదు. నసపిట్ట కూడా కాదు.

అదేం పనో కానీ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. కానీ మా ఆఫీసులో జీతాలే కానీ పనివ్వరనే అపభ్రంశ ఉందే?

మరీ అమ్మాయికేమిటో అంత పని. ఎప్పుడూ ఏదో రాసేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి పెళ్లి కానీ రోజుల్లో నాకో అనుమానం ఉండేది.

కొంపతీసి ప్రేమలేఖలు రాస్తోందో ఏమో. లేపోతే ఈవిడొక్కర్తికీ అంత పనేమిటి? అయితే ఆవిడ ఎవరినీ ప్రేమించిన దాఖలాలు నా డిటెక్షన్ కి అందలేదు.

మరేవిటి ఆ రాతలు?

ప్రేమలేఖలు రాయడం ప్రాక్టీస్ చేస్తోందేమో? నాకు ప్రేమలేఖలు రాయడంలో పెద్ద అనుభవం లేదు కానీ చాలా సినిమాల్లో చూసాను.

ముందు ఓ పేపర్ మీద "ప్రియమైన" అని రాస్తారు.

నచ్చదు. చింపి పారేస్తారు.

"మై డార్లింగ్" అని రాస్తారు. చింపేస్తారు

"మై డియర్" డిట్టో

"మై లవ్" డిట్టో

ఇలా రాస్తూ పారేస్తూ ఉంటారు

ఈ అమ్మాయి ఆ టైపు అయితే రోజూ ఆమె చెత్తబుట్ట నిండిపోవాలి. కానీ అది ఖాళీగానే ఉంటోంది.

మరీ కాగితాలన్నీ ఈ అమ్మాయి ఏం చేస్తున్నట్టూ? కొంపతీసి ఫైల్ చేయటంలేదు కదా? అందులోనూ అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో పరమ స్టుపిడ్ గా ఉంటారు. ఎప్పుడేం చేస్తారో చెప్పలేం.

"ప్రేమలో క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్" అన్నారాయె. ముందు ఈ డిస్కార్డెడ్ లెటర్స్ అన్నీ పారేస్తారు. మళ్ళీ ఏమనుకుంటారో ఏమో వాటినన్నింటినీ ఫైల్ చేస్తారు. ఆ లవర్ గాడు కానీ వాడి ఖర్మ కాలి వీళ్ళకి కొంచం కోపం తెప్పిస్తే ఆ ఫైలంతా చింపేస్తారు. కోపం డిగ్రీ పెరిగితే వాటిని తగలపెడతారు.  కోపం పతాకస్థాయికి చేరితే ఆ బూడిదని కాఫీలో కలుపుకుని తాగేస్తారు దధీచి లాగా!

ఇదేనండీ అమ్మాయిలతో వచ్చిన పేచీ! కుఛ్ భీ హో సక్తా హై. మధ్యలో ఈ హిందీ ఏమిటని చిరాకు పడితే నాకు చిరాకు. అసలింతవరకూ హిందీ మాటలు రాకుండా రాయడానికి యమా పరేషాన్ అయ్యాను. హైద్రాబాద్లో ఉంటూ హిందీ సే బచ్ కె కోయి నహి జీ సక్తా! జరా హిందీ, కొంచం తెలుగు,  లిటిల్ ఇంగ్లీష్ - ఈ మూడూ ఒకే వాక్యంలో వినిపిస్తే ఆ సీన్ హైదరాబాద్డి అని ఢంకా బజాయించి చెప్పచ్చు.

ఇద్దరు తెలుగువాళ్లు హిందీలో మాట్లాడే అతి పవిత్ర జాగా ఈ హైదరాబాద్.

అమ్మాయిని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను - ఈ అమ్మాయి హిందీలో ఒక్క మాట కూడా మాట్లాడడం నేను వినలేదు. పోనీ హిందీ రాదేమో అనడానికి వీల్లేదు. ఎంచేతంటే ఉత్తర భారతదేశంలో సాన్నాళ్ళుంది. అయినా ఏమిటో మేమంతా హిందీ వచ్చనే మాట్లాడుతున్నామా?

ఈ ఊరొచ్చిన కొత్తల్లో ఈ హిందీతో చాలా పరేషాన్ అయ్యేది. నా ఫ్రెండ్స్ లో కొందరు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినవాళ్లు. వాళ్లంతా  ధారాళంగా హిందీలో  మాట్లాడేస్తూంటే నాకు హిందీ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చేది. వాళ్ళు నవ్వితే మనం నవ్వడం. సీరియస్గా  ఉంటే డిట్టో.

హిందీ అంకెలతో మరీ చిక్కు. ఓసారి ఓ రిక్షావాడితో బేరవాడేను. వాడు దేడ్ రూప్యా అన్నాడు. నేను అదేం కుదర్దు. అడయ్ రూప్యా అన్నా. వాడు ఓ అయిదు నిమిషాలు దెబ్బలాడి ఒప్పుకున్నాడు. నేను విజయగర్వంతో నా ఫ్రెండ్స్ కి చెప్పాను "నాకు హిందీ వచ్చేసిందోచ్" అని. వాళ్ళు నా వేపు గజ్జి కుక్కపిల్ల వేపు చూసినట్టు జాలిగా చూసారు. తర్వాత జ్ఞానోదయం చేసారు. దేడ్ రూపయా అంటే రూపాయిన్నరని,  అడయ్ రూప్యా అంటే రెండున్నరని. అప్పటినించీ బేరాలు మాత్రం హిందీలో మానేసాను. ఆ రోజే నిశ్చయించుకున్నా ఎలాగైనా హిందీ నేర్చుకోవాలని.

ముఫై రోజుల్లో నేర్చుకునే హిందీ పుస్తకం కంటే హిందీ సినిమాలు ఎక్కువ ఉపయోగం అనిపించింది. అంతే కనిపించిన ప్రతి హిందీ సినిమా చూసాను. బోల్డు హిందీ మాటలొచ్చేసాయి

ఓ రోజు మా ఫ్రెండ్స్ అంత ట్యాంకుబండు మీద చతికిల పడ్డాం. వాళ్లంతా హిందీమే బాత్ ఛీత్. నా హిందీ నాలెడ్జి చూపించాలి. ఓ టీనేజ్ బ్యూటీ అలా వెళ్తోంది. నేను వెంటనే "క్యా ఖాన్డాన్ హై" అన్నా. ఫ్రెండ్స్ అంతా వెర్రి చూపులు చూడ్డం మొదలెట్టారు. వెధవలు. నా హిందీకి షాక్ అయ్యినట్టున్నారు. అంతే తెగ రెచ్చిపోయాను.

"క్యా ఉమర్ హై"

"క్యా దిల్ హై " వగైరా వగైరా

మా వాళ్ళ మొహాలన్నీ జరా సా రిన్ పెట్టి ఉతికినట్టు అయ్యిపోయాయి. అప్పుడడిగాను "కైసా హై హమారా హిందీ" అని. ఒకడు నాకర్ధం కానీ అవుట్  అఫ్ సిలబస్ హిందీ మాట వాడాడు. దాంతో నాక్కోపం వచ్చేసింది. వెంటనే హిందీ సినిమాల్లో తల్లినో, చెల్లినో దహనం చేస్తూ ఆ మంటల పక్కన హీరో అనే మాటలన్నీ అప్పచెప్పేసా "మై బద్లా లూన్గా", "తుమ్హారా ఖూన్ పీవూన్గా" etc

ఇంతకీ వేరార్ ఉయ్? అమ్మాయి దగ్గర కదూ. ఓ ఫైన్ మార్నింగ్ ఆ అమ్మాయి పెళ్లి చేసేసుకుంది. నేనేం తక్కువ తినలేదుగా? ఆ ఫైన్ మార్నింగ్ కి ముందు రోజు ఈవెనింగ్ నేను కూడా పెళ్లి చేసేసుకున్నాను.

గమ్మత్తేవిటంటే పెళ్లయ్యాక కూడా ఆ అమ్మాయి ఆ రాత ఆపలేదు. ఆ మిస్టరీ ఏమిటో నాకు అంతుపట్టలేదు. ఆఖరికి ఆ మిస్టరీ సాల్వ్ చేయడం నా జీవితాశయం అయిపొయింది.

ఆవిడకి తెలీదు కానీ పాపం ఓ విషస్ సర్కిల్ లో పడిపోయింది. పళ్ళ చెట్టుకే రాళ్ళ దెబ్బలని. పని చేసేవాళ్ళకే పని. మాలాంటి వాళ్లకి కేవలం పాలిటిక్సే! చేస్తోంది కదా అని అందరూ ఆమెకే పనిచ్చేవారు. ఇంకా చేసేది. ఇంకా ఇచ్చేవాళ్ళు. శిష్యా! ఇది అనంతం.

వేసంకాలంలో వానజల్లులాగా మాలాంటి వాళ్ళక్కూడా అప్పుడప్పుడూ కొంచం పనిస్తూ ఉంటారు. కానీ అలవాటు లేని ఔపోసన కదా. మరింక ఎలా వదుల్చుకోవాలి. దానికో సింపుల్ ఫార్ములా ఉంది.

చిన్న పనయితే మందాకా అనవసరమని కిందవాళ్ళకి తోసెయ్యడం. పెద్ద పనైతే మనవల్ల కాదని పైవాడికి నెట్టెయ్యడం. కానీ పాపం ఈ అమ్మాయికి ఈ కళకూడా లేదు. నీరు పల్లానికే వచ్చినట్టు అందరి పనీ ఈమెకే.

ఈ అమ్మాయిని చూస్తే "చిత్ర చిత్రముల్ అమ్మాయి చిత్తముల్" అనిపిస్తుంది. ఇదేమాట ఆమెతోనే అనేసాను. "ఇందులో చిత్రమేమిటుంది" అని కొట్టి పారేసింది. అమ్మాయిలతో ఇదే గొడవ. వాళ్ళు నిజం చెప్పారు. మనం చెప్తే ఒప్పుకోరు.

పేకాటలో ఒక్కరూ కూర్చుని ఆడుకునే  ఆట ఒకటుంది. ఆ ఆటలాంటిదేవైనా డెవలప్ చేస్తోందా కొంపతీసి. కానీ అదేం కుళ్ళు. నాలాంటి వాళ్లకి చెప్తే మేము కూడా ఆడతాం కదా . లేకపోతే దాన్ని ఒకరికంటే  ఎక్కువ మంది ఆడేటట్లు ఫర్దర్  డెవలప్ చేస్తోందా? ఎంతైనా ఆడోళ్లకి సీక్రెట్స్ ఎక్కువ. వాళ్ళ వల్లకాదు కానీ కుదిరితే పిల్లల్ని కూడా సీక్రెట్గా కనేస్తారు.

అన్నట్టు నాకొక్కడికే పిట్టగోడ.. మిగతా వాళ్లందరికీ ప్రహరీ గోడ! అంచేత నేనంటే అందరికీ జెలసి. నేనసలు గంగిగోవుని. నువ్వు ఆవు కాదు COW అంటారు మా వాళ్లంతా. వాళ్లకే ఇంగ్లీష్ వచ్చినట్టు.  తర్వాత్తెలిసింది  COW అంటే ఆవు కాదుట "క్యాట్ ఆన్ ద వాల్" ట

అసలు గోడమీద పిల్లి అంటే మా గోపిగాడు. ఓ రోజు వాడితో అన్నా "గోపీ అంటే ఏమిటో తెలుసా" అని. తెలీదన్నాడు. చెప్పాను "గోపీ అంటే గోడ మీద పిల్లి" అని. వాడికి ఏడుపొచ్చేసింది. అప్పుడు వాడింకా నిక్కర్లేసుకునేవాడు. అఫ్ కోర్స్ నేను కూడా. వాడు కాస్సేపేడ్చి నేను గోపీ కాదన్నాడు.

"మరెవరు వాడన్నవా" అన్నా

కాదన్నాడు

"వాడి తమ్ముడివా"

కాదన్నాడు

"వాడి భూతానివా"

భూతం అనగానే భయమేసి మళ్ళీ ఏడ్చేశాడు.

"నేను గోపీనే కానీ ఆ గోపీని కాదు" అన్నాడు

నాకు వెంటనే అనుమానం వచ్చింది. నాకు తెలీకుండా నాకివ్వకుండా వాడొక్కడే మందు కొట్టేస్తున్నాడేమోనని. లేకపోతే ఆ వాగుడేవిటి. గోపీయే కానీ ఆ గోపీ కాదుట. సరే ఈ గోపీ వేరే అని ఓదార్చాను

అప్పటినించీ వాడ్ని నేను గోపీ అని పిలవకూడదుట. "నేను పిలవను సరే అంతా అలాగే పిలుస్తారుగా మరెలా" అనడిగా. వాళ్లకి ఈ అర్ధం తెలీదుగా అన్నాడు. నేను కూడా ఈ అర్ధం తోనే పిలుస్తా అన్నా. చాలాసేపటి ఒప్పుకున్నాడు. కానీ వెధవకి ఇప్పటికీ అనుమానమే.

ఇంతా ఈ అమ్మాయి ఏమిటి రాస్తోంది అన్నది నేనిప్పటికీ కనిపెట్టలేదు